రామాయణంలో చిన్న పాత్రలు - మంధర
రామాయణంలో చిన్న పాత్రలు
మంధర కైకేయి
కోపంతో వణికిపోతూ ఏదో గొణుక్కుంటూ సౌధంలోకి వస్తున్న మంధరని పలకరించింది ఒక చెలికత్తె . "ఏమి కుబ్జా ? ఏమిటో హడావుడిగా పరుగు ? జారిపడేవు జాగ్రత్త !" అన్నది నవ్వుతూ.
"నీకు కూడా లోకువయ్యానుటే లోచనీ ? బయటి వారికి నేనెలాగూ పనికిరాలేదు. ఇంటి వారికి కూడా వీసమెత్తైనా గౌరవం లేకపోయె. మా యువరాణి కైకేయితో అరణపు చెలికత్తె గా వచ్చానే ! నేను వచ్చే సమయానికి మీ అత్తగారు అప్పుడే పెళ్ళై ఇక్కడ దాసీగా ఉండేది మర్చిపోబోకు."
లోచని మోహంలో నవ్వు ఇట్టే మాయమైంది. "మన్నించు మంధరా ! ఏదో సంతోషంగా ఉండి ఆపుకోలేక ఆటపట్టించాను" అని వడివడిగా వెళ్ళిపోయింది.
"ఆటపట్టిస్తావే ! ఇప్పుడు ఆట నా చేతిలో ఉంది, చూసుకో రెండు రోజుల్లో అంతా తారుమారే " అని గొణుక్కుంటూ కైకేయి మందిరం వైపు సాగింది మంధర.
***** *******
మంధర చెప్పిన వార్త విని ఉప్పొంగిపోతూ తన మెడలో ఉన్న ముత్యాల హారం మంధర మెడలో వేసి ముద్దు పెట్టింది కైకేయి. "కుబ్జా ! ఎంత తీయనైన కబురు చెప్పావే. రాముడికి యౌవరాజ పట్టాభిషేకం ఐతే ఇంక ఈ అంతఃపురాలకి ఎంత శోభ ! పట్టాభిషేకం అవనీ ! నువ్వు ఏమడిగితే అది ఇస్తాను."
"నువ్వు ఇవ్వడం, నేను తీసుకోవడం పెద్ద సంబడం ! నీకు తెలుస్తోందా ? నీ సవతి రాజమాత అవుతోంది. ఇందాక బయటికి పనిమీద వెళ్ళొస్తోంటే ఆ పెద్దావిడ దాసి ఏమన్నదో తెలుసా ? పక్కకి తప్పుకో గూనీ ! మేము రాజమాత చెలులం, నువ్వు ఆవిడ సవతిగారి అరణం దాసీవి. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో ! నీ కుంటి మాటలు, కుంటి వేషాలు మా దగ్గర కాదు."
"ఏం కైకా ! నీ భవిష్యత్తు అప్పుడే ఏమిటో చెప్పేశారు. రాజమాతకి సవతివి నువ్వు ! అంతే. ఇంక నీ దశరధ పతి నీ మాట వినక్కరలేదు. రాముడు కూడా తల్లి మాటే పాటిస్తాడు, నువ్వు, భరతుడు వారికి ఊడిగం చెయ్యాల్సిందే".
"ఏమిటే మంధరా ! నన్ను ఎన్నో ఏళ్ళుగా నమ్మి ఉన్నావని ఊరుకుంటూంటే అతిగా మాట్లాడుతున్నావు. నీ బాధేమిటసలు ?" అన్నది కైకేయి.
ఒక గడియ పట్టింది మంధరకి కైకేయి మనసుకెక్కేలా హితబోధ చెయ్యడానికి.
"కైకా ! భరతుడు రాజ్యాన్ని ఏలడానికి సరైనవాడు. ఒకసారేమైందో తెలుసా ? రాముడు, భరతుడు కత్తి యుద్ధం సాధన చేస్తుంటే భరతుడి భుజం మీద చిన్న గాయమైంది. భరతుడు పట్టించుకోకుండా "భళా అన్నా ! నీ వేగం అందుకోవడం కష్టం" అన్నాడు. నేను గబగబా వెళ్ళి భరత కుమారుడి గాయం అదిమి రాముడిని గదిమాను. "అంత అఘాయిత్యం పనికిరాదు. ఎంత గాయమైందో ?" అన్నాను. రాముడు పెద్దగా నవ్వి "కందకు లేని దురద కత్తిపీటకు వచ్చిందే గూనీ ! నీ పని చూసుకో" అన్నాడు. నాకైతే ఎంత కోపం వచ్చిందో ! అసలు కోసల దేశానికి యువరాజు అవవలసిన వాడు భరతుడు."
కైకేయి ప్రశ్నార్థకంగా చూస్తే చెప్పింది మంధర. "పెద్ద భార్య కౌసల్య, చిన్న భార్య సుమిత్ర వలన సంతు లేక నిన్ను ఏరికోరి మీ తండ్రిగారిని బ్రతిమాలి నీకు కలిగే మగసంతుకి రాజ్యాధికారం ఇస్తానని ప్రమాణం చేశాడు నీ భర్త. ఇన్నాళ్లు ప్రస్తావన రాక నీకు చెప్పలేదు.
"ఇంకో విషయం ! శంబరాసురునితో యుద్ధం వేళ నీ రథచాలన చాకచక్యానికి మెచ్చి నీ పతి రెండు వరాలిస్తానంటే తర్వాత అడుగుతానని అన్నావు. అది మంచిదే అయింది, ఇపుడు ఆ వరాలు అడుగు, భరతుడికి యౌవరాజ్య పట్టాభిషేకం, రాముడికి పదునాలుగు సంవత్సరాలు వనవాసం అని అడుగు" అన్నది మంధర.
గుండెలమీద చెయ్యివేసుకుని "అమ్మో ! రాముడికి వనవాసమా ? నేను అడగలేనే కుబ్జా!" అన్నది బేలగా కైకేయి.
"నీ భవిష్యత్తు, నీ భరతుడి భవిష్యత్తు బాగుండాలంటే ఇలా చెప్పడం తప్పనిసరి" అన్నది మంధర.
"పదునాలుగు సంవత్సరాలు ఎందుకే ?" అన్నది ఇంకా బేలగానే కైకేయి.
"పదునాలుగు సంవత్సరాలు దాటితే రాముడికి మళ్ళీ రాజ్యం అడిగే హక్కు ఉండదే పిచ్చిదానా !" అన్నది మంధర.
"నిజమా ?" అంది కైకేయి అపనమ్మకంతో.
"నాకేమైనా అబద్ధం చెప్పడం ఇష్టం అంటావా కైకా ? త్రేతాయుగంలో పద్నాలుగు సంవత్సరాలు, ద్వాపర యుగంలో పన్నెండు సంవత్సరాలు, కలియుగంలో పది సంవత్సరాలు రాజ్యాన్ని తిరిగి ఇమ్మని కోరే హక్కు ఉన్నదని, ఆ తర్వాత ఆ హక్కు కోల్పోతారని మనుస్మృతి లో చెప్పారు" అన్నది మంధర.
"సరే ! నేను అలక గృహంలో ఉంటాను. మహారాజు వస్తే అక్కడకి పంపించమని రాణీవాస జనులకి చెప్పు" అని ఆ వైపుగా సాగిపోయింది కైకేయి.
******* *********
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇంక భగవంతునితో పని ఏముంటుంది ? కైకేయి దశరధుడిని తాను అనుకున్నట్లుగానే ఆడించింది, మాటలతో ఓడించింది, ప్రాధేయపడి ఏమి కావాలో చెప్పమని వేడించుకుంది. దశరధుడు ఆమెకు ఇచ్చిన వరాలు తప్పక తీరుస్తానని శపధాలు చేశాక నెమ్మదిగా తన కోరికలు బయట పెట్టింది కైకేయి. భరతునికి యౌవరాజ పట్టాభిషేకం చేయాలని అడిగేసింది, కానీ రాముని వనవాసం వచ్చేసరికి "పది, ఆపైన నాలుగేళ్ళు వనవాసం" అని ఇంచుక తడబడుతూ అడిగింది.
ఆ తర్వాత మంధర కైకేయిని చీవాట్లు పెట్టింది. "పది ఆపైన నాలుగేళ్ళు అని చెప్పావు, అసలుకే మోసం వచ్చింది తెలుస్తోందా ?" అని.
****** ********
రాముడు సీతాదేవితోను, తమ్ముడు లక్ష్మణుడితోను సుమంత్రుడు రథ సారధి గా రాగా బయలుదేరి వెళ్లారు. దశరధుడు కౌసల్యా మందిరానికి వెళ్ళిపోయి అహోరాత్రాలు విలపిస్తూ ఐదు రోజుల పాటు గడిపి ఐదవ రోజు సుమంత్రుడు ఒక్కడే వెను తిరిగి రావడం కని, ఇంకా దుఃఖం ద్విగుణీకృతం అవగా ఆ రాత్రి దివంగతుడైనాడు.
వశిష్టాది పెద్దలందరూ హుటాహుటిన భరత, శతృఘ్నులను రావించి భరతునికి రాజ్యాభిషేకం చేయబూనగా భరతుడు రాముడే రాజ్యాన్ని ఏలడానికి సరైనవాడు అని పలికి రాముడిని వెనుకకి తీసుకుని రావడానికి సన్నాహాలు పురమాయించినపుడు జరిగిందది. కైక ఇచ్చిన ముత్యాల హారమే కాకుండా ఇంకా కొన్ని నగలు ధరించి వస్తున్న మంధరని ద్వారపాలకులు పట్టుకుని శతృఘ్నుడి వద్దకు తీసుకుని వెళ్ళారు. "యువరాజా ! ఈ మంధరయే రామప్రభువు అరణ్యవాసానికి మూలకారణం అని నివేదించారు. రకరకాల ఆభరణాలు వింతగా ధరించిన మంధర తాడుతో చుట్టిన వానరి లాగా కనిపించింది శతృఘ్నునికి. జేవురించిన మొఖముతో, ఒక చేత కరవాలాన్ని, మరొక చేత ఆ కుబ్జ జుత్తు పట్టుకొని ఈడ్చుకుంటూ భరతుని దగ్గరకు వెళ్ళాడు "అన్నా ! ఆజ్ఞాపించు ! ఈ విషకీటకాన్ని ఇప్పుడే ఇక్కడే ఖండిస్తాను!" అన్నాడు.
"తమ్ముడూ ! నా తల్లినే వధించ మనసైంది. మాతృ హంతకుడు అని నా అన్న రామచంద్రుడు నన్ను ఈసడించుకుంటాడు. ఈ గూని దానిని వధించినా మనతో మాట్లాడడం మానేస్తాడు నాయనా ! వద్దు ! ఆ శిక్ష భరించలేము వదిలెయ్యి !" అన్నాడు భరతుడు.
బ్రతుకు జీవుడా అనుకుని అక్కడినుంచి వడివడిగా పారిపోయింది మంధర.
****** *******
పదునాలుగు సంవత్సరాలు గడిచాయి. రాముడు సీతా లక్ష్మణ సమేతుడై వస్తున్నాడని తెలిసి అయోధ్య అంతా హర్షప్లావితమై పోయింది. అందరితోటి మంధర కూడా నందిగ్రామానికి వెళ్ళింది. జనుల వెనుక నక్కి సీతారామ లక్ష్మణులను కంట నీరు తిరుగుతుండగా చూసింది. ఆమె వృద్ధురాలైపోయింది. పశ్చాత్తాపం దహించి వేస్తోంది. రాముని కంటపడడం ఇష్టం లేక అయోధ్యకు మరలి వచ్చేసింది.
ఆ మరునాడు శ్రీ రాముడి పట్టాభిషేకం కన్నుల పండువగా జరిగింది. వచ్చిన వారందరినీ పేరు పేరునా పిలిచి సత్కరించారు సీతారాములు. చివరగా తన పేరు కూడా వినిపించే సరికి తన చెవులను నమ్మలేకపోయింది మంధర. వణుకుతూ వారి వద్దకు వెళ్ళి పాదాల మీద పడబోయింది. ముందుగానే ఆమెను ఆపి శ్రీరాముడు ఆమె ముఖం తడిమి "బాగున్నావా మంధరా ? నిన్ను చూసి యుగాలైనట్లుంది" అని ఆమె మెడలో పచ్చల హారం వేశాడు. ఈ సారి ఆమె ఆగలేకపోయింది. వలవలా ఏడుస్తూ ప్రభువు పాదాల మీద పడిపోయింది. సీతమ్మ ఆమెను లేవదీసి హత్తుకున్నది.
వశిష్టుడు ఆమెతో "కుబ్జా ! నీవేదో అపరాధం చేశానని అనుకుంటున్నావేమో ! నువ్వు చేసిన పని లోకానికి ఉపకారమైంది. ఒక్కసారి శ్రీరాముని పరికించి చూడు. నీకు అన్నీ తెలుస్తాయి" అన్నారు చిరునవ్వుతో.
ఆమె శ్రీ రాముని ముఖంలోకి తేరిపార చూచింది. ఆమెకు తన పూర్వ జన్మ జ్ఞానం కలిగింది ---
భాగవతోత్తముడు ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. ఆయన కూడా పరమ ధర్మపరుడు. ప్రజా రంజకంగా రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన రాక్షస వంశస్థుల లాగానే అమరావతి మీద దండెత్తి స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేవతలంతా గురు బృహస్పతి వద్దకు వెళ్ళి తరుణోపాయం చెప్పమని అడిగారు. ఆయన విరోచనుని దానగుణాన్ని ఉపయోగించుకుని గెలవమని ఉద్బోధించారు.
ఇంద్రాది దేవతలు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి విరోచనుని ఆయన దేహం దానముగా ఇవ్వమని అడిగారు. దానశీలతకు విలువనిచ్చే విరోచనుడు మారు మాట లేకుండా తన శరీరాన్ని వారి వశం చేసి ఉత్తమ లోకాలకు వెళ్లిపోయాడు.
రాక్షసులు హాహాకారాలతో విరోచనుడి కుమార్తె వద్దకు వెళ్ళి మొర పెట్టుకున్నారు. ఆమె తీవ్ర క్రోధంతో రాక్షసులందరినీ కూడగట్టుకుని స్వర్గం మీద దండెత్తబోయింది. ఈ సారి దేవతలు రాక్షసులను పరాజితులను చేశారు. అది చూసి వైరోచని క్రోధంతో తనకున్న మాయా యుద్ధ పాటవంతో దేవతలను కకావికలం చేసేసింది.
అప్పుడు ఆమెను నిర్జించడం తప్ప వేరే మార్గం లేక శ్రీ మహావిష్ణువు దేవేంద్రునితో వజ్రాయుధం ప్రయోగించి మట్టుపెట్టమని చెప్పాడు.
దేవేంద్రుడు తీవ్రమైన వజ్రాయుధ ఘాతంతో వైరోచని వీపుమీద గాయపరిచాడు. దానితో ఆమె అక్కడ నుంచి భూమి మీద పడిపోతూ తనకి ఈ పరిస్థితి కలిగించిన దేవేంద్రుని పైన కాకుండా ప్రోత్సహించిన మహావిష్ణువు మీద క్రోధం పెంచుకుని ఎలాగైనా నిన్ను కష్టాలపాలు చేస్తానని శపథం చేసి భూమి మీద పడి మరణించింది.
ఆ వజ్రాయుధ ప్రహారం వలన మరుజన్మలో వంకర కలిగిన వీపుతో కుబ్జగా మంధర పేరుతో జన్మించి కైకేయి ప్రాపకంతో శ్రీరాముని వనవాసం పంపించి తన శపథం తీర్చుకుంది.
ఇదంతా జ్ఞప్తికి రాగా వశిష్టుల వారి వైపు సీతారాముల వైపు బేలగా చూసింది మంధర.
"ఊరడిల్లు మంధరా ! నీవు చేసిన ఈ పని వలన లోకానికి మహోపకారం జరిగింది. రావణ సంహారం జరిగింది. శ్రీ సీతారాములను గుర్తుంచుకున్నంత వరకు ప్రజలు నిన్ను కూడా గుర్తుంచుకుంటారు అన్నారు వశిష్టుడు.
కృతజ్ఞత నిండిన కళ్ళతో పునరభివాదం చేసి అక్కడ నుంచి కదిలి వెళ్ళింది మంధర.
సమాప్తం ...

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి