రామాయణంలో చిన్న పాత్రలు తార

భర్త దేహం మీద పడి విలపించీ, విలపించీ కళ్ళలో నీళ్ళు లు సుడులు తిరుగుతుండగా తనకు పతీ వియోగం కలిగించిన వాడిని చూపుతోనే భస్మం చేద్దామని అన్నంత కోపావేశంతో పతి దేహం మీద పడి రోదిస్తున్న ఆమె నేల మీదనే పాకుతూ, ఆ వీరుని పాదాల దగ్గరకు చేరి తల పైకెత్తి చూసిందామె. మసకగా కనిపించిన ఆ మోము స్పష్టంగా తెలియడానికి కొద్ది లిప్తలు పట్టింది. మైమరిచిపోయిందామె.


తన ప్రాణప్రదుడైన నాధుడిని బాణఘాతంతో నేలకూల్చిన వాడని జ్ఞప్తి కి రాగానే ఎర్రబడిన చూపులతో ఆయనను కాల్చేసేలాగ చూసింది.
"శ్రీరామా ! గొప్ప దశరధ మహారాజు పుత్రుడివి, ఇద్దరు యోధులు పోరాడుతూటే మధ్యలో అన్యాయంగా అంబు విడవడం మీకు సిగ్గుగా తోచలేదా ప్రభూ ?" అన్నది మాటలాడుతూ ఉండగానే ఆమెకు తెలియకుండానే గౌరవం కూడిన సంబోధన వచ్చేసింది .
ఆమెకు తెలియకుండానే ఆయన పాదాలంటి నమస్కారం చేసింది.

"ఓ పరంతపా ! నా పతిని బాణ ఘాతంతో కూల్చినందుకు వచ్చిన కోపావేశాలతో నిన్ను నిందించబూనిన నన్ను మన్నించు రామా ! నా భర్త నేను విలపిస్తూంటే ఇప్పుడే ఆయన ప్రశ్నలకు నీవు ఇచ్చిన సముచిత సమాధానాలు చెప్పారయ్యా ! ఎంతో తార్కికంగా నీవు ఇచ్చిన సమాధానాలు విని కూడా నా బాధావేశాలతో నిన్ను అధిక్షేపించబూనాను స్వామీ ! నన్ను మన్నించి ఒక్క ఉపకారం చేయమని అర్థిస్తున్నాను దేవా ! నా స్వామి ప్రాణాలు హరించిన ఆ బాణం నా మీద వేసి నన్ను కూడా నా ప్రాణ నాథుని దగ్గరకు పంపెయ్యి. నేను లేకపోతే వీర స్వర్గం చేరిన నా పతిని అక్కడి అప్సరసలు ఏ మాత్రం రంజింప జాలరు.

నీ ధర్మపత్ని సీతా దేవి వియోగంతో నీవు పడే బాధ ఆయనకు కూడా ఉంటుంది రామచంద్రా ! నువ్వు నన్ను వధిస్తే స్త్రీ హత్యా పాతకం అంటుకుంటుందని సందేహించవద్దు. ఆయన దేహంలో భాగమైన నన్ను ఆయన దగ్గర చేర్చితే మా ఇద్దరినీ కలిపిన పుణ్యం నీకు దక్కుతుంది జానకీపతీ !"

ఆ మాటలకు శ్రీ రామ ప్రభువు యుక్తి యుక్తంగా"ఓ వీర పత్నీ ! ఇట్లా మాట్లాడడం నీకు తగదు. ఈ లోకంలో ప్రతి ప్రాణీ బ్రహ్మ దేవుడి చేత సృష్టించబడిన వారే. అందరూ ఆయన వశములోని వారే. ఆయన వ్రాత ఎవరూ అతిక్రమించలేరు. నీ కుమారుడు, వీరుడు అంగదుడు యువరాజు కాగలడని నీ భర్తకు సుగ్రీవుడు ఇచ్చిన వాగ్దానం విని ఉన్నావు కదా ! ఆ విధంగా నీవు సంతోషాన్ని అనుభవిస్తావు. ఇటువంటి మాటలు తగవమ్మా !" అన్నాడు.

"శ్రీరామా ! నేను మొదటి సారి సుగ్రీవుడు యుద్ధానికి నా పతిని పిలిచినపుడు నేను వారించాను. సుగ్రీవుడు నీకు అనుజుడు, అతనిని క్షమించి అతని భార్యను అప్పగించి రాజ్యములో సగభాగం ఇస్తే వారిని ఎదిరించే వారు లేరని హితవు చెప్పాను. నా మాట పెడచెవిన పెట్టి యుద్ధంలో సుగ్రీవుడు తోక ముడిచి పారిపోయేవరకు మర్దించి వెనుకకు వచ్చాడు. మరలా కొద్ది గడియలలోనే మరల యుద్ధానికి కవ్వించడం చూసి నా మనసు కీడు శంకించింది. అంతకు ముందు అంగదుడు నాకు వేగులు చెప్పిన వార్త వినిపించినది స్ఫురణకు వచ్చింది.

"అది మీ రాక గురించే ప్రభూ ! మీరు సుగ్రీవుడిని మిత్రుడి గా స్వీకరించడం, వాలిని వధించి రాజ్యాన్ని అప్పగిస్తానని నీవు చేసిన శపథమూ నాకు తెలిసింది. అదే నా నాధుడికి చెప్పాను. ఆయన నవ్వేసి ధర్మపరుడైన రాముడు మా ద్వంద్వ యుద్ధంలో కలగజేసుకోడని నమ్మకంగా పలికి బయల్దేరాడు. తన ప్రాణాలను కోల్పోయారు. ఆ విషయంలో మిమ్మల్ని నిందించడంలేదు ప్రభూ ! దానిలో ధర్మ సూక్ష్మాలను మీరు వివరించారని నా పతి చెప్పారు. ఇంత ధర్మ శాస్త్ర కోవిదుడవు, మీరు చెప్పినది నాకు శిరోధార్యం" అని తార దుఃఖాన్ని దిగమింగి అంగదుడిని తీసుకుని కిష్కింధకు మరలింది.

సశేషం..........


సుగ్రీవుడు వానర రాజుగా అభిషిక్తుడై తదనంతరం రెండు మాసాలు వర్షర్తువు అవడంతో శరత్కాలం మొదలై వానలు వెనుకబట్టిన పిదప సీతాన్వేషణ చేపట్టవచ్చునన్న శ్రీరాముని ఆనతి ప్రకారం తారా, రుమా సహితుడై భోగలాలసుడై కర్తవ్యాన్ని మరచిపోయాడు.

కానీ బుద్ధిమతాంవరిష్టుడైన హనుమంతుడు, తారతో మంతనం చేసి మెత్తని మాటలతో యుక్తి యుక్తంగా సుగ్రీవుడిని కర్తవ్యోన్ముఖుణ్ణి చేయడంతో సేనాధిపతి నీలుడిని రావించి సమస్త వానర, భల్లూక, లాంగూల వీరులందరూ పదిహేను దినాలలో కిష్కింధకు చేరుకోవాలని సుగ్రీవాజ్ఞ జారీ చేసి మరల అంతఃపురంలోకి పోయి మగువ, మధిరాసక్తతలో మునిగిపోయాడు.

**********

సుగ్రీవుడు అట్లు మద్యపానాసక్తుడై తార, రుమలతో ఉన్న వేళ ఒక పది దినముల తర్వాత అంగదుడు కంపిత శరీరంతో వచ్చి లక్ష్మణుడు కోపావేశాలతో వచ్చి ఉన్నాడని, సుగ్రీవుడిని కలవడానికి వచ్చానని చెప్పాడని విన్నవించాడు.

సుగ్రీవుడు భయకంపితుడై, "తారా ! నీవు బుద్ధిమంతురాలివి, నీ మధుర వచనాలతో లక్ష్మణుని శాంత పరిచి, ఆయన కోపావేశాలకు కారణం తెలుసుకో. నేను ఇప్పుటికే వానర వీరులందరూ కిష్కింధకు చేరాలని ఆజ్ఞ చేసి ఉన్నాను. వారు ఇంకొన్ని గడియలలో ఇక్కడికి చేరుకుంటారు. ఆయన కోపాన్ని ఉపశమింపజేసే సామర్ధ్యం నీకే ఉన్నది." అన్నాడు.

అలా అంటూండగానే లక్ష్మణుడి ధనుష్ఠంకారం అంతఃపురాన్ని, కిష్కింధను కూడా కంపింపజేస్తూ వినిపించింది. తార వెంటనే తాను ఏ స్థితిలో ఉన్నది కూడా పట్టించుకోకుండా లక్ష్మణుని వద్దకు బయల్దేరింది.

ఆ రామానుజుడు బయట విశాలమైన కక్ష్యలో ఒక పక్కగా వేచి ఉన్నాడు. అంతఃపుర కాంతలను పరిహరించడానికి అలా చేసాడని గ్రహించిన తార లక్ష్మణుని సౌజన్యానికి అబ్బురపడింది.

"నాయనా ! సౌమిత్రీ ! నీ కోపావేశానికి కారణం తెలుసుకోవచ్చా ?"

ఆ మాటలు విని తల ఎత్తి ఆమె వైపు ఒక క్షణం చూసి, మదిరా పానంతో ఎఱ్ఱనైన కన్నులు, కొద్దిగా తడబడుతున్న మాట, అస్తవ్యస్తంగా ఉన్న ఆమె వస్త్రాభరణాలు గమనించి మరల తల దించుకున్నాడు కానీ మాటలాడలేక పోయాడు.

తార లక్ష్మణుని లజ్జను గ్రహించింది. "తండ్రీ ! సుగ్రీవుని శ్రీరాముడు తమ్ముడిగా గ్రహించినాడు. అందువలన నీవు నాకు ప్రియమైన మరిదివి. నీ ఆగ్రహానికి కారణం అవగతమైంది. కానీ సుగ్రీవుడు అనేక సంవత్సరాలు భార్య నుండి దూరంగా, భయముతో కొండల మీద, అరణ్యాలలో గడిపినాడు.

"శ్రీరాముని దయవలన తన భార్యను తిరిగి పొందినాడు. అందువలన ఆయన భోగలాలసత నీవు మన్నించదగును. సీతా వియోగంతో మీ అన్నగారు ఎంత వేదన పొందుతున్నాడో చూసే ఉంటావుగా నాయనా ! అందువలన సుగ్రీవుని పరిస్థితి నీవు చక్కగా అవగతం చేసుకోగలవు."

లక్ష్మణుడు ఆమె మాటల్లోని వాస్తవాన్ని చక్కగా అవగతం చేసుకున్నాడు. ఆయన మొహంలో ప్రసన్నతను గ్రహించి తార సైగ చేయగానే సుగ్రీవుడు లక్ష్మణుని ఎదుటకు వచ్చి దోసిలి ఒగ్గి నిలబడ్డాడు.

లక్ష్మణుడు శ్రీరాముడు చెప్పమన్న సందేశం చెప్తూ "సుగ్రీవా ! ‌కృతఘ్నుడు మృతప్రాయుడే కాదు వధార్హుడు కూడా. ఇతర ఘోర పాపాలకు ప్రాయశ్చిత్తం ఉన్నది కానీ కృతఘ్నతకు ప్రాయశ్చిత్తం లేదని సాక్షాతూ బ్రహ్మ దేవుడే శాసనము చేశాడు. నీ పనులను చేయించుకోవడానికి నీవు తప్పు ప్రమాణాలు చేసావు. మా అన్నగారి దయవలననే నీకు రాజ్యప్రాప్తి, దారప్రాప్తి కలిగినవి. ఆయన దయ తప్పితే, ఆయన చేత పరలోక గతుడైన వాలి వెళ్ళిన దారి ఇంకా మూసుకుని పోలేదు. ఆ సంగతి గుర్తులో ఉంచుకోమని మా అన్నగారి హెచ్చరిక !" అన్నాడు.

తార లక్ష్మణుని శాంత పరిచేవిధంగా "నాయనా ! విశ్వామిత్రుడే మేనక మోహంలో పడి పది సంవత్సరాల కాలం తపస్సు మరిచిపోయాడు. వానరుడు సుగ్రీవుడు ఎంత ! నువ్వు ఆ విషయంలో పరిగణన చూపాలయ్యా !" అన్నది.

విశ్వామిత్రుడి ప్రస్తావన వచ్చేసరికి లక్ష్మణుడు చల్లబడిపోయాడు.

అది గ్రహించి సుగ్రీవుడు దోసిలి ఒగ్గి "నీవు నాకు సోదరుడవే లక్ష్మణా ! ఇప్పుడు నీవు ఏమి చెప్పినా నేను ఎదురు చెప్పకుండా ఆచరిస్తాను." అన్నాడు.

అదే సమయంలో బయట భూనభోంతరాలు తీవ్రంగా అలజడి పొందే విధాన కోలాహలం వినబడింది.

లక్ష్మణుడు ప్రశ్నార్థకంగా పక్కనే ఉన్న హనుమ వైపు చూసాడు.

హనుమంతుడు చిరునవ్వుతో "సుగ్రీవ ప్రభువు ఇదివరకే వానర, భల్లూక, లాంగూల వీరులందరూ కిష్కింధకు చేరుకోవాలని ఆజ్ఞ జారీ చేసి ఉన్నారు. వారంతా సీతమ్మ జాడ తెలుసుకునేందుకు కోట్లాదిగా చేరుకుంటున్నారు లక్ష్మణా !" అన్నాడు.

లక్ష్మణుడి వదనంలో మధుర దరహాసం వెల్లివిరిసింది. "సుగ్రీవా ! వెంటనే ప్రస్రవణ గిరి చేరుకోవాలి. మా అన్నగారితో ఈ శుభవార్త చెప్పాలి. నీవు కూడా నాతో వస్తే ఆయనను చూసినట్లూ ఉంటుంది, ఈ శుభవార్తను నీవే చెప్పినట్లుంటుంది " అన్నాడు.

"తప్పకుండా లక్ష్మణా ! " అని సుగ్రీవుడు బంగారు శిబికను సమాయత్త పరిచి లక్ష్మణుని అందులో కూర్చోబెట్టి శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు.

వారు కనుచూపు మేర దాటిపోయే వరకు ముకుళిత హస్తాలతో ఆనందబాష్పాలతో నిండిన నయనాలతో చూస్తున్న తార మనస్సులో సంతృప్తి.

"శ్రీ రామా ! నన్ను సహగమనం చెయ్యకుండా ఆపినది ఇందుకేననిపిస్తోంది. నేను వాలితో వెళ్ళిపోయినట్లైతే ఈరోజు లక్ష్మణ స్వామి ఆగ్రహం ఆపగలిగేవారు ఎవరూ లేరు కదా పరమాత్మా !" అని మరొకసారి కేల్మోడ్చింది.

సమాప్తం..........

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @