తాతగారి తో సహవాసం
"శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే " అని భక్తితో పలుకుతూ రామనామం వ్రాస్తున్న పినాకపాణి గారి పక్కనే కూర్చుని ఆ రామకోటి పుస్తకంలోకి దీక్షగా చూస్తున్న మనుమడు శ్రీ పినాకి మొహంలో సంభ్రమాశ్చర్యాలు !
"తాతా ! నీ రైటింగ్ బెస్ట్ తాతా ! నేను తెలుగు రాస్తాను కానీ లెటర్సు వంకరగా వస్తాయి" కొంచెం ఈర్ష్య కనబడింది మొహంలో.
వ్రాస్తున్న రామకోటి పుస్తకాన్ని కళ్ళకద్దుకుని భక్తితో పూజా మందిరం క్రింద సొరుగులో పెట్టి, చిరునవ్వుతో "నీకు కూడా బాగా వస్తుంది. రోజూ వ్రాస్తూ ఉంటే నీ రైటింగూ చక్కగా ఉంటుంది, నా రైటింగూ వంకర టింకరగా ఉండేది. వ్రాస్తూ వ్రాస్తూ ఉండేసరికి చక్కగా కుదురుతున్నాయి లెటర్సు" అన్నారు.
పినాకపాణి కొడుకు అనంతరామ్, వారం రోజుల క్రితమే అమెరికా నుంచి సకుటుంబంగా వచ్చేసి భారతదేశంలో ఒక స్టార్టప్ కంపెనీ మొదలుపెట్టి అందులో తలమునకలుగా ఉన్నాడు.
తల్లి మూడు నెలల క్రితమే అకస్మాత్తుగా మరణించే సరికి అతను తట్టుకోలేక పోయాడు. తండ్రి మీద ఉన్న అవ్యాజమైన ప్రేమ వలన ఇండియా వచ్చేసి సెటిల్ అవడానికి భార్య, పిల్లల్ని ఒప్పించాడు.
భార్య విద్య కూడా అభ్యంతర పెట్టలేదు.
పిల్లలు మాత్రం "మేము కొన్ని రోజులు గ్రాండ్ పా దగ్గర ఉంటాము, మాకు నచ్చితేనే ఉంటాము, లేకపోతే మేము చెప్పినట్లు చెయ్యాలి" అన్నారు ముగ్గురూ కూడబలుక్కుని !
తండ్రి మీద ఉన్న నమ్మకంతో వెంటనే ఒప్పుకున్నాడు అనంతరామ్.
🎉🎉🎉🎉🎉
అనంతరామ్ ఎమ్ టెక్ ను ఆర్ ఈసీ, వరంగల్ లో పూర్తి చేసుకుని మెకాట్రానిక్స్ స్పెషలైజేషన్ కోసం అమెరికా లో ఎమ్ ఐ టీ లో చేరాడు.
అతని ప్రతిభని గుర్తించి రోబోటిక్స్ కంపెనీ ఒకరు పెద్ద జీతంతో ఉద్యోగం ఇచ్చారు. ఒక సంవత్సరం పూర్తి కాగానే, తల్లి ఎంతో ఇష్టపడిన ఆమె స్నేహితురాలి కుమార్తె విద్యని వివాహం చేసుకుని తీసుకుని వెళ్లిపోయాడు.
అక్కడ ముందు ఒక అమ్మాయి, తర్వాత అబ్బాయి, ఆ తర్వాత ఆరేళ్ల వారతో ఇంకొక అమ్మాయి పుట్టారు. చివరి సారి అనుకోని గర్భిణి అయ్యేసరికి ఏం చెయ్యాలో పాలుపోక ఇద్దరూ అనంతరామ్ తల్లి లలితని విడియో ద్వారా సలహా అడిగారు.
ఆ వార్త వినగానే ఆవిడ ముఖం వెలిగి పోయింది. రెండు నిముషాలు కళ్ళు మూసుకుని ఆవిడకి ఉపదేశం అయిన షోడశి జపించుకున్నది. "అనంత్ ! విద్యమ్మా ! నేను ఏం చెప్పినా చేస్తారా ?" అని అడిగింది.
ముక్తకంఠంతో ఇద్దరూ "చేస్తాం !" అని తడుముకోకుండా చెప్పారు.
"మీకు ఈ సారి ఆడపిల్లే అనిపిస్తుంది. ఆ జగజ్జనని ప్రసాదం. ఈ గర్భిణి మహద్భాగ్యంగా స్వీకరించండి !"
ఇద్దరూ కూడా తేలికపడ్డ మనసుతో సరేనన్నారు.
పెద్ద పిల్లకి అమ్మ పేరు పెట్టాలని లలితా పరమేశ్వరి అని పెట్టుకున్నారు. తర్వాత బాబుకి తండ్రి పేరు వచ్చేలాగ శ్రీ పినాకి అని పెట్టారు.
మూడవ బిడ్డ ఇంకా గర్భంలో ఉండగానే ఆడపిల్ల అని డాక్టర్ చెప్పింది. వీరి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
డెలివరీ అవగానే పేరు నమోదు చేసుకోవాలి కాబట్టి తల్లి లలిత, అత్తగారు మహాలక్ష్మిని సంప్రదించారు.
స్నేహితురాళ్ళు ఇద్దరూ కూడబలుక్కుని నొప్పులు మొదలవగానే లలితా సహస్రనామ స్తోత్రము మొదలు పెట్టి ఏ నామం దగ్గర పాపాయి తొలి ఏడుపు వినిపిస్తుందో ఆ నామంతో కలిసే పేరు పెట్టండి అని చెప్పారు.
ఆ ప్రకారంగా ఆ పుట్టిన పసిబిడ్డ కు 'నిత్యక్లిన్న' అని పేరుని హాస్పిటల్ లో నమోదు చేశారు.
🎉🎉🎉🎉🎉🎉
"అవునూ ! తాతా ! అక్క, చెల్లాయి ఏరి నాన్నా ?" అనడిగాడు పినాకపాణి గారు.
"అమ్మతో ముందు గార్డెన్ లో తిరుగుతున్నారు తాతా ! పూలు తెంపుతున్నారు." అన్నాడు మనుమడు.
"దానిని తెంపడం అనరు తండ్రీ! కోయడం అంటారు." సరిచేశాడు తాతగారు.
"ఓహో !" అని లోలోపలే 'కోయడం కోయడం' అని మననం చేసుకున్నాడు పినాకి.
తాతగారికి ముద్దొచ్చేసింది. అమెరికా లో ఉన్నా తెలుగు నేర్చుకోవడం చాలా ఇష్టం పిల్లలు ముగ్గురికీ. ఆ అలవాటు అనంత్, విద్య ల కృషి అని తెలుసు ఆయనకు. ఒక క్షణం గర్వపడ్డారు.
"తాతా ! నువు రాసే రామ నామం ఇప్పటికి ఎన్ని నెంబర్ రాశావు ?"
"ఎన్ని సార్లు" అని సరిచేశారాయన.
"నేను నెంబర్ కౌంట్ చెయ్యడం మానేసి చాలారోజులు అయింది నాన్నా ! మొదలుపెట్టిన తర్వాత చాలా కాలం నెంబర్ లెక్క పెట్టుకుని ప్రౌడ్ ఫీల్ అయ్యే వాడిని. ఈ మధ్య మానేశాను. రోజూ ఎన్ని వీలైతే అన్ని వ్రాస్తున్నాను. నీకొక విషయం తెలుసా ? మనం ఎంత కాలం బ్రతికి ఉంటాం ?"
"తెలుసు తాతా ! మనం తినే రైస్ మెతుకుల మీద మన పేరు ఉన్నంత కాలం ఉంటాం !"
అప్రతిభుడై పోయాడు పినాకపాణి గారు.
"ఎవరు చెప్పారు నాన్నా ?"
"అమ్మ, నాన్న ఇద్దరూ, గ్రాండ్ మా... అదే మామ్మ పోయినపుడు అక్క, నేను ఏడుస్తుంటే దగ్గర కూర్చుని కన్సోల్ చేస్తూ చెప్పారు. మామ్మ ఎంతో వర్చువస్..అదే పుణ్యం చేసుకున్నది అని, మామ్మ తినే మెతుకుల మీద ఆవిడ పేర్లు ఇక లేకపోయే సరికి లలితా అమ్మ తన దగ్గరకు పిలిపించుకున్నది అని" కళ్ళు దింపుకొని లోగొంతుకలో చెప్పాడు.
గొంతులో ఏదో అడ్డం పడినట్లై కొంచెం సేపు మాట్లాడలేక పోయారు పినాకపాణి గారు.
"చక్కగా చెప్పారు మీ అమ్మ, నాన్న ! నా బిలీఫ్ చెప్పనా ? నేను ఇన్ని శ్రీరామ అని వ్రాయాలని దేవుడు చెప్పాడు. ఆ నెంబర్ పూర్తి అవగానే నేను కూడా వెళ్ళిపోతాను."
గబుక్కున లేచి తాతగారి మెడ చుట్టూ చేతులు వేసి "తాతా ! ఒద్దు తాతా ! నువ్వు వెళ్ళద్దు. నువ్వు ఇంకా బోల్డంత టీచ్ చెయ్యాలి. వెళ్ళిపోవు కదా ? ప్లీజ్ తాతా !" అని కళ్ళనీళ్ళతో అడుగుతున్న మనవణ్ణి గభాలున కావులించుకుని ఒళ్ళోకి తీసుకుని "వెళ్ళనులే తాతా ! ఏడవద్దు." అన్నాడు కానీ మనసులో 'అది నా చేతిలో ఉందా ? రాముడికే తెలుసు.' అని అనుకున్నాడు.
🌹🌹🌹🌹🌹🌹
"తాతా ! మేము పూలు కొయ్యడం అయిపోయింది ! ఇవిగో" అంటూ లోపలికి వచ్చిన లలిత, తాతా మనవళ్ళని చూసి తనూ వెళ్లి తాత మెడ చుట్టూ చేతులు వేసి ఒక పక్కన కూర్చుంది. వెనకాలే వచ్చిన నిత్య తాతగారి వీపు ఎక్కి తను కూడా తాత మెడ చుట్టూ చేతులు వేసి ఆయన తల వెనక ఒక ముద్దు పెట్టింది.
చిరునవ్వుతో పినాకపాణి గారు నిత్యని ముందుకి తీసుకుని లలితని, నిత్యని రెండు చేతులతో పొదువుకున్నారు.
ఆ వెనక వస్తున్న విద్య ముసిముసిగా నవ్వుతూ "ఇక చాలు ముద్దులు. తాతగారు పూజ చేసుకోవాలి. రండి ఇవతలికి" అన్నది.
నిత్య ఇంకా చిన్న పిల్ల అయేసరికి పరుగున తల్లి దగ్గరకు వెళ్ళింది, కానీ లలిత, పినాకి "మేము ఇక్కడే కూర్చుంటాం అమ్మా !" అని చెప్పేశారు.
"అలాగైతే కుదురుగా కూర్చోండి. తాతగారి తో పూజ అయ్యేదాకా మాట్లాడకూడదు" అని తర్జని చూపించి వంటింటి వైపు నడిచింది.
పినాకపాణి గారు సంధ్యావందనం, దేవతార్చన పూర్తి చేసుకునేంత వరకూ కూర్చున్న పిల్లలు తాతగారు లేచి తులసి మొక్క దగ్గరికి వెళ్ళి కూర్చునే సరికి ఆయనకు కొద్దిగా దూరంలో కుర్చీలో ఇద్దరూ కొద్దిగా ఇరుక్కుని కూర్చున్నారు.
ఆయన పితృ తర్పణాలు ఇస్తూంటే కుతూహలంగా చూశారు. పూర్తి అయిన తర్వాత ఆయన ధోవళి వదిలి శ్రద్ధగా దులిపి, మడత పెట్టి పూజ గదిలో దండెం మీద వేసి పంచ, కండువా వేసుకున్నాక ఆయన దగ్గర చేరారు. ఆయన ఫలహారం చేశాక ప్రశ్నలు సంధించారు.
పినాకి మొదలుపెట్టాడు. "తాతా ! నువు ముందర జపం చేసుకున్నావు కదా ! అది అయిపోయాక పూజ చేసుకున్నావు. అదేమిటి ? ఇదేమిటి ? రెండూ ఒకటి కాదా ?"
"మొదట చేసింది సంధ్యావందనం తాతా ! అందులో లోకమాత గాయత్రీ దేవికి భక్తితో నీళ్ళు ఇచ్చి, జపం చేసి, ఆ తర్వాత సూర్యుడికి నీళ్ళు ఇచ్చి నమస్కారం చేసి, అన్ని దిక్కులలో ఉన్న సకల దేవతలకీ నమస్కారం చేసి, చివరికి మనం ఎంత మందికి నమస్కారం చేసామో అన్నీ కూడా కేశవుడికి అందాలని కోరుకుని, మన ఫ్యామిలీ వివరాలు, మన పేరు చెప్పుకుని భక్తితో నమస్కరించి మనం చేసిన జపం అంతా ఆ నారాయణునికి ఇచ్చేస్తామన్న మాట !"
"అదేమిటి ? అంత జపం చేసుకున్నావు, ఆ పుణ్యం అంతా దేవుడికి ఇచ్చేస్తే నీకు ఏమి మిగులుతుంది ?" అన్నది లలిత జాలిగా మొహం పెట్టి.
"అమ్మా ! లలితా పరమేశ్వరీ ! మనం దేవుని దగ్గరకు వెళ్ళే సమయానికి మన అకౌంట్ లో ఏమీ ఉండకూడదు, పుణ్యమైనా, పాపమైనా ! అప్పుడే మనకి ఆయన దగ్గర పర్మనెంట్ గా చోటు దొరుకుతుంది. మన అకౌంట్ లో పుణ్యం కానీ, పాపం కానీ బాలెన్స్ ఉన్నదనుకో అది నిల్ బాలెన్స్ అయ్యేందుకు మళ్ళీ పుట్టమని పంపుతాడు దేవుడు. మళ్ళీ మనిషిగానే పుడతాము అని గ్యారంటీ లేదు. అందుకనే మనకి ఆలోచించే శక్తి ఇచ్చాడు కాబట్టి, ఈ జన్మలో పుణ్యం చేసినా, పాపం చేసినా ఆ ఫలితం నారాయణాయేతి సమర్పయామి అని ఇచ్చెయ్యాలి !"
"అలాగైతే పాపం చేసినా దేవుడికి ఇచ్చేస్తే పర్మనెంట్ గా ఆయన దగ్గర ఉండిపోవచ్చన్నమాట! మరి ఇన్ని పూజలు అవీ ఎందుకు తాతా ? ఏమి పని చేసినా అది దేవుడిదే అనేసుకుంటే సరిపోతుందిగా !" అన్నది లలిత.
కళ్ళు విప్పార్చుకుని మనవరాలికేసి అబ్బురంగా చూశాడాయన. "అమ్మా ! అది అందరికీ సాధ్యం కాదు. చాలా సాధన చేస్తేనే పట్టుపడుతుంది" అని మనవరాలి నుదురు చుంబించాడు.
సశేషం..........
"ఇంకొకటి ! నేను ముందు చేసిన సంధ్యావందనం నా పుణ్యం క్రెడిట్ లోకి రాదు తెలుసా ?" అన్నారు పిల్లలతో పినాకపాణి గారు.
"అదేమిటి తాతా ?" ఇద్దరూ ఒకేసారి అన్నారు.
"సంధ్యావందనం అన్నది నువ్వు రోజూ చెయ్యవలసిన డ్యూటీ అంటుంది మన ధర్మం. అది చెయ్యవలసిందే".
"చెయ్యలేదనుకో ? ఎవరు చూస్తారు తాతా?" అనడిగాడు పినాకి కొద్దిపాటి ఉత్సుకతతో.
చిన్నగా నవ్వారాయన. "నిన్ను అమెరికా లో మీ నాన్న కారులో తీసుకెళ్తారనుకో ! చెల్లాయిని బేబీ సీట్ లో కూర్చోబెట్టుకొని, రైట్ లేన్ లో స్పీడ్ లిమిట్ లో వెళ్తున్నారనుకో ? పోలీసులు మీ నాన్న కి సర్టిఫికెట్, ప్రైజ్ ఎప్పుడైనా ఇచ్చారా ?"
"అదెలాగ తాతా ! ఎంతో మంది అలా వెళ్తుంటారు కదా ?"
"కదా ? మరి లెఫ్ట్ లేన్ లో వెళ్తున్నారనుకో ? చెల్లాయిని బేబీ సీట్ లో కూర్చోబెట్టలేదు అనుకో ? స్పీడ్ దాటి వెళ్ళాడనుకో ? పోలీసులు లేరనుకో ?అప్పుడో ?"
"తాతా ! ఎక్కడికక్కడ సీ సీ కేమెరాలు ఉంటాయి. ఇంటికి సమన్ లు వచ్చేస్తాయి " అన్నాడు పినాకి ఇది కూడా తెలియదా అన్నట్లు మొహం పెట్టి.
"అవును కదా ? కాకపోతే ఇక్కడ జస్టిస్ అంత స్పీడ్ గా ఉండదు కానీ ష్యూర్ గా ఉంటుంది. అన్నీ దేవుడు గమనిస్తూనే ఉంటాడు. అందుకే ఆయన్ని ఆమ్నీషియెంట్ లేకపోతే సర్వజ్ఞుడు అంటారు" అన్నారు పినాకపాణి గారు.
"ఓహో !" అన్నారు పిల్లలు ఇద్దరూ.
"ఆ తరువాత పూజ చేసేటప్పుడు కూడా ఫలానా రిజల్ట్ కోసం చేస్తున్నాం అని చెప్పుకున్నా, ఆ రిజల్ట్ మనకి ఇవ్వమని దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తాం కానీ డిమాండ్ చెయ్యకూడదు. మనకి ఏ రిజల్ట్ ఇవ్వవచ్చునో ఆయనకి తెలుసు కదా, మనకి ఏది ఇవ్వాలో అది ఇస్తారు."
"తాతా ! ఆయన అంటున్నావు. దేవుడు జెంట్ అనా ?" అడిగింది లలిత.
"దేవుడు జెంట్ కాదు, అలా అని లేడీ కూడా కాదు. మనం మాట్లాడుకునేటప్పుడు, ఆలోచించేటప్పుడు, మన వీలు కోసం ఆయన అంటాము. మీకు తెలుసా ? మామ్మ దేవుడిని మదర్ గా పూజిస్తుంది. ఎప్పుడూ ఆవిడ అనే అనేది" అన్నారాయన.
మామ్మ ప్రస్తావన వచ్చేసరికి పిల్లలిద్దరూ వేలమొహం వేశారు. పినాకపాణి గారికి జాలి వేసింది.
వెంటనే ఇద్దరూ సర్దుకున్నారు. "తాతా రెండో పూజ....." అని పినాకి అంటుండగా అందుకుని తాతగారు "దేవతార్చన" అని సరిచేశారు.
"అదే దేవతార్చన చేసేటపుడు ముందు సంధ్యావందనం అప్పుడులాగా మళ్ళీ ఆ మాల తిప్పావు కదా ? అదేమిటి ?"
అది నాకు ఉపదేశమైన మంత్రం, మంత్రాలు. అవి రోజూ నాకు వీలైనన్ని సార్లు రిపీట్ జపం చేస్తాను"
"అది ఎందుకు ?"
"ఆ మంత్రాలన్నీ కొన్నిసార్లు రిపీట్ చేయడం వలన ఆ తర్వాత ఆ దేవుళ్ళని పూజించడానికి కావాల్సిన అర్హత, శక్తి వస్తాయి."
ప్రశ్నార్ధకంగా చూస్తున్న మనుమలతోటి "మీ స్కూల్లో క్లాసులకి వెళ్ళే మందు ప్రేయర్ ఉంటుందా ?" అనడిగారు.
"కొన్ని స్కూళ్లకి ఉండవు కానీ మా స్కూల్ కి ఉంది తాతా !" అని జవాబిచ్చింది లలిత.
"ఇష్టం ఉన్నవారు చెయ్యవచ్చు. కంపల్షన్ లేదు. ఎవరైనా బలవంతం చేస్తే స్కూల్ కి కోర్ట్ పనిష్మెంట్ ఇస్తుంది."
"మీకు ప్రేయర్ ఇష్టమేనా ?"
"ఇష్టమే తాతా ! ప్రేయర్ చేసిన తర్వాత కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది ."
"అవును కదా ? ఇక్కడ కూడా పూజ ముందు జపం చేసుకుంటే అటువంటి కాన్సన్ట్రేషన్ వస్తుంది !"
"ఓహో ! అర్ధమైంది తాతా !" అన్నారు ఇద్దరూ.
సశేషం........
మధ్యాహ్నం భోజనాలు అయ్యాక పిల్లలు తాతగారి పక్కన చేరారు. విద్య కేకలేసినా వినలేదు. నిత్య మాత్రం వీళ్ళు సందేహాలు అడుగుతుండగా ఇట్టే నిద్ర పోయింది. విద్య పాపాయిని పక్కనే వేరే పిల్లల మంచం మీద పడుకోబెట్టి పిల్లలకి గట్టిగా చెప్పింది"ఒక్క అరగంటలో వచ్చెయ్యాలి, తాతగారు రెస్ట్ తీసుకోవాలి "
"అలాగే అమ్మా !" అని ఇద్దరూ మాట ఇచ్చారు.
పినాకపాణి గారికి అదొకటి చాలా నచ్చింది. అమెరికాలో మామ్, డాడ్ అని పిలిచినా, ఇక్కడ మాత్రం అమ్మా, నాన్నా అనే పిలుస్తున్నారు.
"తాతా ! పూజ గదిలో చాలా గాడ్స్ ఉన్నారు కదా ? అసలు మనకి ఎంత మంది గాడ్స్ ?" అనడిగాడు పినాకి.
"అవును తాతా ! నేను కూడా అడగాలని అనుకున్నాను" అన్నది లలిత.
"మనకి ముప్ఫై మూడు కోట్ల దేవతలు ఉన్నారు" అన్నారాయన.
"గాడ్ ! అంతమంది గాడ్సా ? మమ్మల్ని అక్కడ టీజ్ చేసేవారు తాతా ! మాకు జీసస్ ఒక్కడే గాడ్, మీకు హండ్రెడ్స్ ఆఫ్ గాడ్స్ అని. ఇప్పుడు థర్టీ థ్రీ క్రోర్స్ అంటే ఇంక చెప్పక్కర్లేదు." అన్నది లలిత.
"మనకి ఇంకా ఎక్కువ దేవతలు ఉండాల్సింది. కానీ పార్వతీ దేవి వాళ్ళకి మీకు ఇంక పిల్లలు కలగకూడదు అని శాపం పెట్టింది, లేకపోతే భూ భారం లాగానే స్వర్గలోక భారం పెరిగి పోయేది" అన్నారు పినాకపాణి గారు నవ్వుతూ.
"ఆ కథ తర్వాత చెబ్దువు తాతా ! ముందు మనకి ఇంత మంది దేవుళ్ళు ఏమిటి ? మనకి ఒక గాడ్ ఎందుకు లేడు ?" అన్నది లలిత.
పినాకపాణి గారు నవ్వాపేసి"అమ్మా ! మనకి ముప్ఫై మూడు కోట్లు ఏమిటమ్మా, మన దేవుళ్ళు అనంతం !" అని వాళ్ళకి అర్ధం అవడానికి "ఇన్ఫినిటీ " అన్నారు, లలిత ముఖం ప్రశ్నార్థకంగా ఉండేసరికి.
"మనకి జీవులందరూ, అంటే మనుషులు, జంతువులు, చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు, కొండలు, కోనలు, నదులు, సముద్రాలు, చివరికి భూమి కూడా దేవుడే తల్లీ !" అన్నారు.
సంభ్రమాశ్చర్యాలతో లలిత చూస్తుండగా అన్నారు, "మనకి ప్రతి వస్తువులోను దేవుడు ఉంటాడు. ఎదుటి మనిషికి కాలు తగిలితే ఏం చేస్తామో తెలుసా ?"
"అమెరికాలో బెగ్ యువర్ పార్డన్ అంటాము తాతా !" అన్నాడు పినాకి.
"మనము ఇక్కడ మన కాలు తగిలిన పార్ట్ ని చేతితో తాకి కళ్ళకద్దుకుంటాము. ఎందుకంటే అందరిలోనూ దేవుణ్ణి చూస్తాము, కాలు దేవుడికి తగిలితే అపచారం అని !"
"ఓహో ! అయితే తాతా ! ఒక దేవుడు, పోనీ ఇద్దరు దేవుళ్ళు చాలు కదా ? అందరికీ రెగ్యులర్గా పూలు పెట్టి, బొట్లు పెట్టి పూజలు చేసి ఇవన్నీ ఎందుకు ? పైగా ఒక్కొక్కళ్ళకీ వంద, వెయ్యేసి పేర్లు, రకరకాల పాటలు('స్తోత్రాలు' అని తాతగారు సరిచేశారు) అవసరమా ?"
"తల్లీ ! నువ్వు అమెరికా నుంచి వచ్చాక మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళావు కదా ? అక్కడ నిన్ను వాళ్ళు ముద్దు చేశారా ?"
"చాలా తాతా ! మా అమ్మమ్మ, తాతయ్య గారు అక్కడ ఉన్నన్ని రోజులు వాళ్ళ గదిలోనే పడుకోబెట్టుకునే వాళ్ళు."
"మరి నిన్ను ఏమని పిలిచేవారు ?"
"అమ్మమ్మ, తాతయ్య గారు లలిత తల్లీ అని పిలిచేవారు. శేఖర్ మామ లల్లీ అని పిలిచేవాడు. మాలతి అత్త పెద్దమ్మలూ అనేది నిత్యని చిన్నమ్మలూ అనేది." అంది హుషారుగా లలిత.
"ఇంకా ? మీ ఇంట్లో పనివాళ్ళు, పాలేర్లు ?"
"అక్కడ పనివాళ్ళు, వాషింగ్ మెయిడు పెద్దపాప గారూ అనేవాళ్ళు, పొలం వాళ్ళు దొరసాని గారూ అని పిలిచేవాళ్ళు."
"మరి నీ ఒక్కదానికే మీ అమ్మమ్మ గారు వాళ్ళు, పనివాళ్ళు ఇన్ని పేర్లత పిలుస్తూంటే మరి ఇంతమందిమి డివోటీలం ఎన్ని పేర్లతో పిలవాలి ?"
సాలోచనగా తల ఊపింది లలిత "నిజమే తాతా !"
సశేషం...........
"మరి ఇంత మంది దేవుళ్ళ ఫోటోలు క్లీన్ చేసి పూలు పెడతావెందుకు తాతా ?" ఆవులిస్తూ అడిగాడు పినాకి.
"నిద్ర వస్తోంది తాతా నీకు ! రాత్రికి చెపుతాను సరేనా ?"
"కాదు ఇదొక్కటే చెప్పు తాతా ! రాత్రికి టీవీ లో బేస్ బాల్ మ్యాచ్ చూడాలి" అన్నాడు పినాకి.
"సరే ! పూజకు ముందు నేను పూజ చేసే దేవతలందరినీ ఆహ్వానిస్తాను అంటే ఇన్వైట్ చేసి వెల్ కమ్ చెప్తాను. నాకు పూజ సమయం ప్రతిరోజూ ఫెస్టివల్ అనుకుంటాను. మన ఇంట్లో ఫంక్షన్ లేకపోతే ఫెస్టివల్ చేసుకుంటామనుకో మన రిలేటివ్స్ అందరినీ పిలుస్తాం కదా ! అలాగన్న మాట !"
"వావ్ తాతా ! గాడ్స్ అందరూ మనకి రిలేటివ్సా ? చాలా బాగుంది అలా అనుకుంటే ! కానీ అలా ఎలా అవుతారు ?"
"నేను, నువ్వు అనుకోవడం కాదు, త్యాగరాజు గారే వ్రాశారు, ఒక కీర్తనలో,
'వాతాత్మజ, సౌమిత్రి, వైనతేయ, రిపుమర్ధన, ధాత, భరతాదులు సోదరులు మాకు ఓ మనసా ! సీతమ్మ మాయమ్మ, శ్రీ రాముడు మా తండ్రి' !"
"అంటే మీనింగ్ చెప్పవా తాతా ! ఈ పాట వింటూ ఉంటాం. మీనింగ్ తెలియదు. నువ్వు చక్కగా పాడుతావు తాతా !" ఆశ్చర్యంగా అడిగింది లలిత.
"అంటే 'శ్రీరాముడు మాకు నాన్నగారు, ఆయన భార్య సీత మాకు అమ్మ, హనుమంతుడు, లక్ష్మణుడు, గరుత్మంతుడు, శత్రుఘ్నుడు, బ్రహ్మ, భరతుడు ఇటువంటి వారు మాకు బ్రదర్స్ ! అంతే కాదు వశిష్టుడు, వామదేవుడు, నారదుడు వంటి వారందరూ మాకు చాలా దగ్గర బంధువులు, వీరందరూ నువ్వు మాకు తండ్రివి అవడంవలనే బంధువులు అయ్యారు ఓ రామచంద్ర ప్రభూ' అని" అన్నారు పినాకపాణి గారు.
"అబ్బ ! ఎంత బాగుందో అలా అనుకుంటే తాతా ! త్యాగరాజు గారు బ్లెస్స్డ్ సోల్ కదా ?" అన్నది లలిత.
"అవును తల్లీ ! ఆయన నైన్టీ సిక్స్ క్రోర్స్ రామనామం వ్రాశారు అంటారు. మేము లక్షలు దాటి వన్ క్రోర్ వ్రాసి, గొప్పవాళ్ళం అనుకుంటాము !" అన్నారు పినాకపాణి గారు భక్తితో.
"తాతా ! నువు రెస్ట్ తీసుకో ! అమ్మ కేకలేస్తుంది. పినాకీ ! రా ! నీకు కూడా నిద్ర వస్తోంది " అని మెల్లగా తమ్ముడిని లేపి వేరే మంచం మీద నిత్య పక్కనే పడుకోబెట్టింది లలిత.
****** ****** ******
మర్నాడు తాతగారు నిత్యతర్పణాలు అయిపోయాక మళ్ళీ ఇద్దరూ ఆయన దగ్గర చేరారు.
"తాతా ! నిన్న గాడ్స్ అందరూ రిలేటివ్స్ అన్నావు, ఆ తర్వాత కంటిన్యూ చెయ్యవా ?" అన్నది లలిత.
"మన ఇంట్లో పెళ్ళో, మరేదోనో జరిగింది అనుకో. చుట్టాలు వస్తారు, వాళ్ళని మర్యాద చేస్తావా లేదా ?"
"అంటే ఎలాగ తాతా ? అర్ధం కాలేదు "
"సరే ! లాస్ట్ ఇయర్ మీ తాతగారిది సిక్స్టీ ఇయర్ బర్త్ డే చేశారు కదా ? ఎవరెవరు వచ్చారు ?"
"చాలా మంది వచ్చారు తాతా ! టూ హండ్రెడ్ దాకా ఇన్వైటీస్, రిలేటివ్స్ వచ్చారు."
"వాళ్ళు వచ్చారులే, కుర్చీలు చూసుకుని కూర్చుంటారులే, బ్రేక్ ఫాస్ట్, లంచ్ వాళ్ళే తీసుకుంటారులే అని అనుకున్నారా మీ అమ్మ, శేఖర్ మామయ్య ?"
"అలా ఎందుకు అనుకుంటారు తాతా ? మమ్మీ, మామయ్య, మాలతి అత్త అందరినీ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో ! నేను, నిత్య కూడా ఎంట్రెన్స్ దగ్గర పన్నీరు జల్లి, ఫ్లవర్స్ ఇచ్చాము. కూల్ డ్రింక్స్, కాఫీలు ఇచ్చారు. ఆ తర్వాత తాతగారు, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా పలకరిస్తే పేరు పెట్టి అందరినీ చక్కగా పలకరించారు వాళ్ళు. అక్కడ హోమం అదీ, పూజ అయిపోయాక భోజనం చేసి వెళ్ళమని మరీమరీ చెప్పారు. భోజనం దగ్గర కూడా మమ్మీ, శేఖర్ మామ, అత్త అందరికీ అన్నీ అందాయో లేదో కనుక్కున్నారు. భోజనం తర్వాత కిళ్ళీలు ఇచ్చారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే అందరికీ పేరు పేరునా థాంక్స్ చెప్పి అందరికీ కొత్త బట్టలు పెట్టారు."
అవును కదా ! అట్లాగే ప్రతిరోజూ పూజ చేసేటప్పుడు దేవతలని గౌరవంగా ఇన్వైట్ చేసి, కాళ్ళు కడుగుకోవడానికి నీళ్ళు ఇచ్చి, త్రాగడానికి మంచి నీళ్ళు ఇచ్చి, టిఫిన్ రూపంలో మధుపర్కం ఇచ్చి, దేవతలు మన ఇంటికి వచ్చారు కాబట్టి స్నానం చేయించి, బట్టలు పెట్టి, గంధం, ఇలాంటివి ఇచ్చి, భక్తిగా పూలతో పూజ చేస్తాము. ఆ తర్వాత భోజనం అంటే నైవేద్యం పెట్టి, మళ్ళీ మంచినీళ్ళు ఇచ్చి, చేతులు, కాళ్ళు కడుగుకోవడానికి నీళ్ళు ఇచ్చి, తాంబూలం అంటే కిళ్ళీ అన్నమాట ! అది ఇచ్చి, మన ఇంటికి వచ్చినందుకు థాంక్స్ చెప్పి, మళ్ళీ మళ్ళీ రండి అని మర్యాదగా, భక్తిగా వేడుకుంటాము. ఇదే నిత్య పూజ. దీన్లో 16 ఐటమ్ లు ఉంటాయి. అందుకే షోడశోపచార పూజ అంటాము. అర్ధమైందా ?"
"అర్ధమైంది తాతా ! చాలా బాగుంది ప్రతిరోజూ ఇలా చేస్తారు అంటే. ఏది ఏమైనా మన కంట్రీ గ్రేట్ కదా తాతా ?" అన్నది లలిత కళ్ళు విప్పార్చుకుని.
@@@@@@@@@@
"అవునమ్మా ! మన దేశంలో అనేక ప్రాంతాలవారు వేరే వేరే దేవుళ్ళని పూజించినా, అందరూ ఫాలో అయ్యే పూజా విధానము దాదాపు ఒక్కటే. అందరూ అనుసరించేది ఆ నాలుగు వేదాలనే ! వీరందరినీ ఒక పద్ధతిలో నడిచేలా చేసిన మహనీయుడు జగద్గురు శ్రీ ఆదిశంకరులు. ఆయన కో ఆర్డినేట్ చేసిన ఆరు మతాలు మన దేశంలో మెజారిటీ జనులు ఫాలో అవుతున్నారు. ఆయనే లేకపోతే సనాతన ధర్మం ఖేయాస్ (గందరగోళం) లో ఉండేది."
"తాతా ! నువ్వు రామకోటి రాస్తున్నావు కదా ? అది రాస్తే హాండ్ రైటింగ్ ఎలా బాగుపడుతుంది ?" పినాకి సందేహం.
"అనగననగ రాగమతిశయించునుండు" అన్నాడు వేమన గారు. అంటే ఒక రాగం పాడుతూ పాడుతూ ఉంటే అది చక్కగా నీకు పట్టు బడుతుంది. అలాగే శ్రీ రామ నామం వ్రాస్తూ ఉంటే తప్పకుండా రైటింగూ కుదురుగా వస్తుంది. అలాగే శ్రీ రాముడు ఫాలో అయిన ధర్మం పదేపదే తలుచుకుంటూ ఉంటే మన కారెక్టర్ కూడా చక్కబడుతుంది."
"శ్రీ రాముడు ఫాలో అయిన ధర్మం ఏమిటి ? ఆయన చెప్పిన సేయింగ్స్ పుస్తకాలు దొరుకుతాయా ?" లలిత కుతూహలంగా.
"లలిత తల్లీ ! ఆయన నేను ఇలా చెబుతున్నాను, ఇదే ఫాలో అవండి అని ఎప్పుడూ చెప్పలేదు. ఏది చెప్పినా 'మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే.....' అని మాత్రమే చెప్పేవాడు. ఆయన చేసింది మనం ఫాలో అవ్వాలి. శ్రీ కృష్ణుడు భగవద్గీతలో ఏమి చెప్పాడో అది ఫాలో అవ్వాలి. శ్రీ కృష్ణుడు నేను చేసింది చెయ్యకండి, నేను చెప్పినది చెయ్యండి అనేవాడట, ఇది మా నాన్నగారు చెప్పారు నాకు."
"నీకు రాముడంటే చాలా ఇష్టం కదా తాతా ?" అన్నది లలిత చిరునవ్వుతో.
"అది నిజమేనమ్మా ! ఆయన పరిపూర్ణ మానవుడు. మీకు మీ స్కూళ్ళలో చెప్పెవారేమో తెలియదు. ఐడియల్ అని ! ఆ ఐడియల్ శ్రీ రాముడే. ఐడియల్ సన్, ఐడియల్ బ్రదర్, ఐడియల్ హస్బెండ్, ఐడియల్ మాస్టర్, ఐడియల్ ఫ్రెండ్, ఐడియల్ కింగ్, చివరికి ఐడియల్ ఎనిమీ కూడా !" అన్నారు పినాకపాణి గారు తన్మయత్వంతో.
"ఐడియల్ ఎనిమీ యా ? ఎలాగ ?" అన్నది లలిత ఆశ్చర్యంగా.
"రావణుడి మీద చెప్పకుండా దాడి చెయ్యడం కాకుండా ముందుగా అంగదుడితో మెసేజ్ పంపాడు, సీతమ్మను పంపమని, యుద్ధం మొదలయ్యాక కూడా ఒకసారి రావణుడు బాగా టైర్ అయిపోతే 'నువ్వు ఇవాళ యుద్ధం ఆపి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో ! రేపు ఉదయం మళ్ళీ యుద్ధానికి రా !' అని పంపించేసాడు. అలా ఎవరైనా చెప్పగలరా ?"
అవునన్నట్లు తల ఊపారు పిల్లలు ఇద్దరూ.
సశేషం.........
"శ్రీ రాముడు పరిపూర్ణ మానవుడు అన్నావు కదా తాతా ! ఇంకా ఏమైనా ఆయన గురించి చెప్తావా ?" అన్నది లలిత.
"తప్పకుండా తల్లీ ! ఆయన పరిపూర్ణుడు ఎందుకయ్యాడంటే మన దేవతలలో అతి పవర్ ఫుల్ గాడ్స్ ముగ్గురి అంశలు ఆయనలో ఉన్నాయి. శివుడు, విష్ణు మూర్తి, అమ్మవారు."
"ఎలా ?"
"శ్రీ రామ పేరులో రా అన్న అక్షరం ఓమ్ నమో నారాయణాయ నుంచి తీసుకున్నారు. దానిని బీజాక్షరం అంటారు. అంటే ఆ అక్షరం రిమూవ్ చేస్తే ఆ పేరుకి ఉన్న పవర్ పోతుంది. అంటే 'రా' తీసేశారు అనుకో 'నా అయనాయ' అవుతుంది, దానికి అర్ధం తెలుసా ? దిక్కు లేని వాడా ! అని. అలాగే నమఃశివాయ లో 'మ' తీసేశారనుకో నః శివాయ అవుతుంది, అంటే శివుడు కాని వాడా ! అని పిలిచినట్లు. అందుకని రామ నామంలో శివ కేశవులు ఇద్దరూ వస్తారు."
"మరి శ్రీ కూడా ఉంటుందిగా తాతా ! దాని సంగతేమిటి ?" అన్నది లలిత.
"శ్రీ సాక్షాత్తు ఆ జగజ్జనని - లలిత అనుకో, లక్ష్మీ అనుకో, భారతి అనుకో ! ఆ శ్రీ కలిసిన తర్వాత రాముడు శ్రీరాముడు అయినాడు.
"విశ్వనాథ సత్యనారాయణ గారి పేరు వినే ఉంటావు. ఆయన వేయిపడగలులో వ్రాస్తారు. సీతా రాములు పెళ్ళి అయ్యే వరకే విడివిడిగా ఉంంటారు. పెళ్ళి అయిపోయాక వారికి ఎడబాటు లేదు. రావణుడు అపహరించినా కూడా ! శ్రీ రాముడి మనసులో సీతమ్మ ఉంది, అమ్మ మనస్సులో రాముడే ఉన్నాడు. అందుకే వారిద్దరూ ఐడియల్ కపుల్ "
లలిత అబ్బురంగా వింటూ తలాడించింది.
"ఇంకా చెప్పాలంటే కాశీ లో చనిపోతే మోక్షమే అంటారు. దానికి కారణం చనిపోయే ముందు పరమశివుడు చనిపోయే వారి చెవిలో శ్రీరామ అని చెపుతాడు."
"నేను కూడా కోరుకునేది 'అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవితం, దేహాంతే తవ సాన్నిధ్యం, దేహిమే జానకీ పతే !' తల్లీ !"
"అంటే ఏమిటి తాతా ?"
"చనిపోయేటప్పుడు ఏ బాధ లేకుండా తేలికగా వెళ్ళిపోవడం, అశాంతితో కూడిన లైఫ్ లేకుండా ఉండడం, డెత్ వచ్చినప్పుడు నీ ప్రెజెన్స్ లో నీ పేరు జపిస్తూ వెళ్లిపోవడం ఇవి మూడూ నాకు ఇవ్వమని బెగ్ చేస్తున్నాను ఓ సీతాపతీ ! అని అడుగుతున్నాను." పినాకపాణి గారి గొంతులో తన్మయత్వంతో కూడిన గాద్గదికత లలితకి దుఃఖం కలిగించింది. తాతగారిని చుట్టేసి బావురుమంది.
మనుమరాలిని వీపు నిమురుతూ ఉండిపోయాడు తాతగారు.
ఒక్క నిముషంలో తేరుకుని లలిత కళ్ళు తుడుచుకుంటూ "ఇలా మాట్లాడితే మేము యూ ఎస్ వెళ్ళిపోతాం తాతా ! నువ్వు చెప్పే హిందూ ధర్మం డీటెయిల్స్ చాలా బాగున్నాయి. డెత్ గురించి మాత్రం మాట్లాడొద్దు. సరేనా ?"
"అలాగే తల్లీ ! ఒక్కొక్క సారి అలా అనుకోకుండా వచ్చేస్తుంది. మామ్మ వెళ్ళిపోయాక ఆ ఆలోచనలే వస్తున్నాయి" నిర్వేదంతో అన్నారు పినాకపాణి గారు.
"తాతా ! మామ్మ అంటే నీకు ఎంత ఇష్టమో తెలుసు. కానీ మామ్మనే తలుచుకుంటూ బాధ పడుతున్నారు, మేము వచ్చాము కదా ? నెమ్మదిగా మామ్మ పోయిందని మర్చిపోండి. మేమే మామ్మ, సరేనా ?" లలిత మాటలకి పొంగిపోయారు పినాకపాణి గారు.
"మామ్మ గారి గురించి చెప్పండి తాతా ! మేము అక్కడ ఉన్నాం, రోజూ మాట్లాడుతున్నాం కానీ మాకు మామ్మ గారి గురించి పెద్దగా తెలియదు."
"మాకు పెళ్ళై నలభై నాలుగు సంవత్సరాలైంది. మీ మామ్మ ఎమ్ ఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది తెలుసా ?" నోరు తెరిచేసింది లలిత.
"నిజం ! సాంస్క్రిట్ తన సబ్జెక్టు. కానీ జాబ్ కోసం కాదు, మన ప్రాచీన గ్రంధాలు అర్ధం చేసుకోవడానికి ! చాలా డీప్ గా చదివింది, నా కన్నా ఎక్కువ తెలుసు తనకి. నాకు మా గురువు గారు పంచాక్షరి, బాల ఉపదేశం చేసారు, కానీ తనకి ఉన్న నాలెడ్జ్, కాన్సంట్రేషన్ చూసి షోడశి ఉపదేశం చేసారు" అన్నారు.
లలిత ముఖం ప్రశ్నార్థకంగా ఉండే సరికి "పంచాక్షరి అంటే శివుని మంత్రం ఐదు అక్షరాలు ఉంటాయి. బాల కు మూడు అక్షరాలు అటు, ఇటు రెండు సార్లు అయ్యేసరికి ఆరు అక్షరాలు. షోడశి అంటే పదహారు అక్షరాలు ఉన్న మంత్రం. అమ్మవారి అల్టిమేట్ మంత్రం అన్నమాట"
"ఐతే మీ బాల కన్నా గొప్పదా తాతా ?"
"గొప్ప, తక్కువ ఏమీ కాదురా తల్లీ ! అవి రెండూ అమ్మవారి అనుగ్రహం కోసం చేసే తపస్సులో రెండు లెవెల్స్ అంతే ! అది మీ వయస్సులో డీప్ గా తెలుసుకోవలసిన అవసరం లేదమ్మా !"
"మరి నువ్వు రాముడిని ఎక్కువ లైక్ చేస్తావు కదా ? రామ మంత్రం ఉండదా ?"
"హహహ ! అమ్మలూ ! రామ మంత్రం ఎన్నో సార్లు చేస్తేనే పంచాక్షరి, బాల ఇచ్చారు గురువు గారు."
"బాల, పెద్ద అమ్మవారు ఒకటి కాదా ? విడి విడిగా మంత్రాలు ఏమిటి ?"
"అందరూ నువ్వు పెద్ద అమ్మవారు అంటున్న రాజరాజేశ్వరీ దేవి, లలితా త్రిపుర సుందరీ అమ్మవారి అంశలే ! దేవీ భాగవతం లో బాల త్రిపురసుందరీ దేవి కూతురు అని చెప్తారు వ్యాసుడు. మహిషాసురుడితో యుద్ధంలో బాల కూడా యుద్ధం చేస్తుంది. విషంగుడిని, విశుక్రుడినీ వధించిందని లలితా సహస్రనామ స్తోత్రం లో వస్తుంది."
"బాల అంటే చిన్నపిల్ల నాలాగే అనుకున్నాను, యుద్ధం కూడా చేసిందన్నమాట " అన్నది లలిత ఆశ్చర్యంగా.
"తాతా ! రాముడిని గురించి చెప్పు ! హనుమంతుడు సుగ్రీవుడి దగ్గర ఉండేవాడు కదా ? రాముడి దాసుడు ఎందుకయ్యాడు ? సుగ్రీవుడి మినిస్టర్ కదా ? రాముడి తోటే తిరిగే వాడు దేనికి ?"
చిన్న నవ్వు నవ్వారు పినాకపాణి గారు. "నీకు మాకు ఎవరికీ రాని డౌట్స్ వస్తాయమ్మలూ ! గుడ్ ! అటువంటి ఆలోచనలు, సందేహాలు మంచివే ! కొందరికి వచ్చే పిచ్చి సందేహాలు లాగా కాకుండా !"
"హనుమంతుడు సూర్యుని దగ్గరకు వెళ్తుంటే ఇంద్రుడు వజ్రాయుధం తో కొట్టాడు, అప్పుడు ఆయన భూమి మీద పడిపోయాడని తెలుసు కదా ?"
"తెలుసు తాతా ! మాకు అక్కడ సమ్మర్ షవర్స్ అని సత్యసాయిబాబా గారి డివోటీస్ క్లాసులు కండక్ట్ చేస్తారు. ఈ కథ చెప్పారు."
"ఆయన పడిపోయాక వాయుదేవుడు ఆయనను తీసుకుని ఒక గుహలో చేరి లోకం అంతా ప్రసరించడం మానేశాడు. అంటే ఎయిర్ సర్క్యులేషన్ ఆగిపోయింది.
"అప్పుడు అందరూ ఊపిరి ఆడక గిలగిల లాడుతుంటే బ్రహ్మ గారు ఆయన్ని మళ్ళీ బ్రతికించి ఆయన ముందు ముందు చాలా గొప్ప పనులు చెయ్యాలనీ, విష్ణుమూర్తి అవతారమెత్తినపుడు ఆయనకు సహాయం చెయ్యాలని చెప్పి బోలెడు వరాలు అంటే బూన్స్ ఇచ్చాడు.
"దేవతలందరూ కూడా బూన్స్ ఇచ్చారు. సూర్యుడేమో తాను స్వయంగా హనుమంతుడికి విద్య నేర్పిస్తానని అంటాడు. అలాగే అన్ని విద్యలు నేర్పుతాడు. గురు దక్షిణ అడిగితే ఆయన తన కొడుకు అయిన సుగ్రీవుడి ఆంతరంగికుడిగా ఉండి ఆయనను రక్షిస్తూ ఉండమని కోరాడు.
"అందుకనే రాముడు సీతమ్మను వెతుక్కుంటూ సుగ్రీవుడి దగ్గరకు వెళ్ళినపుడు ముందుగా హనుమంతుడే కలుస్తాడు. హనుమ పాండిత్యాన్ని శ్రీ రాముడు ఇట్టే గ్రహిస్తే, తాను సేవ చేయవలసినది శ్రీ రామునికే అని హనుమ గ్రహిస్తాడు."
"అబ్బ ! ఎంత బాగుందో ఈ కథ !" అన్నాడు పినాకి.
"తాతా ! హనుమంతుడు ఇప్పుడు లాగా ఫోన్లు, వైఫై లు, గూగుల్ మ్యాప్ లు లేని టైమ్ లో ఎలా వెతికి పట్టుకున్నాడో సీతని ? నిజంగా ఆయన రాముడికి చేసిన. సిన హెల్ప్ చాలా గ్రేట్ కదా !"
మనవణ్ణి కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నారు తాతగారు. "అవును తాతా ! ఆయన శ్రీ రాముడికి చేసిన ఉపకారం అంతకు ముందు, ఆ తర్వాత ఎవరూ ఎవరికీ చెయ్యలేదు. కానీ ఆ హెల్ప్ హనుమంతుడు తన డ్యూటీ అనుకున్నాడు కానీ హెల్ప్ అనుకోలేదు. అందుకే ఆంజనేయుడు అందరికీ వందనీయుడు" అన్నారు పినాకపాణి గారు కేల్మోడ్చి !
"తాతా ! సీతాదేవిని లంకలో తప్పు పట్టి ఆవిడ అగ్ని ప్రవేశం చేస్తుంటే మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయాడే రాముడు, ఆయన గాడ్ ఎలా అవుతాడు ? ఆయనకి సీత ప్యూర్ అని తెలుసు అంటారు మళ్ళీ !" అన్నది లలిత.
"బంగారు తల్లీ ! ఎంత చక్కని సందేహాలురా ! ముందు శ్రీ రాముడు తాను గాడ్ అని ఆయనకి తెలియదు. తెలిస్తే రావణాసురుడిని చంపగలిగేవాడు కాదు. రావణుడికి ఉన్న వరాలవి. సీతమ్మ అగ్ని నుంచి చెక్కుచెదరకుండా బయటకు వచ్చిన తర్వాత ఆయన కంట నీరుతో తనకి ఆమె ప్యూర్ అని తెలుసు అనీ రాజుగా తన భార్య ప్యూర్ అని ప్రజలకి తెలియాలని ఆ అగ్ని ప్రవేశం అడ్డుకోలేదని అంటాడు
"నీకు ఇంగ్లీష్ లో సీజర్స్ వైఫ్ మస్ట్ బి అబవ్ సస్పిషన్ అన్న ఇడియం (సామెత/జాతీయం) తెలుసు కదా ?"
"తెలుసు తాతా ! సీజర్ ఎవరినైనా గిల్టీ అనే ముందు సీజర్ భార్య ఆ తప్పు చెయ్యకుండా ఉండాలి అని !"
సరిగ్గా శ్రీ రాముడు ఫాలో అయిన ధర్మం అదే తల్లీ ! సీజర్ కన్నా చాలా చాలా ముందే !"
సంభ్రమంగా చూసింది లలిత. "నిజమే తాతా ! రాముడు రియల్లీ గ్రేట్ ! కానీ తాతా ! వెనకకి వచ్చి కింగ్ అయ్యాక మళ్ళీ సీతని ఎందుకు బ్యానిష్ చెయ్యాలి ? ఆవిడ ఫైర్ లోనుంచి సేఫ్ గా వచ్చిందని ప్రజలకి తెలుసు కదా ? మళ్ళీ ఎవరో ఎక్యూజ్ చేశారని అడవిలోకి ఎందుకు పంపాలి ? పైగా ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా !"
"అక్కడ మళ్లీ ఇదే ప్రాబ్లం అమ్మలూ ! ఆవిడ అక్కడెక్కడో ఫైర్ లోకి వెళ్ళి మళ్ళీ వచ్చిందని కొంతమందికి తెలియక పోవచ్చు. తెలిసినా నమ్మకపోవచ్చు. అందుకే ఆయనకు అలా చెయ్యడం తప్పలేదు."
"పోనీ అలా వెళ్ళినా మళ్ళీ తన ఛాస్టిటీ (శీలం) నిరూపించుకుంటే దగ్గరకు తీస్తానని అన్నాడు కదా ? మరి ఆవిడ తాను ఛేస్ట్ అని ఓత్ తీసుకుని భూమి లోకి ఎందుకు వెళ్ళింది ? వెళ్తుంటే రాముడు ఎందుకు అడ్డం పడలేదు ?"
"శ్రీ రాముడు ఏమైనా చేసేలోపే సీతమ్మ తన తల్లి భూదేవిని తనని తీసుకెళ్ళమని అడగడము, ఆవిడ సింహాసనం మీద కూర్చుని వచ్చి సీతమ్మను తన సింహాసనము మీద కూర్చోబెట్టి తీసుకుని వెళ్లిపోవడమూ రెప్పపాటులో జరిగిపోయాయి లలితమ్మా !
"ఆ తర్వాత రాముడు భూమి మీద అస్త్రాలు వేస్తాననీ, అత్తగారు అవడం వల్ల ఆ పని చెయ్యలేక పోతున్నాననీ సీతను ఇచ్చెయ్యమనీ వేడుకుంటాడు. కానీ అలా జరగలేదు!"
లలిత ఒక రెండు నిమిషాలు మౌనంగా ఆలోచించి అన్నది "సీతాదేవి అలా ఎందుకు వెళ్ళిపోవాలి తాతా ?"
"ఆవిడ అవతారం అయిపోయిందమ్మా ! ఆవిడ వైకుంఠం వెళ్ళి రాముడి కొసం వెయిట్ చేస్తుంది " అన్నారు పినాకపాణి గారు సంభాషణ తేలిక చెయ్యడానికి.
"అది కాదు తాతా ! ఆవిడ రాముడి గురించే కాదు, లవకుశుల గురించే కాదు, ఆ కింగ్డమ్ ప్రజల గురించి ఆలోచించలేదేమి ? ఆవిడ రాణిగా ఉన్నది కొన్ని రోజులే కదా ? ప్రజలకి ఆవిడ కైండ్ నెస్ అదీ తెలియాలి కదా ? మనం రాముడి రాజ్యంలో ప్రజలమే కదా ? మన గురించి కొంచెం కూడా ఆలోచించలేదా ?" లలిత కళ్ళలో నీటిపొర.
పినాకపాణి గారు చలించిపోయారు. "తల్లీ ! జన్మజన్మల సంస్కారం నీది, ఇటువంటి సందేహం రావడానికి ! నాకు నీ డౌట్ తీర్చగల కెపాసిటీ లేదురా !"
"ఎందుకు తాతా ?"
"ఎందుకంటే ఆ ఒక్క సందేహమే నాకు ఇంతవరకూ తీరని సందేహం లలితమ్మా!"
అని కన్నీరు కారుస్తూ మనుమరాలిని దగ్గరకు తీసుకున్నారు.
ఇంక ఆ రోజు పిల్లల సందేహాలు తీర్చే సమయం ఇంక తాతగారికి దొరకలేదు. మర్నాడు ఆయన ఫలహారం టైమ్ కి ఇద్దరూ ఆయన దగ్గర చేరారు.
"తాతా ! నువ్వు పూజ అయ్యాక బయటికి వచ్చి తులసి చెట్టు దగ్గర కూర్చుని చేసేది కూడా పూజేనా ?" అని అడిగాడు పినాకి.
"అవును తాతా ! పూజ లాంటిదే ! పితృదేవతలకు పూజ అనుకో ! దానిని పితృ యజ్ఞం అంటారు !"
"అంటే ?" అన్నారు పిల్లలు ఒక్కసారే.
"అంటే మన ఏన్సెస్టర్ లు అందరికీ పూజ వంటిది చెయ్యడం. కాకపోతే దీనిలో పూజలాగ అన్ని ఉపచారాలు ఉండవు, కేవలం నీళ్ళు ఇవ్వడమే, అదే వారికి నైవేద్యం అన్నమాట."
"ఓహో ! ఇందులో పితృ దేవతలు ఎవరు ? మీ మమ్మీ, డాడీ యా ? ఆ ఇద్దరే ఐతే అన్ని సార్లు నీళ్ళు పోస్తున్నవెందుకు ?" లలిత.
అటుగా వచ్చిన తల్లి విద్య "అమ్మలూ, పినాకీ ! ఇప్పుడే ఈ ఏజ్ లో మీకు అవసరం లేదు. ఇంకొంచెం పెద్ద అవాలి మీరు." అన్నది.
"నిజమేనర్రా ! ఇంకొంచెం పెద్ద అవాలి మీరు అయినా బ్రీఫ్ గా చెప్తాను సరేనా ?"
"సరే తాతా ! నువ్వు ఎంత వరకు చెప్తే అంతవరకే " అన్నది లలిత.
"నేను ప్రతి రోజూ నాకు మూడు జనరేషన్లకి నీరు ఇస్తాను."
"అవునా ?"
"మా నాన్నగారు, తాత గారు, ఆయన నాన్నగారు ఆ తర్వాత మా అమ్మ, మా మామ్మ, ఆవిడ అత్తగారు !"
"ఆహాఁ !"
"మా అమ్మ వైపు తాతగారు, ఆయన తండ్రి, తాతగారు."
"వావ్ !"
"మా అమ్మ, ఆవిడ అత్తగారు అంటే మా అమ్మమ్మ, ఆవిడ అత్తగారు !"
"అమ్మో !"
"వీళ్ళే కాకుండా మా అత్తగారు, మామగారు అంటే మీ మామ్మ పేరెంట్స్ !"
"వ్హాట్ !"
"ఇంకా మా నాన్నగారి బ్రదర్స్, సిస్టర్స్, మా అమ్మ బ్రదర్స్, సిస్టర్స్ !"
"బాబోయ్ !"
"నా భార్య అంటే మీ మామ్మ, జగద్గురు శ్రీ ఆదిశంకరులు, ఆ తర్వాత నాకు మంత్రోపదేశం చేసిన నా గురువరేణ్యులు"
"ఇది ఓకే"
ఇంకా నా కుటుంబ పరంపరలో ఎవరికైనా మగ సంతానం లేక నీరు వదిలేవారు లేకపోతే వారికి కూడా ! "
"ఓ గాడ్ ! నో వే! ఎందుకు తాతా అలాగు ?"
"తల్లిదండ్రులు, తాత ముత్తాతలకు నీరు వదిలే అధికారం మగపిల్లవారికి ఉంటుంది. ఆడ పిల్లలు పెళ్ళై వేరే ఇంటికి వెళ్ళి వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చెందేటందుకు తోడ్పడతారు. అది వారికి నిర్దేశించిన పని.
అందుకని ఎవరికైనా మగ సంతానం లేక నీరు వదిలేవారు లేకపోతే ఆ వంశంలో ఎవరైనా సరే వారి పేరు చెప్పుకుని నీరు వదలవచ్చు. దీనినే కారుణ్య తర్పణం అంటారు.
"ఇదే మన ధర్మంలో గొప్పదనం లలితమ్మా !"
లలిత ఆలోచించి చిన్న గొంతులో అన్నది "నిజమే తాతా ! ఇలా అందరినీ గురించి ఆలోచించేవారు ఎవరు ?"
తర్వాత తాతగారు ఫలహారం అయిపోయాక ఆయన వెంటే గదిలోకి వెళ్ళి తమ్ముడు వెంట లేడని రూఢి చేసుకుని "తాతా ! నువ్వు ఏమనుకోనంటే ఒకటి అడగనా?" అన్నది.
"అడుగు తల్లీ !"
"నువ్వు ఆ తర్పణాలు ఇచ్చేటపుడు, చివరిలో కంట నీరు పెట్టుకున్నావెందుకు ?"
మనవరాలి వైపు నిశితంగా చూశాడాయన. కొద్ది సేపటిలో ఆయన చూపు మెత్తపడి ఆర్ద్రమైంది.
లలితని దగ్గరకు తీసుకుని "మీ మామ్మ ఆరోగ్యం ఒక నాలుగైదు ఏళ్ళుగా బాగులేదు తెలుసుగా ? ఇంటస్టైన్ మీద ఆపరేషన్ కూడా అయింది, ఆపరేషన్ తర్వాత మందులు వాడడం వల్ల ఆకలి ఉండేది కాదు, ఏమీ తినేది కాదు. కానీ రాత్రి పూట నీరసం వచ్చేసేది. ఆ రోజుల్లో నేను లేచి కొంచెం కూరో, పచ్చడో వేసి అన్నం తినిపించి, మజ్జిగ ఇచ్చేవాడిని. కొంత కాలం తర్వాత ఆరోగ్యం బాగుపడి రాత్రి పూట అన్నం తినడం ఆపేసింది కానీ నాకు ఆ టైమ్ కి మెలుకువ వచ్చేది. మామ్మ కి వేసంకాలంలో మజ్జిగ, మిగిలిన రోజుల్లో మంచినీళ్ళు ఇవ్వడం అలవాటై పోయింది." ఆగాడాయన.
"ఊఁ ! చెప్పు తాతా !"
"తను పోయిన రోజున నేను మామూలు టైమ్ కి లేచి మంచినీళ్ళు గ్లాసు లో పోసి ఇచ్చాను కానీ తీసుకోవడానికి తను ప్రాణాలతో లేదు. నిద్రలోనే వెళ్ళిపోయింది " గద్గదికత ఆపుకోలేక పోయాడాయన.
"సారీ తాతా ! ఆ విషయం అడగద్దని మమ్మీ, డాడీ స్ట్రిక్ట్ గా చెప్పారు. ఏడవద్దు తాతా !" వెక్కుతూ అంది లలిత.
"ఫర్వాలేదు తల్లీ ! ఆ రోజు నేనిచ్చిన నీళ్ళు తాగలేదన్న సంగతి తర్పణాలలో నీళ్ళు ఇచ్చేటప్పుడు రోజూ గుర్తొస్తుంది. అదీ సంగతి !" అన్నాడు మనుమరాలి తల నిమురుతూ.
మరునాడు పినాకి సందేహం మళ్ళీ వెనుకటి టాపిక్ కి వెళ్ళింది.
"తాతా ! అసలు మనకి ఇందరు గాడ్స్ ఎందుకు అన్నది చెప్పలేదు, టాపిక్ వేరే రూట్ లోకి వెళ్ళిపోయింది !" అన్నాడు బుంగమూతి పెడుతూ.
"చెప్తాను. మనకి ఎన్ని రకాల పనులు ఉన్నాయో, మన చుట్టూ ఎన్ని సిచుయేషన్స్ ఉన్నాయో అన్నిటికీ గాడ్స్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మనీ అంటే డబ్బు దీనికి దేవత లక్ష్మీ దేవి. మనీ కి కీపర్ కుబేరుడు. పుస్తకం, చదువు, లేకపోతే నాలెడ్జ్ ! వీటికి సరస్వతీ దేవి దేవత. మనకి కావలసిన పవర్, స్ట్రెంగ్త్, కరేజ్ కి శక్తి కి దేవత పార్వతీ దేవి.
"మనం పుట్టేందుకు బ్రహ్మ, బ్రతికి ఉండేందుకు విష్ణు మూర్తి, చనిపోవడానికి శివుడు - మళ్ళీ ఇక్కడ డెత్ అంటే చావు అనే సిచుయేషన్ కి యముడు గాడ్ ! వర్షం కోసం వరుణుడు, గాలి కోసం వాయువు, ఫైర్ కోసం అగ్ని, ఇలా ప్రతి దానికీ వేరే వేరే గాడ్స్ ప్రత్యేకంగా ఉన్నారు. అంటే అర్ధం ఏమిటంటే మనము రోజూ జరిగే విషయాలు అన్నింటిలోను దేవుణ్ణి చూడగలగాలి.
"ఇంకో వింత విషయం : మనకి కలిగే అబ్స్టకిల్స్ అంటే విఘ్నాలకి కూడా ఒక దేవుడు ఉన్నాడు. తెలుసా ?"
"తెలుసు, గణపతి !" అన్నారు ఇద్దరూ ఒకేసారి.
"వెరీ గుడ్ ! అలాగే పాములకు స్వామి కుమార స్వామి, మన దేవతలకి వాహనాలు అన్నీ జంతువులే ! వాటిని కూడా దేవతా స్వరూపంగా భావించి కొలుస్తారు మనవారు. మీకు తెలిసిన వాహనాలు చెప్పండి !"
"గణపతి ఎలుక, కుమారస్వామి నెమలి, బ్రహ్మ హంస, విష్ణుమూర్తి గ్రద్ద, శివుడు ఎద్దు" గడగడా చెప్పింది లలిత.
పినాకి కి కొంచెం రోషం వచ్చింది "లలిత అమ్మవారికి పులి, ఇంద్రుడికి ఎలిఫెంట్, యముడికి ఆక్స్" అన్నాడు.
"ఆక్స్ కాదురా పినాకీ ! మేల్ బఫెలో " అన్నది పరిహాసం గా లలిత.
ప్రశ్నార్థకంగా చూస్తున్న మనవడితో "కరెక్ట్ తాతా ! మేల్ బఫెలో ని తెలుగులో దున్నపోతు అంటాము. మనం మన పల్లెటూరు వెళ్ళినపుడు చూద్దువు కాని !"
ఉత్సాహంగా "ఎప్పుడు వెళ్దాం తాతా ?" అన్నారు ఇద్దరూ.
"ఎల్లుండి ఉదయం పొద్దున్నే ! సరేనా ?"
"ఓకే తాతా !"
"తాతా ! మన మగ దేవుళ్ళందరికీ ఇద్దరు భార్యలు ఉంటారు ఎందుకని ?" లలిత సందేహం.
పకపకా నవ్వారు పినాకపాణి గారు. "ఏం ? ఉండకూడదా పరమేశ్వరీ ?"
బుంగమూతి పెడుతూ లలిత "అలా అని కాదు తాతా ! ఊరికే డౌట్" అన్నది.
ఈ సారి నవ్వు ఆపేసి పినాకపాణి గారు "నీ డౌట్ సరైనదేనమ్మా ! అసలు విష్ణు మూర్తి కి కానీ, శివుడికి కానీ భార్య ఒకరే విష్ణువుకు లక్ష్మీ దేవి, శివుడికి పార్వతీ దేవి భార్యలు. విష్ణు మూర్తి వరాహావతారం సమయంలో తన ముట్టెతో భూమండలాన్ని ఉద్ధరించాడు. శివుడు భగీరధుడి తపస్సుకు ప్రసన్నుడై గంగా దేవిని శిరస్సున ధరించాడు. అందుకనే వారిని భార్యలుగా భావించి కొలుస్తారు భక్తులు.
"ఇంకొక విషయం మీకు తెలుసునా ? మన దేవతలలో పెళ్లి అసలు కానివారు ముగ్గురు ఉన్నారు. చెప్పండి చూద్దాం!"
లలిత కొంచెం ఆలోచించి "హనుమంతుడు.....? అవునా తాతా ?" అన్నది.
"గుడ్ ! ఇంకా మిగిలిన ఇద్దరు ?"
పిల్లలిద్దరూ తలలు అడ్డంగా ఊపారు.
"గణపతి, కుమారస్వామి !"
ఆశ్చర్యంగా అడిగింది లలిత "అదేమిటి తాతా ? గణపతికి సిద్ధి, బుద్ధి భార్యలు కదా ! అలాగే కుమారస్వామికి వల్లి, దేవసేన అని చెప్పారు మా సమ్మర్ క్లాస్ లలో !"
"అదే చెప్పేది. ఆ ఇద్దరూ ఆజన్మ బ్రహ్మచారులు. గణపతిని దేనికోసం పూజిస్తారు ? విఘ్నాలు తొలగించమని, అవునా ? ఇంకా వేరే దేనికోసం పూజ చేస్తారు ముఖ్యంగా స్టూడెంట్లు ?"
"చదువు కోసం, మంచి గ్రేడ్ ల కోసం తాతా !"
"ఎక్సలెంట్ ! గణపతి భార్యలలో బుద్ధి అనే ఆవిడ చదువుకి అధిదేవత. సిద్ధి అన్న భార్య లక్ష్మీ దేవి అంశ. ఆవిడ సంపదలకు దేవత. అందుకే గణపతి పూజ అని అంటే లక్ష్మీ గణపతి పూజ. ఆవిడ విష్ణు మూర్తి భార్య లక్ష్మీ దేవి అంశయే కానీ లక్ష్మీ దేవి కాదు. చాలామంది ఇది తెలియక క్రిటిసైజ్ చేస్తారు. అలాగే బుద్ధి సరస్వతి అంశ.
"ఇంకొక విషయం, మనం పూజ చేసేటప్పుడు దేవతలని భార్యతో సహా పిలిచి కూర్చో బెట్టి పూజ చెయ్యాలి. అందుకే ప్రతి దేవుడికి భార్య లేక భార్యలు ఉన్నారు. హనుమంతుడికి కూడా భార్య ఉంది తెలుసా ?"
లలిత సంకోచంగా అన్నది "ఒకసారి మా క్లాస్ లో సువర్చల అన్న పేరు చెప్పారు. అంతకన్నా ఎలాబొరేట్ చెయ్యలేదు"
"నిజమే ! హనుమంతుడి టీచర్ ఎవరు తెలుసా ?"
"సూర్యుడు తాతా !"
"సూర్యుడు అన్ని విద్యలు నేర్పాడు కానీ ఒక్క విద్య - నవ వ్యాకరణం అంటే కాంప్రహెన్సివ్ గ్రామర్ నేర్పలేదు. ఎందుకంటే అది శిష్యుడికి నేర్పాలంటే అతనికి మ్యారేజ్ అయి ఉండాలి. అందుకే సూర్యుడు తన తేజస్సు అంటే బ్రైట్ నెస్ లో కొంత భాగానికి రూపం ఇచ్చి హనుమంతుడి భార్యగా చేసి ఆయనకి వ్యాకరణం నేర్పాడు. అప్పుడే ఆయన హనుమంతుడికి వరం ఇచ్చాడు ఆయన బ్రహ్మచర్యానికి ఏ రకమైన అడ్డము ఉండదని !"
లలిత, పినాకి ఆశ్చర్యంగా విని చప్పట్లు కొట్టారు.
"ఆవిడ పేరే సువర్చల ! అంటే మంచి వర్చస్సు అంటే గ్లో ఉన్నది అని అర్థం "
తలలూపారు పిల్లలు.
"మిమ్మల్ని ఒక క్విజ్ ప్రశ్న ! హనుమంతుడికి వాహనం ఏది ?"
"వాట్ ? హనుమంతుడే రాముడికి వాహనం కదా తాతా ?" పినాకి.
"నో ! నో ! యుద్ధం సమయంలో రాముడు హనుమంతుని భుజాలపై కూర్చున్నాడు, కాని అంతమాత్రానికి ఆయనకి హనుమంతుడు వాహనం కాదు."
"ఏమో తాతా ! నువ్వే చెప్పు !"
"హనుమంతుడి వాహనం ఒంటె !"
కొద్దిగా తెరిచేసిన నోళ్ళతో " ఓహో !" అన్నారు పిల్లలు.
"లక్ష్మీ దేవి వాహనం ఏమిటి ?"
"ఎలిఫెంట్ !" పినాకి.
"ఔల్ కదా తాతా !" లలిత.
"లలిత తల్లి కరెక్ట్ ! ఉలూకము దానినే గుడ్లగూబ అంటాము."
"భువనేశుడు అనే రాజు తన రాజ్యంలో సంగీతం నిషేధించి దేవుడిని కీర్తిస్తూ గానం చేస్తున్న ఒక బ్రాహ్మణుడిని దేశ బహిష్కరణ చేస్తాడు. ఆ రాజుకి గుడ్లగూబ జన్మ వస్తుంది. కానీ ఆ రాజు ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. అందువలన సంగీతం కరతలామలకం అయింది. ఒక సారి నారదుడు విష్ణు మూర్తి దగ్గర అహంకరిస్తే ఆయన నారదుడిని గానబంధు అని పేరు కాంచిన గుడ్లగూబ దగ్గర సంగీతం పూర్తిగా తెలుసుకోమని పంపిస్తాడు. ఆ గుడ్లగూబ సంగీతం విన్న నారదుడు, తనకు తెలిసిన సంగీతం కొద్దిపాటి మాత్రమే అని గ్రహించి ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నాడు. గురుదక్షిణగా ఆ గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం అవుతుంది అని వరము ఇచ్చాడు. అదర్రా సంగతి !"
"తాతా ! నిజంగా అలాగే జరిగిందా ?" పినాకి.
"తాతా ! మనం నమ్మినట్లైతే జరిగినదే ! మన భక్తిని బట్టి అన్నీ ఉంటాయి !" అన్నారు పినాకపాణి గారు చిరునవ్వుతో.
"ఇంతకీ దేముడు, దేముడా ? దేవతా ?మనకి కనిపించే బొమ్మల్లో ఎవరిలాగ ఉంటాడు....ఉంటుంది ?" లలిత.
"మనకి పదార్థాలు ఎన్ని రకాలుగా ఉంటాయి ?"
"సాలిడ్స్, లిక్విడ్స్, గాసెస్ ! ఇప్పుడు ప్లాస్మా అని ఫోర్త్ స్టేట్ కూడా చెప్తున్నారు తాతా !"
"గాడ్ ది ఐదో రకం !"
"గాడ్ ! ఐదో రకమా ? అదేమిటి ? ఎప్పుడూ వినలేదే !"
*ఎందుకు వినలేదంటే ఎవరూ చెప్పలేదు కాబట్టి ! ఇది నేనే కనిపెట్టాను. ఇది నా ఐడియా మాత్రమే ! మీరు రోజూ చూసే పదార్ధం సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ప్లాస్మా కానిది ఒకటుంది అదేమిటో చెప్పగలరా ?"
పాపం పిల్లలు తెగ ఆలోచించారు, ఒకళ్ళతో ఒకళ్ళు గుసగుసలాడారు. చివరికి "ఊఁహూ !" అని తలలు అడ్డంగా ఊపారు.
"అదేమిటంటే..........."
"ఘన పదార్థం అంటే సాలిడ్, ద్రవ పదార్థం అంటే లిక్విడ్, వాయు పదార్థం అంటే గ్యాస్, ఇవన్నీ కలగలిసిన ప్లాజ్మా ఇవన్నీ కాక వేరే స్టేట్ ఆఫ్ మాటర్ ఏమిటంటే జ్యోతి ! దీనినే మీకు అర్ధమవ్వాలి అంటే ఫ్లేమ్ అన్నమాట. అది సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ప్లాస్మా కాదు, కానీ అన్నీ కలగలిసి ఉంటాయి. అదే దేవుడు లేక అమ్మవారి స్వరూపం. అందుకే గాడ్ మన హిందూ ధర్మంలో జ్యోతి స్వరూపుడు అంటారు."
ఆశ్చర్యంగా తలాడించారు పిల్లలిద్దరూ.
"ఈ కాన్సెప్ట్ మీ వయసుకి అర్ధం కాదు తాతా. పెద్ద అయ్యాక మీ ఆలోచనల్ని బట్టి అర్ధమౌతుంది."
"అందుకే మన పూజలు అన్నింటిలో దీపం ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ."
"ఓహో !" అన్నారు ఇద్దరూ ఒకేసారి.
******* ********
ఆ మధ్యాహ్నం పినాకి నిద్రపోయాక తాత గారి దగ్గర చేరింది లలిత.
"తాతగారూ ! మిమ్మల్ని ఒక మాట అడగచ్చునా ?"
మనుమరాలికేసి ఆశ్చర్యంగా చూశాడాయన. బహువచనంలో సంబోధించడం, సందేహం అడగడంలో సంకోచం ఆయనకు ముద్దొచ్చేసింది.
నిశితంగా మనవరాలి వైపు చూశాడు. మనవరాలు చేయి బారు పిల్ల, సన్నగా ఉండే పిల్ల ఇప్పుడిప్పుడే ఒళ్ళు చేస్తున్నది. క్రితం ఏడాదే వ్యక్తురాలైంది. అందుకనే మాట్లాడడంలో కొంత పెద్ద తరహా, అడిగే విషయం గురించి సంకోచించడం ఆయనకు చెప్పలేని ఆనందం కలుగజేసింది. ఆమెలో నాయనమ్మ గారి పోలిక స్పష్టంగా కనిపిస్తోంది, కానీ నవ్వినప్పుడు వాళ్ళ నాన్న నవ్వినట్లే అనిపిస్తుంది.
"ఏంటో చెప్పు తల్లీ ! నన్ను తాతా అనడం మానేసి తాతగారూ! అని పిలుస్తున్నావేంటి కొత్తగా ?"
"అమ్మ నేను మాట్లాడే పద్ధతి జాగ్రత్తగా చూసుకోమని మాటిమాటికీ చెప్తుంది తాతా. అందుకనే కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటున్నాను."
"పోనీలే ! నువ్వు ఎలా పిలిచినా నాకు నువ్వు ఆ పరమేశ్వరివే ! చెప్పమ్మా ! ఏమిటి నీ డౌట్ ?"
"మన మేల్ గాడ్స్ సరే ! గాడెస్ లు ఉన్నారు కదా ! వాళ్ళ ఐడల్స్ అంటే విగ్రహాలు అలా సెక్సీగా ఉంటాయెందుకు ? మనకి ఉండే ప్రేయర్స్ లో కూడా ఫీమేల్ గాడెస్ లని గురించి చెప్పేటప్పుడు ల్యూడ్ (అశ్లీలం)గా డిస్క్రైబ్ చేస్తారెందుకు ?"
మనవరాలు ఎంత ఎదిగిపోయిందో అనుకుంటుండగానే ఇటువంటి సందేహం అడిగేసరికి మతి పోయినంత పనైంది పినాకపాణి గారికి.
"ఇది ఎవరు నీ మైండ్ లో పెట్టారమ్మా ?" అని అడిగాడు కొంచెం ఉత్సుకతతో, కొంత తీవ్ర స్వరంతో.
"మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కన్వర్టెడ్ తాతా ! వాళ్ళ పేరెంట్స్ చెప్పారట. మన ప్రేయర్స్, లిటరేచర్ అన్నిటిలోనూ ఆడవారిని గురించి వల్గర్ గా రాస్తారనీ, మన మతంలో సెక్స్ పిచ్చి ఎక్కువ అనీ కామెంట్స్ చేసేవారు తాతా !"
ఒక్కసారి నిట్టూర్చారు పినాకపాణి గారు. హిందూ మతం గురించి ఎంత చవకబారు ఆలోచనలు ప్రచారం చేస్తున్నారా అని విచారం కలిగిందాయనకి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి