మనోహరం @

 మనోహరం 

రోజూ సిటీ బస్ లో ఇంటి నుంచి కాలేజీ కి, కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్నా, కొన్ని కొన్ని రోటీన్ సంఘటనలు మళ్ళీ మళ్ళీ గుర్తుండిపోతాయి.


వసుంధర ఆ ఊరి విమెన్స్ కాలేజ్ లో కామర్స్ లెక్చరర్ గా చేరి ఆరు నెలలవుతోంది. ప్లెజర్ బండి ఉన్నా సిటీ బస్ లో వెళ్ళడమే ఇష్టం ఆమెకి. రకరకాల జనాల్ని గమనించడం, తనకి ఇంకొక వ్యాపకమైన రచనా వ్యాసంగం లో వాళ్ళకి జీవం పోసి మంచి కధలు వ్రాయడం ఆమెకి అత్యంత సంతోషాన్నిచ్చే విషయం.

గత రెండు వారాలుగా ఆమె ఒక అమ్మాయిని గమనిస్తోంది. ఆ అమ్మాయి చక్కటి రూపంతో పుస్తకాలు హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుని తను ఎక్కే బస్ స్టాప్ లోనే ఎక్కుతుంది. తర్వాత బస్ స్టాప్ లో దిగిపోతుంది.

కొన్ని సార్లు ఆ అమ్మాయి బస్ దిగంగానే బస్ బయలుదేరేది కాబట్టి తను ఎక్కడికి వెళ్ళేదో తెలియదు. రెండు మూడు సార్లు బస్ ఇంకా కొంత మందిని ఎక్కించుకోవడంలో బయల్దేరడం లేట్ అయినప్పుడు ఆ పిల్ల ఒక యువకుడి వెనకాల మోటార్ సైకిల్ మీద అతని వెనకాలే ఎక్కడం గమనించింది. ఒక్కొక్క సారి వారు బస్ ని దాటి స్పీడ్ గా వెళ్ళేవారు. ఆ పిల్ల అతని నడుము చుట్టూ చెయ్యి వేసి మనోహరంగా నవ్వుతూ కనిపించేది.

వసుంధర కి మొదట్లో అందమైన జంటలాగ అనిపించింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత వారిని జాగ్రత్తగా పరిశీలిస్తే, కుతూహలం, ఆందోళన, చివరకు దిగ్భ్రాంతి కలిగింది.

సాయంత్రం కూడా ఆ అమ్మాయి తను దిగవలసిన స్టాప్ కి ముందు ఒకటి రెండు స్టాపుల ముందు స్టాప్ లో బస్ ఎక్కేది. ఆ యువకుడు తనని బస్ ఎక్కించి బస్ కదిలాక వెళ్ళిపోయేవాడు.

రోజూ ఆ అమ్మాయి తండ్రో , తాతగారో బస్ స్టాప్ కి వచ్చి బస్సెక్కించి వెళ్ళిపోయేవారు. మళ్ళీ సాయంత్రం ఆ అమ్మాయి బస్ దిగేవేళకి బస్ స్టాప్ లో ఉండేవారు.

ఇది రెండు మూడు సార్లు జరిగాక వసుంధర కి రకరకాలైన ఆలోచనలు కలిగాయి. ఏమైనా లవ్ అఫైర్ ఏమో అనుకుంది. ఆ తండ్రిని, తాతగారిని చూస్తే శ్రోత్రియ కుటుంబం లాగ అనిపించింది. వారిని మోసం చేసి ఆ యువకుడితో ప్రేమాయణం వెలగబెడుతోందా ? అన్న శంక కూడా కలిగింది. ఓ‌ పది రోజులయ్యాక ఒకరోజు సాయంత్రం రష్ గా ఉండడంతో ఆ అమ్మాయి రెండు స్టాపులు నిల్చునే ప్రయాణం చేసింది, అది కూడా వసుంధర సీటు పక్కనే !

వసుంధరను ఆమె పట్టించుకోలేదు కాని వసుంధర యథాలాపంగా ఆ అమ్మాయి పాదాలకేసి చూసి నిర్ఘాంత పోయింది.

********

కాలేజీలో లంచ్ టైం లో సైన్స్ బ్లాక్ వైపు వెళ్ళి వెతుక్కుంటూ వెళ్ళిన వసుంధరకి ఆ అమ్మాయి తేలికగానే కనిపించింది.

లంచ్ అయిపోయినట్లుంది, ఆ అమ్మాయి సెల్ ఫోన్ లో మెసేజ్ టైప్ చేస్తోంది.

తన ఎదురుగా ఎవరో నిలబడినట్లు అనిపించి తలెత్తి చూసి వసుంధరను గుర్తు పట్టి చిరునవ్వుతో పలకరించింది.

"మీరు కొత్తగా కామర్స్ లెక్చరర్ గా వచ్చారు కదా మేమ్ ! నమస్తే !"

"అవునమ్మా ! నేను ఉండేది కూడా మీ ఇంటికి దగ్గరలోనే, చాలా సార్లు బస్ లో చూస్తూ ఉంటాను. నీది సైన్సు, నాది కామర్స్ అయ్యేసరికి మనకి పెద్ద టచ్ లేదు, నేను రోజూ చూస్తూనే ఉంటానమ్మా ! మీ నాన్నగారో, తాతగారో ఎక్కిస్తూ ఉంటారు కదా ?"

"అవును మేమ్ ! మా నాన్నగారు, తాతగారికి నన్ను కాకెత్తుకుపోతుందేమో అని భయం" అంది కొంటెగా.

"నీ పేరేమిటమ్మా ?"
"ముగ్ధ !"

అప్రయత్నంగా "ఎంత చక్కటి పేరమ్మా ! మీ ఇంట్లో లలితా అమ్మవారి భక్తులా ?" అని అన్నది వసుంధర.

"అవును మేమ్! మా ఇంట్లో శ్రీచక్రం ఉన్నది."
"మరి అంత భక్తిప్రపత్తులు కల ఇంట్లో పిల్లవి ఇలా చేయచ్చా ?"

"నేనేం చేశానండీ ?" అప్రయత్నంగా కలిగిన తొట్రుపాటుని దాచాలని విఫలయత్నం చేస్తూ అన్నది ముగ్ధ.

"చూడమ్మా ! నాకు మనుషులని పరిశీలించడం హాబీ. నా పరిశీలన బట్టి వారిని అంచనా వేస్తూ ఉంటాను. నా అంచనాలు చాలావరకు సరైనవే. నిన్ను అబ్జర్వ్ చేస్తే నువు తప్పు దారిలో వెళ్తున్నావని అనిపించింది."

"నా గురించి మీ అంచనా ఏమిటో చెప్పండి !" అన్నది రోషంగా ముగ్ధ.

"నువ్వు శ్రోత్రియ కుటుంబం నుంచి వచ్చావు. కానీ నీ ఇష్టం అయిన చదువు కొనసాగించడానికి ఇంట్లో వారు అడ్డు చెప్పరు. నువ్వంటే వారికి అంత ప్రేమ."

"ఇంకా ?"
"నీకు ఏ హానీ రాకూడదని వాళ్ళు స్కూటీ లాంటివి ఇవ్వకుండా బస్ ఎక్కిస్తున్నారు."

"ఇది కొంతవరకు రైటే !"
నీకు అన్నలు లేరు. ఒకత్తెవే కూతురువి అయి ఉండాలి లేకపోతే తమ్ముడో, చెల్లాయో ఉండి ఉండాలి."

"ఇంకా" పళ్ళ బిగువున అన్నది ముగ్ధ.
"నీకు అనవసరంగా ఎక్కువ స్వతంత్రం ఇచ్చారు మీ ఇంట్లో!"

చటుక్కున లేచి నిలబడింది ముగ్ధ " మేడమ్ ! సరదాగా
ఏదో చెబుతున్నారని అనుకుంటే మీరు కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు. నా గురించి ఎందుకు అలా అన్నారో చెప్పండి !"

"మీ ఇంట్లో నిన్ను ముద్దుగా చూసినా నువు వాళ్ళ కన్ను కప్పి బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్నావు కదూ ?"

బేలగా కూలబడింది ముగ్ధ. "నో ! అతను బాయ్ ఫ్రెండ్ కాదు. మీరు పొరబడుతున్నారు."

"మరెవరు ? అతని నడుము చుట్టూ చెయ్యి వేసి బైక్ మీద వెళ్ళడం అది నేను చూడడం పొరబాటా ?"

"అది మీకు అనవసరం !" ఎటో చూస్తూ అన్నది.

"నాకు అనవసరమే, కానీ పెళ్ళైన పిల్లవి. ఇంట్లో వారికి తెలియకుండా ఇలా తిరగడం అవసరమా ముగ్ధా ?"

"మా ఇంట్లో చెప్పనంటే మీకు చెబుతాను"

"అది నేను కన్విన్స్ అవడం బట్టి ఉంటుంది."

"నాకు పెళ్ళైందని ఎలా ఊహించారు ?"

"నిన్న బస్ లో నా పక్కనే నుంచున్నపుడు నీ కాలి వేళ్ళకి మట్టెలు గమనించాను. అప్పుడు ఇంకా జాగ్రత్తగా గమనిస్తే నువు జాగ్రత్తగా దాచిన సూత్రాలు మెడలో కనిపించాయి."

"సరే ! ఇంత కనిపెట్టాక ఇంకా దాయడం ఎందుకు ? అతనే నా భర్త ! మొన్న జ్యేష్ట మాసంలో నా పెళ్ళి అయింది. తను నాకు బావే ! మేనత్త కొడుకు. మాకు ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమ. తను అడిగితే నరకానికి కూడా కళ్ళు మూసుకుని వెళ్తాను."

అయోమయంగా " నీ భర్తా ? మరి ఈ కళ్ళు కప్పి తిరగడం ఎందుకు ? మీ వాళ్ళు వెయ్యి కళ్ళతో నిన్ను కాయడం ఎందుకు ?"

సిగ్గుగా "మా పెళ్ళి జ్యేష్ట మాసంలో జరిగింది. శోభనానికి ఆషాఢ మాసం అడ్డం వచ్చింది. మంచి ముహూర్తాలు శ్రావణ మాసంలో కానీ లేవుట. మా ఇంట్లో ఈ పట్టింపులు ఎక్కువ. మేమెక్కడ తొందరపడతామో అని ఈ కాపలా ! మేము కూడా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతాం కానీ ఆ మధుర క్షణాలను చెడగొట్టుకునే ఆలోచన లేదు. ఈ విషయం వారికి చెప్పే సాహసం నా దగ్గర లేదు. ఎంతా ? ఇంకా వారం రోజులే !" అని కళ్ళు దించుకుంది ముగ్ధ, మనోహరమైన అనుభూతితో.

అంతవరకూ నోరు తెరిచేసి వింటున్న వసుంధర ముఖంలో చిరునవ్వు ఉదయించి ముగ్ధ రెండు కణతలకీ అరచేతులు ఆనించి తన కణతల దగ్గర మెటికలు విరిచింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @