ఆలుమగలు@
ఆలుమగలు
ఫోన్ లో ప్రాణ స్నేహితుడు శివ శంకర్ హాస్పిటల్ లో ఐ సి యూ లో ఉన్నాడని, ఇంకా కొద్దిగంటలే ఉన్నది అంతిమ ఘడియలకి అని చెప్పారని తెలిసి హడావుడిగా బయల్దేరాడు మారుతీ ప్రసాద్. ఊహించిన కబురే ఐనా ఆ సమయంలో గొంతుకి ఏదో తెలియని వస్తువు అడ్డం పడినట్లు ఫీలింగ్. కళ్ళ నీళ్ళు ఊరుతున్నాయి.
అంతకు నెలరోజుల క్రితమే శివశంకర్ భార్య అంబిక హఠాత్తుగా మరణించింది. ఆమె చాలా రోజులనుండి ఊపిరితిత్తులలో నెమ్ము తో బాధ పడుతున్నా అంత హఠాత్తుగా పోతుందని ఎవరూ ఊహించలేదు. స్నేహితులిద్దరి మధ్య కూడా ఆ ప్రస్తావన రానేలేదు. వారిద్దరి మధ్య శివ శంకర్ కాన్సర్ గురించే చర్చలు జరిగేవి. శివశంకర్ కి ప్రోస్టేట్ కి సంబంధించిన కాన్సర్. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. బాగానే కంట్రోల్ అయింది.
అంబిక కు ఈ విషయం చెప్పొద్దని మిత్రుడి దగ్గర మాట తీసుకున్నాడు శివశంకర్. మొదటిలోనే గుర్తించారు కాబట్టి దాదాపు పూర్తిగా నయమవచ్చు అని డాక్టర్ చెప్పాడు.
ఈ విషయం తెలిస్తే అంబిక ఆరోగ్యం ఏమౌతుందో అని ఆమెకు చెప్పద్దని స్నేహితుడిని అభ్యర్ధించాడు శివశంకర్.
వారిద్దరికీ పిల్లలు లేరు. ఇద్దరి వైపూ దగ్గరి బంధువులు కూడా ఎవరూ లేరు. శివశంకర్ కి వచ్చే పెన్షన్ తో వారిద్దరికీ సౌకర్యంగానే గడిచిపోయేవి రోజులు. పెద్ద ఖర్చల్లా అంబిక ట్రీట్మెంటే.
ఇవన్నీ ఆలోచిస్తూ ఉండగానే ఆటో హాస్పిటల్ ముందు ఆగింది.
**********
స్పెషల్ డ్రెస్ లో ఐ సి యూ లోకి వెళ్ళిన మారుతి మిత్రుణ్ణి చూసి విస్తుపోయాడు. వారం రోజుల క్రితం శివశంకర్ కి, ఈ శివ శంకర్ కి పోలికే లేదు.
కళ్ళు లోతుకు పోయి గుడ్లు పైకి పోయి ఎగ ఊపిరి తీసుకుంటున్నాడు. చేతులు, కాళ్ళు పుల్లల్లాగా అయిపోయాయి. గుండె పనిచేస్తున్నట్లు మానిటర్ మీద ఈ సీ జీ చూపిస్తున్నది. నెమ్మదిగా తల దగ్గరకు వెళ్ళి "శివా ! శివా !" అని పిలిచాడు.
అక్కడ అతని బెడ్ దగ్గరి స్పెషల్ నర్సు "ఏమీ వినిపించడంలేదండీ ! సెమీ కోమా లో ఉన్నారు." అన్నది. కానీ ఆశ్చర్యంగా శివశంకర్ లో కదలిక వచ్చింది. కొద్దిగా కళ్ళు ఫోకస్ చేసుకుని, మారుతిని చూసి సైగ చేశాడు. అతనికి దగ్గరగా నోటి దగ్గర చెవి పెట్టాడు. "ట్ ట్ టేబుల్ మీద కవర్.... !" అని ఇంక మాట్లాడలేకపోయాడు శివశంకర్.
పక్కనే ఉన్న చిన్న టేబుల్ మీద ఉన్న కవర్ తీసుకున్నాడు మారుతి. దాని మీద కొద్దిగా వణుకుతున్నట్లు ఉన్న చేతివ్రాతతో మారుతి అని ఉన్నది. అది తీసుకుని ప్రశ్నార్థకంగా చూశాడు మిత్రుని వైపు. కొద్దిగా చేతులు ఎత్తి దణ్ణం పెట్టబోయాడు శివశంకర్. కళ్ళ నీళ్ళతో ఆ చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు మారుతి. నర్సు మానిటర్ మీద రీడింగ్ లు చూసి "మీరు వెళ్ళిపోండి సార్ ! కొంచెం శ్రమ అయినా ఆక్సిజన్ లెవెల్ లో తేడాలు వస్తున్నాయి" అన్నది.
విడువలేక నెమ్మదిగా బయటకు కదిలాడు మారుతి. బయట శివశంకర్ ను చూస్తున్న డాక్టర్ కనిపించాడు. ఆయన మారుతిని చూసి పలకరింపుగా నవ్వి "ఇంకా కొద్ది గంటలే !" అన్నాడు.
మారుతి విచారంగా తల తాటించాడు. "అయిపోయిన తర్వాత కార్యక్రమంలో మార్పేమైనా ఉన్నదా ?" అని అడిగాడు.
"లేదండీ ! ఆయన బాడీ మెడికల్ కాలేజీ కి రీసెర్చ్ నిమిత్తం డొనేట్ చేశారు తెలుసు కదా ! ఆ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత మిగిలిన భాగాల్ని క్రిమటోరియంలో దహనం చేసి చితా భస్మాన్ని అలహాబాద్ లో ఎవరో ఎన్ జీ ఓ వారు త్రివేణీ సంగమంలో నిమజ్జనం చేస్తారుట, వారికి కొరియర్ చేయమని వ్రాతపూర్వకంగా అభ్యర్ధించారు" అన్నాడాయన విచారంగా.
******** ********* ********
ఇంటికి చేరుకున్న మారుతి జాగ్రత్తగా ఆ కవరులోనుంచి ఉత్తరం తీశాడు. పెద్ద ఉత్తరమేమీ కాదు. కారణం ఊహించగలిగాడు మారుతి. పెద్ద ఉత్తరం వ్రాసే ఓపిక లేక క్లుప్తంగా ముగించాడు. రాత కూడా గజిబిజిగా ఉన్నది.
"మారుతీ ! ఎలా తెలిసిందో, నా కాన్సర్ సంగతి అంబిక కి తెలిసిపోయింది. తను పోయిన తర్వాత తన బట్టలు వగైరా వస్తువులు ఎవరికైనా దానం చేద్దామని సర్దుతుంటే ఆమె వ్రాసిన ఉత్తరం బయట పడింది. తనకున్న ఒకే కోరిక సుమంగళిగా వెళ్ళిపోవాలని, అందుకే మందులు వేసుకోవడం మానేశాననీ, ఆహారం కూడా తీసుకోవడం తగ్గించుకున్నాననీ, అపరాధం మన్నించమనీ, మరుజన్మలో నేనే భర్తగా రావాలని దేవుణ్ణి వేడుకుంటున్నానని కూడా వ్రాసింది.
నేను కూడా వెళ్ళిపోతున్నానురా తనని వెతుక్కుంటూ. తను లేని జీవితం నాకొద్దు. నేనూ కాన్సర్ మందులు మానేశాను. ఆత్మహత్య పాపం అంటారు. నేను లెక్క చేయనురా !...…,"
క్రింద సంతకం లేదు. బహుశా సంతకం చేసే ఓపిక లేకపోయి ఉండాలి.
అప్పుడే అక్కడికి వచ్చిన భార్య మాలతి చేతిలో ఆ ఉత్తరం పెట్టి చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు మారుతి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి