చిన్న పాత్రలతో రామాయణం. -. అహల్య





రామాయణంలో చిన్న పాత్రలు 

అహల్య 

సిద్ధాశ్రమం దాటి రమ్యమైన వనవాటికలు, అరణ్యాలు దాటి జనపదంలో అడుగిడిన రాముడు విశ్వామిత్ర మహర్షిని కుతూహలంగా ఆ దేశం గురించి వినగోరాడు. 

అది విశాలా నగరమనీ, ఇక్ష్వాకు అలంబుస లకు పుట్టిన పరమ  ధార్మికుడైన విశాలుని పేర ఈ నగరము వర్ధిల్లుచున్నదనీ, ఆ నగరాన్ని పరిపాలించే సుమతి అనే ధర్మాత్ముడి గురించి, ఆయన పూర్వీకులైన హేమచంద్ర, సుచంద్ర, ధూమ్రాశ్వ, సృంజయ, సహదేవ, కుశాశ్వ, సోమదత్తుల గురించి, సోమదత్తుని కుమారుడైన కాకుత్సుని, అతని కుమారుడైన సుమతి గురించి కూడా మహర్షి వివరించారు.

ఆ రాత్రి సుమతి మహారాజు ఆతిధ్యం స్వీకరించి మరునాడు అనుష్టానానంతరం మిథిలా నగరం వైపు ప్రయాణం అయ్యారు విశ్వామిత్ర మహర్షి, ఆ వెనుక రామ లక్ష్మణులు. 

కొంత దూరం ప్రయాణించిన తర్వాత రమణీయంగా ఉండినా నిర్జనంగా ఉన్న అరణ్యాన్ని చూశాడు రామచంద్రుడు.

పచ్చని చెట్లు, లతలు, గుల్మాలు కనువిందు చేస్తున్నా నర సంచారమే కాక పశు, మృగ, విహంగాలు కూడా కానరావడం లేదు. మంద్రంగా ప్రణవ నాదాన్ని పోలిన శబ్దం విన వస్తున్నది. 

"మహాత్మా ! ఈ ప్రదేశం అందచందాలతో అలరారుతున్నా నిర్జీవంగా తోస్తున్నది. ఇటువంటి అరణ్యం ఉంటుంది అని వినను కూడా లేదు. దీని వైనము, ప్రణవ నాదాన్ని తలపించే ఆ సవ్వడి గురించి తెలుపమని ప్రార్ధిస్తున్నాను" అన్నాడు దాశరథి. 

రామభద్రా ! పూర్వం చతుర్ముఖ బ్రహ్మ అందాలు పోతపోసిన ఒక కన్యామణి ని సృష్టించాడు. ఏ మాత్రం అవకరములు లేని ఆమెకు అహల్య అని నామకరణం చేసి, ఆమెను పుత్రికగా సంభావించి వివాహం చేయ సంకల్పించాడు. 

ఇంద్రాది దిక్పాలకులు, వివిధ దేవతలు ఆమె తమకు భార్యగా కోరి బ్రహ్మను అభ్యర్ధించారు. భూ ప్రదక్షిణ ముమ్మారు చేసిన వారికి ఇచ్చి కన్యాదానం చేస్తానని బ్రహ్మదేవుడు పలికాడు.

ఇవేమీ ఎరుగక తపమాచరించుకుంటున్న బ్రహ్మ తేజస్సు గల గౌతమ మహర్షిని నారదుడు ప్రేరేపించి, ద్విముఖ గోవునకు ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ ఫలితం కలుగుతుంది అని ఒప్పించి, దూడకు జన్మనిస్తున్న గోమాతకు ముమ్మారు ప్రదక్షిణ చేయించి తండ్రి వద్దకు తీసుకుని వెళ్ళి అహల్యను గౌతమునకు వివాహం జరిపించాడు.

అహల్య పరమ భక్తి శ్రద్ధలతో గౌతముని సేవిస్తూ ఆయన నిత్య అర్చన, అనుష్టాన తపో విధులకు ఎక్కడా ఆటంకం కలగకుండా ఆనందంగా గడిపేది.

కానీ దేవేంద్రుడికి ఆమె మీద మోహం తగ్గక, సమయం కోసం ప్రతీక్షించి, ఒకనాడు ఉదయమే గౌతముడు నదీ స్నానానికి వెళ్లిన సమయంలో ఆయన రూపం ధరించి, ఆశ్రమం జొచ్చి, ఆమెతో సంగమించ కోరాడు. ఆ వచ్చినది గౌతముడు కాదు, దేవేంద్రుడే అని గ్రహించింది అహల్య.

కానీ ఒక్క నిమిషం ఆమె మనసు చెదిరింది. ఇంద్రుడంతటి వాడు తన పొందు కోరినాడని ఇంచుక గర్వం కూడా కలిగింది. వివశురాలై అతనికి లొంగిపోయింది. 

వారి సంగమం అనంతరం ఇంద్రునికి చేతులు జోడించి "మహాభాగా ! నా పతి తిరిగి వచ్చు సమయం అవుతున్నది, దయచేసి త్వరపడి నిష్క్రమించండి" అని వేడుకున్నది.

కానీ ఆ సమయానికే తిరిగి వచ్చిన గౌతముడు తన రూపుతోనే  ఉన్న ఇంద్రుని చూసి, తత్తరపాటు పడుతున్న తన పత్ని బిత్తర చూపులు కనిపెట్టి, దివ్యదృష్టితో జరిగినది గ్రహించి, ఇంద్రుని అండ విహీనుడవు కమ్మని శపించి అహల్య వైపు తిరిగాడు. 

అపరాధ భావనతో కునారిల్లుతున్న అహల్యను "తెలిసి కూడా పాపానికి ఒడిగట్టిన నీవు సంవత్సరాల తరబడి అన్నపానాలు గ్రహించలేక, కేవలం గాలిని భక్షిస్తూ, ఎవరికీ నీ రూపు కనబడకుండా ధుళిలో పడి ఉండు" అని ఆగ్రహంతో పలికాడు.

పతి పాదాలను కన్నీళ్ళతో అభిషేకించి ఆమె పశ్చాత్తాపంతో "నేను ఒనరించిన అపరాధానికి నాకు ఈ శిక్ష పడవలసినదే ! కానీ ఈ శాపం నుంచి నాకు విముక్తి కలిగించండి స్వామీ!" అని వేడుకున్నది. 

"నేను నా తపో ఫలాన్ని మీ ఇద్దరికీ శాపం ఇవ్వడం వలన పోగొట్టుకున్నాను. మరల హిమాలయాలకు వెళ్లి తపము ఆచరించెదను. నేను వెళ్ళిన తరువాత ఈ అరణ్యం నిర్జనంగా తయారౌతుంది. అనేక సంవత్సరాల తరువాత దశరధ పుత్రుడు రామ నామధేయుడు, ఈ అరణ్యం గుండా పయనిస్తాడు ఆయన పాద స్పర్శ ఈ ప్రదేశాన్ని తాకిన వెంటనే నీకు శాప విమోచనం అవుతుంది" అని ఆయన ఉత్తర దిక్కుగా హిమాలయాలకు పయనమై పోయాడు అని చెప్పాడు విశ్వామిత్రుడు.

ఆ గౌతమ ముని ఆశ్రమమే ఈ ప్రాంతము అని వివరించాడు మహర్షి.

ఆశ్చర్యంగా ఇదంతా విన్న రాముడు, "మరి ఆ ప్రణవ నాదం ఏమిటి గురువర్యా?" అని అడిగాడు.

"అది ఓంకారం కాదు రామా ! అది అహల్యా దేవి పదేపదే ఉచ్ఛరిస్తున్న రామ నామం" అన్నారు చిరునవ్వుతో విశ్వామిత్రుడు.

ఈ విధంగా మాట్లాడుతూ వెళ్తున్న విశ్వామిత్ర, రామ, లక్ష్మణుల ఎదుట ధూళి ధూసరితమైన ఆకారం మెల్లగా లేచి నిలబడింది. మెల్లమెల్లగా ఆమె మేని వన్నె బంగారు చాయ కు మారింది. అపురూప సౌందర్యంతో అలరారుతున్న ఆమెను అహల్యగా గ్రహించి రాముడు ఆమెకు వందనమాచరించాడు. చుట్టూ అరణ్యం పూర్వపు శోభను సంతరించుకుంది. ‌పశు పక్ష్యాదులు సంచరించడం మొదలైంది.

ఇదంతా గ్రహించిన గౌతముడు వాయువేగ మనోవేగంతో తన ఆశ్రమానికి వచ్చాడు. విశ్వామిత్రునికి ప్రణమిల్లి, రామ, లక్ష్మణులకు యధోచిత అతిధి సత్కారాలు చేసి సంభావించారు ఆ దంపతులు. 

విశ్వామిత్ర మహర్షి వారిని మనసారా ఆశీర్వదించారు.

రామ, లక్ష్మణులు ఆ దంపతులకు ప్రణమిల్లారు. గౌతముడు, అహల్య  మనసారా వారిని ఆశీర్వదించారు.

అహల్య మాత్రం "రామా ! నీవు నాకు పితామహుడవు. నాకు బాలక రూపంలో వచ్చి నమస్కరిస్తున్నావా తండ్రీ ! నీ పాద స్పర్శ, నీ దర్శన భాగ్యం కోసమేనా నాకు శాపమొసగినారు నా పతిదేవులు? ఆహా నా యందు ఆయన వాత్సల్యం అమోఘం !" అని మనసులోనే తలచి సజల నయనాలతో ఆశీర్వదించింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @