చిన్న పాత్రలతో రామాయణం -. మారీచుడు



రామాయణంలో చిన్న పాత్రలు 

మారీచుడు 

పక్షుల కిలకిల కలకలారవాలతో సందడిగా ఉన్న ఆ చిట్టడవిలో సర్రుమంటూ బాణం దూసుకుపోవడమేమిటి, అది లక్ష్యాన్ని తాకగానే వికృతంగా హరిణి మరణరావం ఆ వనమంతా ప్రతిధ్వనించింది. ..!!

క్షణంలో మనిషి గొంతుక అంతకన్నా వికృతంగా, "హా సీతా ! హా లక్ష్మణా !" అని దిక్కులు పిక్కటిల్లేలా వినబడింది. 

ఆ బాణప్రయోగం చేసిన ఆజానుబాహుడు, చామనచాయ రంగులో, పురుషులనైనా మోహంలో ఓలలాడించగలిగిన రూపసి శ్రీ రాముడు రవంత తొట్రుపాటు తో భృకుటి ముడిచి తన బాణం చేరిన లక్ష్యం వైపు వడివడిగా అడుగులు వేసాడు. 

అక్కడికి చేరే లోపు మరొకసారి "హా సీతా ! హా లక్ష్మణా !" అని ఇంచుక తక్కువ తీవ్రతతో కేక వచ్చింది. ఈ సారి శ్రీరాముడి నడకలో వేగం ఎక్కువయ్యింది. 

ఆ కేక వినిపించిన చోటికి చేరిన ఆ వీరునికి అనూహ్యమైనది కాకపోయినా, జుగుప్స కలిగించే దృశ్యం కనబడింది. 

బంగరు రంగులతో మిలమిల మెరుస్తున్న సారంగం బదులు కాలవర్ణంతో, జటావల్కలాలతో వికృత రూపం తో తాపసి కనిపించాడు. 

రాముడు కనపడగానే ఆ తాపసి మోములో ఒక మెరుపు, వర్ణించనలవికాని ఆనందం, కన్నీరు !

 వందనమాచరించడానికా అన్నట్లు చేతులెత్తాడు. పూర్తి చేయడానికి అలవి కాక అనేక ఆలోచనలు ముప్పిరిగొనగా అతి కష్టంగా "రామా !" అనగలిగాడు.
 
"శ్రీ రామా ! నా ప్రభువు రావణుడి పనుపుమీద విశ్వామిత్రుడి యాగం భగ్నం చేయడానికి సిద్ధాశ్రమంలో మొదటిసారి చూశానయ్యా ! అప్పటికి మీసాలు అప్పుడప్పుడే వస్తున్న నీ ముఖం చూసి, నీ తమ్ముడు లక్ష్మణుడిని చూసి చులకనగా నవ్వుకుని వీరేం చేస్తారులే ? ఆ విల్లంబులు చూసి భయపడతామా అని నాలుక చప్పరించేశాను తండ్రీ ! 

సుబాహుడిని ఆగ్నేయాస్త్రంతో ఇట్టే మట్టుపెట్టేశావు. అయినా వక్రబుద్ధి పోక నీ మీదకు పరుగెత్తాను రామా ! 

నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం నన్నెందుకు నా తమ్ముడి దారిన నన్ను పంపలేదేమా అని ! మానవాస్త్రం సంధించి వేల యోజనాల దూరం విసరికొట్టావు దేవా !

ఆ ప్రహారానికి కొన్ని సంవత్సరాలు నేనేమి చేస్తున్నానో తెలియని పరిస్థితిలో ఉండిపోయాను. ఆ తర్వాత నెమ్మదిగా గతం జ్ఞప్తికి వచ్చి బుద్ధి తెచ్చుకుని తాపసీ వృత్తి చేపట్టాను. 

కొంతకాలం క్రితం నా సహచరులు నువ్వు జటావల్కలాలు ధరించి సతీ సోదర సమేతంగా ఈ అరణ్యంలో ప్రవేశించినట్లు చెప్పుకోగా విని కేవలం కుతూహలంతో, నిన్ను భయపెట్టగలనని దురాశతో నీవుండే తావుకి వచ్చాను. నన్ను చూసి పక్షులను భయపెట్టి తరిమే మెత్తటి బాణం సంధించావు స్వామీ ! 

ఒక్కసారి నా దేహం, మనస్సు స్పృహ లోకి వచ్చి వాయువేగంతో అక్కడ నుంచి పలాయనం చిత్తగించాను. కొన్ని వారాల పాటు నాలో ఆవేగం తగ్గలేదు. 

రా తో మొదలయ్యే ఏ పదం అంటే రాజ, రత్న, రధ - ఇలాంటి మాట వినిపించగానే ఆ రెండవ అక్షరం మ అవుతుందేమోనని అక్కడినుంచి పారిపోయేవాడిని ప్రభూ !

ఇంక పూర్తిగా తపస్సుకి అంకితమై శివారాధన లో మునిగిపోయిన నన్ను నా ప్రభువు రావణాసురుడు మాయా మృగం రూపంలో నిన్ను ఆకర్షించి వనం మధ్యలోకి తీసుకుని పోతే నీ అర్ధాంగి సీతను అపహరిస్తానని కోరాడు.
 
రాముడంటే సామాన్యుడు కాడు, 
"రామో విగ్రహవాన్ ధర్మః 
సాధుః సత్య పరాక్రమ "

అని పదేపదే చెప్పి చూశాను. ఊహూఁ వినలేదు. 
వినాశకాలే విపరీత బుద్ధి అనిపించింది. 

రాముడు నన్ను చూస్తే చంపేస్తాడు. అని చెప్పాను. నేను చెప్పినట్లు చేయకపోతే నేనే నిన్ను చంపేస్తాను అని అన్నాడు తండ్రీ ! 

ఆ అసురుడి చేత మృత్యువు పాల పడే కన్న నీ బాణఘాతానికి బలై ఉత్తమగతులు పొందుదామని నిశ్చయించుకున్నాను పరాత్పరా ! 

నీ బాణ ఘాతం తగలగానే నన్ను ఆ నాడు చంపకుండా ఎందుకు వదలివేశావో అవగతమైంది, నేను ఒనరించవలసిన మహత్కార్యం ఇప్పుడు చేయవలసి ఉన్నదని, రావణ వధకు, లోకోపకారానికి నా వంతు కార్యం నేను చేస్తున్నానని.

నేను చేసిన తపస్సు నన్ను ఇప్పటిదాకా ప్రాణాలతో ఉంచింది శ్రీ రామా ! లేకపోతే నీ బాణం తగిలిన తరువాత ఇంతసేపు బ్రతకడం అసంభవమే తండ్రీ !

పోయే ముందు అమ్మ సీతమ్మ, లక్ష్మణుడి పేర్లు కూడా తలచి పాపవిముక్తుడనైనాను శ్రీరామా ! చివరిలో నీ పేరే తలుస్తున్నాను భగవాన్ ! పాహి పాహి ! త్రాహి త్రాహి!"
ఈ మాటలు తన మనస్సులోనే అనుకుంటుండగా కళ్ళు మూతలు పడిపోవడం తెలిసి "శ్రీరామ ! శ్రీరామ !" అనుకుంటూ ప్రాణాలు వదిలేశాడు మారీచుడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @