రామాయణంలో చిన్న పాత్రలు - శబరి



"అక్కా ! ఆవిడ చాలా పెద్దదిగా కనిపిస్తుంది వయసులో, అయినా ఆశ్రమంలో అన్ని పనులు చేస్తుందే ? నేనంటే కొత్త అనుకో, నువ్వక్కడ చాలా రోజుల నుంచి ఉన్నావు కదా ? నీకైనా ఏ పనీ చెప్పదే ?"

"విజయా ! ఆవిడ దగ్గర రోజులు కాదు, ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఏం రోజూ ఆశ్రమం శుభ్రం చేయడం కానీ, గోమయంతో అలకడం కానీ, ముగ్గులు వేయడం కానీ, తోరణాలు కట్టడం కానీ ఆవిడే చేస్తుంది. నేను ఎప్పుడు చేస్తాను ఆ పనులు అన్నా చిన్న నవ్వు నవ్వి, "ఆయన వస్తాడు చంపా ! ఆయన కోసం నేను చేస్తే నాకు తృప్తి అంటుంది."

"ఎవరాయన అక్కా ?"

"శ్రీ రాముడట, దశరథ మహారాజు పుత్రుడట. ఆయన దర్శనం చేసుకోవడానికి, ఆయనను స్పృశించడానికి, ఆయనను పూజించడానికి, ఆయనకు ఆకలి తీర్చడానికి తాను నిరీక్షిస్తున్నానని చెప్పింది నేను ఇక్కడికి వచ్చిన రోజునే !'

"ఎనిమిది సంవత్సరాల క్రితమా ? అప్పటినుంచీ ఇవన్నీ చేస్తున్నదా ?" అని నోరు తెరిచేసింది విజయ.

"ఏ రోజూ చెయ్యకుండా వదిలిపెట్టలేదు. ఎంత నమ్మకమో !" అన్నది చంప కళ్ళు చెమ్మగిల్లగా.

"అసలు ఎవరీవిడ అక్కా ?"

"ఈ ఆశ్రమం మతంగ ముని ఆశ్రమం. ఆయన ఒక రోజున జపం ముగించుకుని శిష్యులతో పురాణ కాలక్షేపం చేస్తుండగా భార్యాభర్తలు ఆయన దర్శనార్ధమై వచ్చారు. వారి వెంట ఒక చంటి బిడ్డ కూడా ఉన్నదట. అడవిలో వేటకు వెళ్లినప్పుడు పొదలలో కనిపించిందని, కన్నతల్లి ఎవరో తెలియదని, పిల్లలు లేని తమకు ఆ బిడ్డను చూడగానే ఎంతో ప్రేమ కలిగిందని, తాము పెంచుకుంటామని, మతంగ ముని ఆశీర్వచనం కోసం తీసుకొచ్చామని చెప్పారుట. ఆయన బిడ్డను తాకి పరమానందంతో, ఆ బిడ్డ కారణ జన్మురాలని, తప్పక ఆ బిడ్డ బాగోగులు చూడవచ్చునని అనుమతి ఇచ్చి వారి జాతి గుర్తుగా శబరి అని నామకరణం కూడా చేశారు.
"తర్వాత ఆ బిడ్డ పెద్దదై ఆశ్రమానికి రోజూ వచ్చి తనకు చేతనైన పనులు చేస్తూ ఉండేదట. ఆ మహాముని ఆమెకు మంత్రోపదేశం చేసి ఆశీర్వదించారట."

కొంచెం సేపు ఆగి చంప "ఆ మహాముని బాగా వృద్ధుడైన తర్వాత తన ఆయుష్షు తీరినదని తెలిసి శిష్యులకు, శబరికి వీడ్కోలు చెప్పి కపాల మోక్షం ద్వారా ప్రాణాలు వదిలారట."

మంత్రం వేసినట్లు అప్పటి దాకా విన్న విజయ పెద్ద నిట్టూర్పు విడిచింది.
"మరి ఆయన శిష్యులు అంతా ఏమైనారు అక్కా ! ఎవరూ కనిపించడం లేదే ?"

"ఆయన శిష్యులు కూడా ఒక్కొక్కరూ పరమపదించారు. చివరి శిష్యుడు వెళ్ళిపోయే ముందు ఈ అమ్మను పిలిచి చెప్పాడుట. కొద్ది రోజులలో శ్రీరాముడు తన తమ్ముడితో తన భార్య సీతను వెదుకుతూ వస్తాడని, ఆయనకు ఆతిథ్యం ఇవ్వమనీ చెప్పి ఆ తర్వాత ఏమి చెయ్యాలో ఆ సమయంలో ఆమెకే అవగతమౌతుందని చెప్పి కైవల్యం పొందాడట. ఆ తర్వాత ఈవిడ ఒక్కరే ఆ శ్రీ రాముని కోసం ఆశ్రమం శుభ్రంగా అట్టేపెడుతున్నది. ఆయన కోసం ఫలాహారాలకు మాత్రం ఆవిడే వెళ్ళి ఏ చెట్టు ఫలాలు మధురంగా ఉన్నాయో ఒకటి రెండు పలాలు రుచి చూసి మంచి రుచికరమైన ఫలాలు ఉన్న చెట్టునుంచి ఫలాలు సేకరించి పెడుతుంది. ఇంత వరకు శ్రీ రాముడు రానేలేదు. మరునాడు ఆ పళ్ళని గోవులకి, వానరాలకి, పక్షులకి పెట్టేసి మళ్ళీ తాజా పళ్ళు సేకరిస్తుంది." అని ఆగింది చంప.

ఆ ఇద్దరు సహాయకులు శబరి అప్పగించిన పుష్ప సేకరణ ముగించి ఆశ్రమానికి చేరుకునే సమయానికి ప్రతిరోజు లాగనే ఒక చలువ రాతి మీద మెత్తటి గడ్డి పరిచి దాని మీద కృష్ణాజినం పరిచింది ఆ వృద్ధ తాపసి.

"అమ్మా ! ఇవిగో పూలు" అంటూ అందించింది చంప. వాటిని పరీక్షగా చూసి ప్రసన్నమైన ముఖంతో "చంపా ! ఈ రోజు శ్రీ రాముడు వస్తాడని చాలా నమ్మకంగా అనిపిస్తోంది, నాకు ఎడమ కన్ను అదురుతోంది, సూర్యుడు తన వంశజుడు వస్తున్నాడని తన వేడిని తగ్గించుకుని మృదువైన కిరణాలను ప్రసరిస్తున్నాడు. వాయుదేవుడు మంద్రంగా వీస్తూ వరుణుడితో కలిసి సన్నని తుంపరలతో ఆశ్రమాన్ని పావనం చేస్తున్నాడు. ఇక్కడ నిర్భయంగా తిరుగుతున్న సాధు జంతువులన్నీ మాటి మాటికీ ఉత్తర దిశగా చూస్తున్నాయి. సింహ, వ్యాఘ్ర, శార్దూలాది మృగాలు కూడా తమ ప్రవృత్తిని కట్టిపెట్టి ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లు ఉన్నాయి. ఎందుకో నేను ఎదురు చూస్తున్న రాముడు ఈరోజు వస్తాడని అనిపిస్తోంది " అన్నది.

"చాలా సంతోషం శబరి మాతా ! మాకు కూడా ఏదో తెలియని ఉద్వేగం కలుగుతున్నదమ్మా !" అన్నది చంప ఉత్సాహంగా.

ఎక్కడినుంచి వచ్చిందో ఒక చిలుక వచ్చి శబరి ముందు వాలి తీయని గొంతుకతో "రామ ! రామ !" అన్నది.

శబరి ఉత్సాహం ద్విగుణీకృతం అయింది. నెమ్మదిగా లేచి వయసు వలన వచ్చిన మందగమనంతో ఆశ్రమ వాటిక ద్వారం దగ్గరికి వచ్చేసరికి దూరంగా ఇద్దరు స్ఫురద్రూపులు చేతులలో విల్లులు, ఎగుభుజాల వెనుక అమ్ములపొదులతో జటాజూట శిరస్కులై అశ్వనీ దేవతల వలె సామజముల నడకలను పోలిన గమనముతో ఆశ్రమం వైపే రావడం చూసింది. కళ్ళు ఇట్టే నీళ్ళతో నిండిపోయాయి. ఇన్నాళ్లు ఎదురు చూసి శుష్కించిపోయిన ఆ నయనాలు అశ్రువులతో ప్లావితమైపోయి స్పష్టమైన దృష్టి కలిగి ఆమెకు నయనానందకరంగా రామలక్ష్మణుల రూపురేఖలు తోచి ఒడలు పులకించి పోయింది.

"అమ్మా ! మతంగ మహర్షి ఆశ్రమమే కదా ? మీరేనా శబరి మాత ?" అన్న రాముని ప్రశ్నకు జవాబీయలేక తల తాటించిందామె.
ఆమె దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని ఆమె పాదాలంటి కళ్ళకద్దుకున్నాడు రాముడు. ఆ వెనుకనే లక్ష్మణుడు కూడా అన్నగారిని అనుసరించాడు.

"రామా ! రాజకుమారా ! ఏమిటిది ? నీవు నా పాదాలకు నమస్కరించడమేమిటి తండ్రీ ?" అని "నేను నీకు వందనం చేయాలి పరమాత్మా!" అని మనసులోనే అనుకుంది శబరి. మతంగ మహర్షి శిష్యుడు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంది.
"శబరీ ! రాముడు మనుష్య జన్మ ఎత్తిన మహావిష్ణువు, ఆయన అవతారం గురించి ప్రస్తావించవద్దు. అది కొద్ది కాలం తర్వాత చెప్పవలసిన వారు చెప్తారు."

"అమ్మా ! నీవు మహాత్ముడు మతంగ మహర్షి శిష్యురాలివని, జ్ఞాన వృద్ధురాలివని, తపస్సంపన్నురాలివని, రావణుడు అపహరించుకుపోయిన నా భార్య ఆనుపానులు తెలుసుకునేందుకు మార్గదర్శనం చేసే సుగ్రీవుడిని ఋష్యమూక పర్వతము మీద ఉన్నాడని చెప్పి నీ దర్శనం చేసుకోమని కబంధుని రూపంలో ఉన్న దనువు అన్న మహనీయుడు చెప్పాడమ్మా ! అటువంటివాడు నీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన నీవు సదా వందనీయురాలివే మాతా !" అన్నాడు శ్రీ రాముడు.

ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బౌతూ "రామా ! నా జన్మ ధన్యం అయింది తండ్రీ ! నీ మాటలు తేనెసోనలే " అంటూ చేతులు పట్టుకుని రాముని ఆశ్రమానికి తీసుకెళ్ళి సుఖాసీనుడిని చే‌సి అర్ఘ్య పాద్య సహితంగా సత్కరించి తాను సేకరించిన మధుర ఫలాలు అర్పించింది.

"రామా ! ఇవి సరియైన పక్వానికి వచ్చిన ఫలాలు. నేను రుచి చూసి అత్యంత మధురమైన ఫలాల గుత్తుల నుంచి సేకరించిన పళ్ళు తండ్రీ ! క్షుత్తు తగ్గే విధాన ఆరగించు, లక్ష్మణా ! నీ సోదర సేవ అనుపమానం ! నీవు కూడా తీసుకో నాయనా !" అన్నది శబరి.

అవి తింటూ శబరి ఆరోగ్యం గురించి, ఆమె స్వాధ్యాయ తపో కార్యక్రమాల గురించి సంభాషించాడు శ్రీ రాముడు.

"రామా ! మా గురువర్యుల తపోశక్తి ఇంత అంత అని చెప్పడం సూర్యభగవానునికి దివ్వె చూపినట్లే ! ఇక్కడి వనంలో పూచిన పుష్పాలు వాడవు. ఇక్కడి జలములు సదా స్వాదుజలాలే సుమా ! మా గురువర్యులు అతి వృద్ధులై సప్త సముద్రాల కడకు పోలేకపోవడం వలన ఆ సప్త సముద్రాలు ఈ పంపా నదిలో చేరాయి. అందుకనే ఈ నదిని ఇక్కడ సప్త సముద్ర తీరము అన్న పేరుతో విరాజిల్లుతోంది. ఆయన ప్రభావం వలన ఆయన ఆరవేసిన తడివస్త్రాలు ఆరవేసిన చెట్లు సదా పుష్పభరితమై ఉన్నాయి.‌ ఆయనకు నేను కేవలం పరిచారికను రామా ! ఆయన ఆజ్ఞ పాలించడానికి నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను తండ్రీ ! ఆయనకు నా మీద ఉన్న అవ్యాజమైన కరుణ వలననే నిన్ను చూడగలిగాను రామా ! ఇక్కడ నుంచి దక్షిణ నైఱుతి దిశలలో కనిపిస్తున్నదే అదే ఋష్యమూక పర్వతము. అక్కడ మహాబలశాలి వాలి తమ్ముడు సుగ్రీవుడు నీ వలెనే భార్యా వియోగం తో అలమటిస్తున్నాడు. త్వరగా అతని స్నేహం పొందు నాయనా ?"

"శ్రీరామా ! ఈ ఆశ్రమం అంతా నీకు చూపించాను. నీ అనుజ్ఞ అయితే నేను దేహం విడిచిపెడతాను తండ్రీ !" అన్నది ప్రశాంతంగా శబరి.

"అలాగే మాతా ! నీవు ఇచ్ఛా పూర్వకంగా నీ గురుదేవుల వద్దకు వెళ్ళు !" అన్నాడు శ్రీ రాముడు.

అప్పుడు శబరి పద్మాసన బద్ధురాలై అర్ధనిమీలిత నేత్రాలతో దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి యోగాగ్నిని రగిల్చి శరీరాన్ని ఆహుతి చేసింది.

అప్పుడు అద్భుతమైన వస్త్రాభరణాలతో సుగంధాది లేపనాలతో ఒప్పే దివ్య శరీరంతో ఆమె కడసారి శ్రీ రామునికి వందనమాచరించి ఊర్ధ్వ లోకాలకి సాగిపోయింది.

సమాప్తం...........ు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @