అలేఖ్య @

అలేఖ్య 

ఓ పీ లో మంచి బిజీగా ఉన్న టైమ్ లో చిన్నబాబు ఫోన్ చేసాడు. చిన్నబాబు అంటే చిన్నబాబే, వాళ్ళ నాన్న అచ్చి బాబు కొడుకు పుడితే మురిసి ముక్కలైపోయి వాళ్ళ నాన్న పేరే పెట్టేసి బారసాల పళ్ళెంలో బియ్యంలో చిన్నబాబు అని వ్రాసేసి శ్రీ అని మొత్తం నింపేసి తల్లి కేసి గర్వంగా చూసాడు. వాడి తల్లి మెటికలు విరిస్తే అత్తగారు, పెళ్ళాం నొసలు విరిచారు.


స్కూల్లో చేర్చే టైం కి తల్లి స్వర్గస్తురాలయ్యేసరికి పెళ్ళాం పోరు భరించలేక చిన్న శరత్ బాబు అని రిజిస్టర్ లో రాయించాడు. కానీ వాడి టీచర్లందరూ వాడిని అచ్చిబాబు 'చిన్న బాబూ !' అని పిలవడం విని అటెండెన్స్ తీసుకునేటప్పుడు అలాగే పిలిచేవారు. అలాగ వాడి పేరు చిన్న బాబుగానే సెటిల్ అయిపోయింది. పదో క్లాసు సర్టిఫికెట్ లో చిన్న శరత్ బాబు గానే ఉండడంతో అచ్చి బాబు పెళ్ళాం ఊరట చెందింది.

ఆ తర్వాత నెమ్మదిగా వ్యాపారంలో దిగి బియ్యం అమ్మి నిలదొక్కుకుని, తర్వాత పట్నం వచ్చేసి దాల్ మర్చెంట్ గా ఎదిగి, హోల్ సేల్ వ్యాపారంలో మర్రి చెట్టులాగా పెరిగిపోయాడు.

పట్నానికి వచ్చినప్పటినుంచి వాడి కుటుంబం వైద్యం కోసం నా దగ్గరకు వచ్చేవాళ్ళు. ఎందుకో చిన్నబాబు భార్యకి నా వైద్యం పట్టు ఇచ్చేసరికి వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్ గానే కాకుండా ఫ్యామిలీ వెల్ విషర్ గానూ నేను ఎదిగాను.

హోల్ సేల్ వ్యాపారం నుంచి లోకల్ రాజకీయాల్లోకి వేలుపెట్టి, చేతులు కాల్చుకోక పోయినా ఆ దురద అంటించుకుని రెండు సార్లు కౌన్సిలర్ గా ఓడిపోయి, మూడోసారి గెలిచాడు. కాకపోతే నా దగ్గరికి వైద్యం కోసం రావడం మానలేదు.

వాడికి లేకలేక కూతురు పుట్టింది. చాలా ముద్దొచ్చేది. చిన్నబాబు భార్యకి గణపతి సచ్చిదానంద స్వామి అంటే గురి అయ్యేసరికి ఆయనే పేరు పెట్టాలని పట్టుబట్టింది. మొత్తం మీద ఐదు నెలల తర్వాత మైసూర్ వెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టింది. మీ పాపాయికి బారసాల పళ్ళెంలో ఏమీ వ్రాయలేదా అని పకపకా నవ్వి ఇంత వరకు పేరు పెట్టలేదు కాబట్టి అలేఖ్య అన్న పేరు బాగుంటుంది అన్నారాయన. అంతే ఆ పాపకి 'అలేఖ్య' అన్న పేరు పెట్టేసింది చిన్నబాబు భార్య.

ఆ పాపని పిల్లల డాక్టర్ కి చూపిస్తూ వచ్చినా రెండు సంవత్సరాల వయసు నుంచి చిన్నా చితకా అనారోగ్యాలకి నా దగ్గరికే తీసుకొచ్చే వారు. అలా మూడేళ్ళు వచ్చేసరికి నాకొక వింత విషయం చెప్పింది చిన్నబాబు భార్య.

***

అలేఖ్యకి ఎలా అలవాటైందో అమ్మ చేత కూడా స్నానం చేయించుకునేది కాదు. బట్టలు అండర్వేర్ తో సహా తనే వేసుకునేది. ఏదో పనిమీద తల్లి ఆ టైం లో గదిలోకి వస్తే తల్లి బయటికెళ్ళేదాకా నానా గోల చేసి తల్లి బయటికెళ్ళాకే బట్టలు మార్చుకునేది. చిన్నబాబు భార్య ఈ విషయం బెంగగా నాకు చెప్తే నేను కొట్టిపారేశాను. "ఏం పర్వాలేదు, వయసొచ్చినకొద్దీ అదే సర్దుకుంటుంది".

కానీ ఆ అలవాటు ఏమీ సర్దుకోలేదు. మెచ్యూర్ అయిన సమయంలో గొడవ చేసి తల్లిని తలకి నూనె రాయించుకుని తానే తలంటు పోసేసుకుని వచ్చేసింది. తల్లి లబలబలాడింది. చుట్టాలని పిలిచి అందరిచేతా అక్షతలు వేయించి, తలకి నూనె పెట్టించి, నలుగు పిండి, పసుపు రాయించి తర్వాత ఘనంగా పేరంటం చేద్దామని అనుకుంటే ససేమిరా వల్లకాదని, వేరే లాగా చేస్తే అన్నం మానేస్తానని బెదిరించి ఆ ప్రోగ్రాం మీద నీళ్ళు జల్లేసింది.

చిన్నబాబు బ్రతిమాలగా బ్రతిమాలగా ఫంక్షన్ హాల్లో ఓణీల ఫంక్షన్ కి ఒప్పుకుంది కానీ ఓ గంటన్నర దాటాక కడుపులో తిప్పుతోంది, తలనెప్పి అన్న వంకతో ఇంటికొచ్చేసింది. నెలనెలా కూడా క్లోజ్ ఫ్రెండ్ నుంచి సలహాలు తీసుకుని శుభ్రతకి సంబంధించిన జాగ్రత్తలు పాటించేది. అప్పుడు కూడా తల్లిని ఏ మాత్రం జోక్యం చేసుకోనిచ్చేది కాదు.

రానురానూ ఆ ఇల్లాలికి బెంగ ఎక్కువై నా దగ్గర కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. "డాక్టర్ గారూ ! ఎలానండీ దీనితోటి ? ఇంతవరకు నా సాయం లేకుండానే పెరిగింది, నేను ఎట్లాంటి ముస్తాబులు, ముచ్చట్లు చెయ్యనే లేదు. తర్వాతి రోజుల్లో ఎలాగండీ ?" అన్నది.

ఎప్పటిలాగే మిగిలిన పేషెంట్లకి ధైర్యం చెప్పినట్లే "ఏం పర్వాలేదమ్మా ! అన్నీ టైమొచ్చినప్పుడు సర్దుకుంటాయి" అన్నాను.

రోషంగా "ఏమిటి డాక్టర్ గారూ సర్దుకునేది ? పదహారు నిండుతాయి పై నెలకి. ఇంకో రెండు మూడేళ్ళకైనా పెళ్ళి చెయ్యద్దా ?"

నవ్వేశాను, "చేసెయ్యండి ! కాదనే వాళ్ళెవరు !" అన్నాను.

"ఎవరూ కాదనే వాళ్ళు లేరు, అదే కాదంటుందని నా భయం" అన్నదావిడ.

"ఆ వయసు పిల్లలు పెళ్ళి వద్దనే అంటారులే అమ్మా ! అలా అని మీరు ఎలాగూ ఊరుకోరుగా ? పైగా మీలో త్వరగానే పెళ్ళిళ్ళు చేసేస్తారుగా !" అన్నాను వాతావరణం తేలిక చెయ్యడానికి.

గబుక్కున లేచి "వెళ్ళొస్తాను" అన్నది కానీ గడప దాటుతూ చిన్నగా తల బాదుకోవడం నా కళ్ళ పడనే పడింది.

ఆ తర్వాత కొన్ని రోజులకి చిన్నబాబు కలిసినప్పుడు అదే అడిగాను. "అలిమేలు గారికి నేను చెప్పినదేదో నచ్చలేదనుకుంటా" అన్నాను.

నా దగ్గర ఉన్న చనువుతోటి "డాట్రారూ ! మీకు వైద్యం బాగానే తెలుసు కానీ లోకజ్ఞానం బొత్తిగా లేదండీ !" అన్నాడు.

తెల్లబోయాను. "ఏంటేంటి చిన్నబాబూ?" అన్నాను.

"పెళ్ళి చేస్తామండీ, తర్వాత సంగతో ? అదొక్కతే మాకు సంతానం, అది పెళ్ళి చేసుకుని ఇద్దరో ముగ్గురో పిల్లలు పుడితే వాళ్ళనైనా పెంచి ముద్దూ, ముచ్చట తీర్చుకుందామని అనుకుంటోంది నా భార్య" అన్నాడు చిన్నబాబు.

"పెంచండీ ! అందుకు అభ్యంతరం ఏముంటుంది ?" అన్నాను నిజంగానే అర్ధం కాక. ఈ సారి నా ఎదురుగానే తల బాదుకున్నాడు చిన్నబాబు.

"సంసారం చెయ్యకుండా సంతానం ఎక్కడిది డాట్రారూ ? ఇద్దరు పిల్లల్నీ అమెరికా కూడా పంపించారు ఆ మాత్రం తెలీక పోతే ఎలాగండీ ?"

ట్యూబ్ లైట్ వెలిగింది.

"నేను కనుక్కుంటాను. గాభరా పడకండి చిన్నబాబూ!" అని భరోసా ఇచ్చి పంపేసాను కానీ అలేఖ్య దగ్గర ఈ విషయం ఎలా ప్రస్తావించాలో అర్ధం కాలేదు.

ఆ సాయంత్రం హాస్పిటల్ నుంచి ఇంటికెళ్ళాక నా భార్య సలహా అడిగాను. "నేను కనుక్కుంటాను లెండి. వర్రీ అవద్దు" అన్నది. అలిమేలు, నా భార్య పూజలు, వ్రతాలు, ఫంక్షన్ లలో దోస్తులే. అలేఖ్య కూడా నా భార్య అంటే కొంచెం చనువుగానే ఉంటుంది.

**********


వారం రోజుల తర్వాత మా ఆవిడ, అలిమేలు గారు ఒక పేరంటం లో కలిశారు. అక్కడికి వాళ్ళ ఇల్లు దగ్గరే అవడంతో పేరంటం అయిపోయాక అలిమేలు గారి ఇంటికి వెళ్ళారుట. ఆ మాట, ఈ మాట మాట్లాడాక అలేఖ్యని చదువు గురించి వాకబు చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. అలేఖ్య చదివే కాలేజి కో ఎడ్యుకేషన్ అట! ఇంకా అవీ ఇవీ మాట్లాడితే తెలిసిందేమంటే అలేఖ్య మంచి ఫ్రెండ్స్ ఐదారుగురు అక్కడే చదువుతున్నారట. అక్కడే చేరతానని అంటే అలిమేలు, చిన్నబాబు ఎగిరి గంతేసి ఒప్పుకున్నారు. కారణం మా ఇద్దరికీ వెంటనే అర్ధమైంది. ఆ పైన ఒకరిద్దరు మగ క్లాస్ మేట్సు అలేఖ్యతో ఫ్రెండ్ షిప్ చేశారట కాని అక్కడ తోటే ఆగిపోయిందట. మా ఆవిడ కుతూహలంగా అడిగితే నవ్వుతూ "ఆంటీ ! వాళ్ళకి చనువిస్తే చెయ్యి కలుపుతారు, భుజం కలుపుతారు, ఇంకా ముందుకెళ్తారు. నాకు కంపరం బాబూ !" అన్నదట.

మా ఆవిడ ఉస్సురంటూ ఇంటికొచ్చేసి ఈ సంగతి చెప్పి తల పట్టుకుంది "ఎట్లాగండీ ఈ పిల్లకి చెప్పడం" అంటూ.

కానీ నాలుగు రోజులలోనే మళ్ళీ ఆ అవకాశం వచ్చింది. ఈ సారి అలిమేలు గారికి మా ఆవిడ దగ్గర ఉన్న ఫ్యాషన్ డిజైనింగ్ పుస్తకం కావాల్సివచ్చి అలేఖ్యే మా ఇంటికొచ్చిందట ! ఆ టైం కి నేను ఆస్పత్రిలో ఉన్నాను.

ఇంటికెళ్ళే సరికి మా ఆవిడ నిస్తేజంగా సోఫాలో కూర్చుని ఉంది. అలేఖ్య వచ్చిన విషయం చెప్పి "ఆ పిల్ల ఎవరి మాటా వినేలాగ లేదు. నేను కొంచెం ఇంటిమేట్ విషయాలు అడిగితే 'ఛీ ! ఆంటీ ! మీకు ఈ వయసులో ఇవి అవసరమా ?' అని నాకే పంచ్ ఇచ్చిందండీ " అన్నది.

ఇంక చిన్నబాబుకి ఈ విషయం చెప్పి "ఆందోళన పడకండి చిన్నబాబూ ! ఏదో లాగా దీనికి పరిష్కారం దొరుకుతుంది" అన్నాను కానీ నా మాట నాకే కృతకంగా అనిపించింది.

అలాగ రెండేళ్లలో అలేఖ్య గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యింది. అలేఖ్యకి చెప్పలేదు కానీ వివాహ ప్రయత్నాలు మొదలెట్టానని నాతో చిన్నబాబు చెప్పాడు.

ఓ శుభముహూర్తాన అమెరికా నుంచి మలేషియా షిఫ్ట్ అయిన మా అబ్బాయి మలేషియా రమ్మని టికెట్లు కూడా బుక్ చేసి పంపిస్తే తప్పనిసరై పదిహేను రోజుల వ్యవధిలో మేమిద్దరమూ నేను పేషెంట్లకు చెప్పుకుని, అవసరం అయితే కేసులు చూడడానికి ఒక కొలీగ్ కి చెప్పుకుని, స్టాఫ్ కి అన్నీ అప్పజెప్పి బయలుదేరాము. ఆ వెళ్ళడం కోడలికి వేవిళ్ళు, బెడ్ రెస్ట్, ఆపై మేము అనుకున్న కాంబోడియా ట్రిప్పు, అనుకోని సింగపూర్ ట్రిప్పు వేసి వచ్చేసరికి మా ఆవిడ, ఆ తర్వాత నేను అనారోగ్యంతో పడక వేసి టికెట్లు దొరికి ఇండియా వచ్చేసరికి ఐదున్నర నెలలు అయింది.

ఈలోపు వాట్సాప్ ద్వారా చిన్నబాబు అలేఖ్య పెళ్లి కుదిరిందనీ, ఎలాగైనా రమ్మనీ ఇన్విటేషన్ పంపడమే కాకుండా ఫోన్ కాల్ చేసి మరీ బ్రతిమాలాడు. నేనూ మా కోడలి గురించి చెప్పి మనస్ఫూర్తిగా అభినందించి గ్రీటింగ్స్ చెప్పాను. మా ఆవిడ కూడా అలిమేలు గారితో మాట్లాడింది కానీ వివరాలు అడుగుదామని ప్రయత్నిస్తే "వదినా ! మీరొచ్చాక చెప్తాను. వారంరోజుల్లో కుదిరిపోయింది, ఇంకా చాలా పనులు ఉన్నాయి. కాలూ చెయ్యీ ఆడడం లేదు ఏమనుకోవద్దు" అని చెప్పింది.

మా ఇద్దరికీ ఈ విషయం మీదే కబుర్లు దాదాపు ప్రతి రోజూనూ !

మొత్తం మీద ఇండియా వచ్చేసాక తెలిసిందేమంటే, చిన్నబాబు, అలిమేలు గారు చార్ థామ్, ఆపై నైమిశారణ్యం, అయోధ్య, కాశీ, మధుర వీటి యాత్రలలో వెళ్ళారని. అలేఖ్య అత్తారింటికి వెళ్ళిందని కూడా తెలిసింది.

మేము ఇండియా వచ్చేశాక రెండు నెలల తర్వాత ఇదిగో ఇవాళే చిన్నబాబు దగ్గర్నుంచి ఫోను. "సాయంత్రం మీరు, అక్కగారు తప్పకుండా మా ఇంటికి రావాలి" అని. అంతకన్నా చెప్పేందుకు అతనికీ టైమ్ లేదు, నాకూ బిజీగా ఉండింది.

మధ్యాహ్నం ఇంటికెళ్ళి ఈ విషయం చెప్తే మా ఆవిడ అలిమేలు గారితో మాట్లాడదామంటే ఆవిడ ఫోన్ ఎవర్ బిజీ. సరే సాయంత్రం తెలుస్తుంది కదా అని అనుకున్నాము.

సాయంత్రం వెళ్తే చిన్నబాబు ఇల్లంతా హడావిడిగా ఉంది. హాల్లోనే చిన్నబాబు నన్ను చూస్తూనే గట్టిగా కౌగలించేసుకున్నాడు. మా ఆవిడ లోపలికి వెళ్ళి అలిమేలు గారితో వచ్చింది. ఆవిడ వెయ్యి వాట్ల బల్బులాగ వెలిగే మొహంతో "డాక్టర్ గారూ ! మిమ్మల్ని ఎప్పుడు చూస్తామా అని తపించిపోయాము మేమిద్దరమూ ! నాలుగే రోజులైంది మేము యాత్ర నుంచి వచ్చి. మాకు అలేఖ్య తో అన్నీ హడావుళ్ళేనండీ" అన్నది.

మా మాటలు వినబడి అనుకుంటా అలేఖ్య వచ్చింది. "డాక్టర్ గారూ, ఆంటీ ! ఎన్ని రోజులు అయిపోయిందో మిమ్మల్ని చూసి అని మా ఆవిణ్ణి వాటేసుకుంది. మా ఆవిడ తెల్లబోయింది. అలిమేలు గారి వైపు చూసి ప్రశ్నార్థకంగా మొహం పెట్టింది. ఆవిడ ముసిముసి నవ్వులు నవ్వుతూ "అవునండీ ! ఇప్పుడు ఐదో నెల రాబోతోంది" అన్నది. నేను తెల్ల మొహం వేశాను.

ఇంటికొచ్చాక ఇద్దరం నోట్స్ ఎక్స్ఛేంజ్ చేసుకున్నాం. ఏతావాతా తెలిసిందేమంటే అలేఖ్య క్లాస్ మేట్ హరి ఆ అమ్మాయి మీద మనసు పారేసుకుని ఇంట్లో పోరితే, వాళ్ళు కూడా అమ్మాయి కూడా మనోళ్లే కదా అనుకుని హడావుడిగా పెళ్లి చూపుల తతంగం కానిచ్చేసి మూఢం, ఆ పైన శూన్యమాసం వస్తున్నాయని వారం రోజుల్లో మంచి ముహూర్తం పెట్టేసి పెళ్ళి చేసేశారు.

మా ఆవిడ సేకరించిన వివరాల ప్రకారం అలిమేలు ఎందుకైనా మంచిదని అలేఖ్యని భయపడుతూనే అడిగిందట 'నీ అభిప్రాయం ఏమి'టని ! అలేఖ్య కొంచెం సిగ్గుపడుతూనే ఓకే అన్నదట. పెళ్ళి ధూమ్ ధామ్ గా అయిపోయింది. దంపతులిద్దరూ హనీమూన్ కి వెళ్లిపోయారు, ఈ దంపతులిద్దరూ ఉత్తర దేశ యాత్రలకి వెళ్లిపోయారు. తిరిగొచ్చేసరికి ఈ కబురు.

వీరిద్దరికీ మేఘాలలో తేలిపోతున్నట్లే ఉంది. మా ఆవిడ వచ్చే ముందు అలేఖ్యని ఈ విషయమై కదలేసిందట.

"ఆంటీ ! మిమ్మల్ని ఇదివరకు కొంచెం దురుసుగా మాట్లాడాను, సారీ ! ఏమనుకోవద్దు" అని చేతులుచ్చుకుని బతిమాలిందట.

ఏమీ ఫర్వాలేదు, నేనస్సలు ఏమీ అనుకోను అని అన్నాక తానే చెప్పిందట - "పెళ్ళి చూపులలో ఇద్దరూ మాట్లాడుకునే సమయంలో హరితో మాట్లాడేటప్పుడు 'నాకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, నాకు మా అమ్మ కూడా నా ఒంటి మీద చెయ్యి వేస్తే ఏదో లాగా ఉంటుంది' అని. హరి చిరునవ్వు నవ్వి 'నీ అంత నువ్వు ఒప్పుకుంటే గానీ నీ ఒంటి మీద చెయ్యి వెయ్యను, ప్రామిస్ !' అని చేతిలో చెయ్యేసి ఒట్టు వేశాడట. 'నమ్మకపొండి ఆంటీ ! ఆ క్షణంలో నా మనసు ఝల్లుమంది, ఇన్నాళ్ళూ లేని పులకరింత ఏదో కలిగింది'
అన్నదండీ !" అంది మా ఆవిడ !

అయ్యా ! అదీ సంగతి !
వధూవరాభ్యాం సుఖినోభవంతు !


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @