అమ్మ @
అమ్మ
"లక్ష్మీ! అత్తయ్యా ! అమ్మా ! మామ్మా ! అమ్మమ్మా !" అంటూ రోదనలు మిన్ను ముట్టాయి.
అన్నింటినీ చీల్చుకుంటూ "అమ్మా !" అన్న హృదయవిదారకమైన కేకతో చాలామంది అటువైపు చూసారు.
లక్ష్మి భర్త పార్వతీశం తల పట్టుకుని కూలబడిపోయాడు.
కూతురు సంధ్య అతనిని పొదివి పట్టుకొని "నాన్నా ! ఊరుకో ! ఆవిడకి మనకీ ఋణం తీరిపోయింది" అన్నది తనుకూడా వెక్కి వెక్కి ఏడుస్తూ.
అంతకు ముందు ఇంటి బ్రహ్మ గారు "లాయరు గారూ ! మీరు కూడా రుద్రభూమికి వెళ్తారా ?" అని అడిగినప్పుడు పార్వతీశం తల అడ్డంగా ఊపాడు. "నా లక్ష్మి జ్ఞాపకం అలాగే ఉండనివ్వండి. అంతకు మించి ఏమీ చెప్పలేను" అన్నాడు రుద్ధమైన గొంతుకతో.
*************
లక్ష్మి, పార్వతీశం ల కాపురం నలభై ఐదు సంవత్సరాల పాటు పొరపొచ్చాలు లేకుండా సాగిపోయింది అంటే కొంచెం అతిశయోక్తిగా అనిపించవచ్చు. వారిద్దరూ వాదులాడుకోవడం ఎవరూ చూడలేదు అన్నది మాత్రం నిజం.
వాళ్ళు వాదులాడుకోవడం వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నపుడు. ఆ కోపతాపాలు తాటాకు మంట లాగా ఒక పూట మించి ఎప్పుడూ లేవు. వారికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి మనవళ్ళు, మనవరాళ్లు కూడా. పార్వతీశం గారికి చాలా రోజులు అనారోగ్యం వలన ఖాయిలా పడ్డారు. చివరికి ఆపరేషన్ చేసి ఒడ్డున పడేసారు డాక్టర్లు. పూర్తిగా తేరుకుని కూతుళ్ళకి పెళ్ళిళ్ళు, కొడుకుకు ఉపనయనం, ఆ పైన పెళ్ళి చేసే టైమ్ కి లక్ష్మికి గుండె బలహీనమై ఆయాసం, దడ వచ్చి చాలా రోజులు మంచాన పడింది.
రెండు మూడు సార్లు ఆసుపత్రి పాలై ముందు హార్ట్ వాల్వు ఆపరేషన్, ఒకసారి స్టెంటులు పడి చివరికి బైపాస్ తోటి బయటపడిందావిడ. పార్వతీశం గారు ఎంతో జాగ్రత్తగా గాజు బొమ్మలాగ చూసుకునే వారు.
తరచుగా ఆవిడ భర్తతో అనేది. "మీరు నాకెంత చేస్తున్నారో. నేను మీకేమీ చెయ్యలేదు" అని. మొదటి రెండు మూడు సార్లు ఆయన మృదువుగా నవ్వేసి ఆమె చెంప మీద చిన్నగా తట్టేవారు.
ఆ తర్వాత ఇంట్లో ఇద్దరే ఉన్నపుడు ఆ మాట వచ్చినప్పుడు ఆయన "లక్ష్మీ ! నువ్వు నాకు ఏమీ చెయ్యలేదా ? నమ్మే మాటేనంటావా ? నా ఆపరేషన్ అప్పుడు గుర్తుందిగా ? దాదాపు నాలుగు నెలల పాటు నేను ఏమీ తినలేక పోయే వాణ్ణి. బలవంతంగా తింటే వాంతి అయిపోయేది. ఆపరేషన్ తర్వాత ఐదో రోజున పేగులు కదిలి, ఆహారం పెట్టచ్చని చెప్పిన రోజున నువ్వు లంచ్ తీసుకుని రావడం ఒక అరగంట లేట్ అయింది. నాకు కడుపు నకనకలాడుతోంది. నువ్వు రాగానే అరిచేశాను.
రోజూ రెండు సార్లు ఉదయం, రెండు సార్లు రాత్రి ఆరు కిలో మీటర్ల దూరం బస్సుల్లో ప్రయాణించేదానివి. ఆటోలో రావచ్చుగా ? అంటే రానూ పోనూ వంద రూపాయలు తీసుకుంటాడు. మనకి పిల్లలతో చాలా ఖర్చులు ముందున్నాయి అని సమర్ధించుకునేదానివి.
ఆ రోజున కేకలేసినా నీ మొహం మీద ఆనందం, నేను చాలా రోజుల తర్వాత ఫుడ్ తింటున్నానని. నేను మెత్తబడిపోయాను. క్షమాపణ కూడా అడగలేక పోయాను. ఆ తర్వాత నువ్వు చేసిన పనికి పసి పిల్లాడిలా ఏడిచేశాను."
ఆవిడ తడైన కళ్ళతో ఆయన చెయ్యి మెల్లిగా నొక్కింది చిరునవ్వుతో, ఆ రోజు జరిగింది గుర్తు రాగా.
వెనకాల బ్యాక్ రెస్ట్ ని ఆనుకుని కూర్చున్న ఆయనకి కారేజీ లో కలుపుకుని వచ్చిన చింతకాయ పచ్చడి, ఘుమఘుమలాడే చారు జాగ్రత్తగా ఆయన ముందు ట్రాలీ బల్ల మీద అమర్చి "శుక్లాంబరధరం విష్ణుం" చదివి ఆయనకి చాలా ఇష్టమైన "నిత్యానందకరీ వరాభయ కరీ సౌందర్య రత్నాకరీ" అని మంద్రమైన గొంతులో భక్తిగా అన్నపూర్ణాష్టకం చదువుతుంటే ఆయన భక్తితో కళ్ళు మూసుకున్నాడు.
ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే క్రమంగా ఆయన కళ్ళ కొలుకులలో తడి అవడం మొదలు అయి, పూర్తి అయ్యేసరికి బావురుమని ఏడుస్తూ భార్య నడుము రెండు చేతులతో చుట్టేసాడు. "నేను మళ్ళీ అన్నం తినగలనని అనుకోలేదు లక్ష్మీ ! ఇవాళ అన్నం తినవచ్చుననే సరికి ఆకలి ఎక్కువ అయింది. అందుకనే నువ్వు రావడం లేటయ్యే సరికి కోపం వచ్చి అరిచేశాను" అన్నాడు వెక్కిళ్ల మధ్య.
"ఏం ఫర్వాలేదు, ఇప్పుడు మీరేమన్నారని ? నేనైనా మీ ప్లేస్ లో ఉంటే కోప్పడేదానిని" అన్నది.
ఆమె రెండు అరచేతులు పట్టుకుని మొహం అందులో పెట్టేసి మళ్ళీ వెక్కిళ్లు పెట్టాడు పార్వతీశం గారు.
ఒక నిమిషం తర్వాత తిప్పుకుని కన్నీళ్ళ తోటే చిన్న నవ్వు నవ్వి "నువ్వు కోప్పడేదానివా ? నమ్మశక్యం కాని మాట లక్ష్మీ !" అన్నాడు.
నిజమే ! లక్ష్మి తమ పెళ్ళైన తర్వాత తననే కాదు, ఎవరినీ కోప్పడి ఎరగదు. కానీ నవ్వుతూనే తన మాటల్లో తన అసంతృప్తి వ్యక్తం చేసేది. నిజానికి తను ఎవరినైనా కోప్పడినా ఎవరూ బాధపడేవారు కాదు కానీ లక్ష్మి నవ్వుతూనైనా చురకలు అంటిస్తుందని గడగడలాడేవారు అందరూ.
అలాగని ఎవరూ దూరంగా మసిలేవారు కాదు. ఆమె ఎదుటివారి సమస్యలు విని వారి సమస్యతో మమేకమై మంచి సలహాలు ఇచ్చేది. అందుకని అందరూ ఆమెను అభిమానించేవారు.
పార్వతీశం గారి అన్నగార్ల పిల్లలు, ఆడపడుచు పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా వారి తల్లిదండ్రుల కన్నా లక్ష్మికి వారి సమస్యలు రహస్యంగా ఏకరువు పెట్టేవారు. ఏనాడూ వారి రహస్యాలు ఆమె బయట పెట్టింది లేదు.
ఇంట్లో పనిచేసేవారు, కారు డ్రైవరు, కూరగాయలు అమ్మొచ్చే లింగమ్మ, చివరికి పార్వతీశం దగ్గరి జూనియర్ లాయర్లు, గుమాస్తా కూడా లక్ష్మి సలహాలు తీసుకునేవారు.
*************
లక్ష్మి కార్యక్రమాలు అయిపోయాక రెండు రోజుల తర్వాత పార్వతీశం గారి ప్రియ మిత్రుడు, క్లాస్ మేట్ రవీంద్ర, భార్య మాధవితో వచ్చాడు.
మిత్రుణ్ణి వాటేసుకుని వలవలా ఏడ్చేస్తున్న పార్వతీశాన్ని మౌనంగానే వీపు నిమురుతూ ఓదార్చారు దంపతులు.
మాధవి పార్వతీశం గారికి చెల్లెలు లేని లోటు లేకుండా రవీంద్ర పెళ్ళైన కొత్తల్లోనే "అన్నయ్యా !" అని పిలుస్తూ వారి కుటుంబంలో భాగమైపోయింది. పార్వతీశం గారి అక్క అన్నపూర్ణ కూడా ఆమెను చెల్లెలు లాగే ఆదరించేది.
లక్ష్మి పోయే సమయానికి రవీంద్ర, మాధవి వారి కొడుకు దగ్గర కెనడాలో ఉన్నారు. ఈ వార్త తెలియగానే వెంటనే బయలుదేరి వద్దామనుకున్నా ఫ్లైట్ టికెట్ దొరక్క రాలేకపోయారు.
కొంచెం సేపు తరువాత పార్వతీశం తేరుకున్నాక రవీంద్ర నేను పిల్లలతో మాట్లాడి వస్తాను అని బయటకు వెళ్ళాడు. నిజానికి రవీంద్ర సున్నిత మనస్కుడే కానీ ఓదార్పు మాటలు మాట్లాడే నేర్పు లేని వాడు. అందుకనే భార్య మీద ఆ పని వదిలేసి వెళ్ళాడని గ్రహించాడు పార్వతీశం.
అతను వెళ్ళగానే మాధవి చేతుల్లో మొహం పెట్టేసి మరొకసారి ఏడిచేసాడు.
"అన్నయ్యా ! అన్నయ్యా ! ఏమిటిది ? వదిన ఆరోగ్యం మనకి తెలిసిందే కదా. నువ్వే అనేవాడివి కదా ! వదిన బాధ చూడలేక పోతున్నానని, తనకి త్వరగా మృత్యువు వస్తే ఆ బాధ నుంచి నివారణ వస్తుందని ! ఇలాగైనా ఆమెకు విముక్తి కలిగింది. నీ భార్య అవడం తన అదృష్టం అన్నయ్యా ! నీలాగా ఎవరు చూసుకుంటారు భార్యలని ?" అన్నది.
"నా భార్య అవడం తన అదృష్టమా ? తను నా భార్య అవడం నా అదృష్టం మాధవీ ! నేనిక్కడ నేల మీద ఉన్నాను. తను ఆకాశం అమ్మలూ ! నాకు చేతికి అందివచ్చిన ఆకాశం. నీకు తెలుసుగా మా అమ్మకి నేనెంత ముద్దో ! నేను అందరిలోకి చిన్న వాడినని బహు గారాబం చేసేది. అలాగని నేను ఆకతాయిగా పెరగలేదనుకో ! మా పెళ్ళైన మూడు సంవత్సరాలకే అమ్మ వెళ్ళిపోయింది."
"అవును పిన్ని నిన్ను ఎంత ముద్దు చేసేదో నాకు గుర్తే ! పెళ్ళైనా కూడా ! నేను ఆట పట్టించే దానిని. 'అన్నయ్యకి పెళ్ళైంది, కొద్దిగా వాడి భార్యకి కూడా ముద్దు చేసే అవకాశం ఇవ్వు !' అని. నవ్వుతూ కొట్టి పారేసేది పిన్ని, 'వాడికి తల్లి ముద్దు తల్లిదే - భార్య ముద్దు వేరే !' అనేది"
అది విని తలెత్తి నీళ్ళు నిండిన కళ్ళతో "అమ్మ తప్పు చెప్పింది మాధవీ ! అమ్మ కన్నా ఎక్కువ ముద్దు చేసేది లక్ష్మి నన్ను. అమ్మ వెళ్ళిపోయిన లోటు తెలియనివ్వ లేదు. పొద్దుట పేస్ట్ బ్రష్ మీద వేసి ఇవ్వడం, స్నానం చేసాక తలకి నూనె రాసి దువ్వడం దగ్గర్నుంచి రాత్రి దగ్గరే పడుకునే వరకు తను చేసిన ముద్దు మా అమ్మ కూడా చెయ్యలేదు. సిగ్గువిడిచి చెప్తున్నా. ఇద్దరమే ఉన్నప్పుడు నన్ను 'బుజ్జీ ! కన్నా ! తండ్రీ !' అని పిలిచేది.
రెండేళ్ల క్రితం నేనొక కోరిక కోరాను. 'నిన్ను లక్ష్మీ ! అని పిలవను అమ్మా ! అని పిలుస్తాను' అని. మెరిసే కళ్ళతో ఒప్పుకుంది, కానీ 'మనమిద్దరమే ఉన్నపుడు పిలవండి, బయట అలా పిలిస్తే నాకు సిగ్గు బాబూ !' అని.
"అందుకనే తను వెళ్ళిపోయాక ఇంక ఎవరేమనుకుంటే నాకేమిటి అని ఎలుగెత్తి అమ్మా ! అని ఏడిచేశాను" అని మరొకసారి బావురుమన్నాడు డెబ్భై ఏళ్ళ పార్వతీశం గారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి