బంగారు రోజులు
"అక్కా ! అక్కా !"
వెనక్కి తిరిగి చూసింది అమృత.
పదడుగుల దూరంలో వడివడిగా నడుస్తూ తనకేసి వస్తున్న ఆకారాన్ని వెంటనే పోల్చుకోలేకపోయింది. అప్పుడే మొదలైన చిరుజల్లు కళ్ళజోడుని తడిపేసింది.
"అమృతక్కా !"
ఆ గొంతుక చాలా పరిచితంగా ఉన్నది. జ్ఞాపకాల మూలలలో హడావుడిగా వెతికి దొరకబుచ్చుకునే సరికి మొహంమీద చిరునవ్వు, ఆ తమ్ముడు సమీపంలోకి రావడం ఒకేసారి జరిగాయి. గొడుగు విప్పి ఆమె తల మీద పట్టాడతను.
"పతంజలీ ! ఎన్నాళ్ళకీ ? ఎక్కడ ఉన్నావు ? ఏం చేస్తున్నావు ?"
"ఇక్కడే అక్కా ! జనరల్ ప్రాక్టీస్. టైమ్ పాస్ ! అంతే !"
"అవును. పీజీ చెయ్యలేదని తెలిసింది. ఏమైంది ?"
"ఎంట్రెన్స్ అయీ అవగానే పెళ్ళి చేసేశారు. అమ్మకి అనారోగ్యం అని ! కానీ పెళ్లి తర్వాత ఏం జబ్బు లేకుండా నాన్నగారు వెళ్లిపోయారు. అమ్మ అనారోగ్యం తోడు ఈ బాధ తట్టుకోలేక నాలుగు నెలలు తిరగకుండానే తనుకూడా వెళ్ళిపోయింది. ఆ ఎంట్రెన్స్ లో కొద్దిలో క్లినికల్ సబ్జెక్టుల్లో సీట్లు అయిపోయాయి. చాలా కాంపిటీషన్. నీకు తెలుసుకదా ! ఆ తర్వాత రెండు మూడు సార్లు ప్రిపరేషన్ సరిగా లేక బోర్డర్ లోకి కూడా రాలేకపోయాను. చివరికి జనరల్ ప్రాక్టీస్ లో స్థిరపడిపోయాను. చదువుకునే టైమ్ లో నీ గైడెన్స్ వలననే ఎంతో కొంత మంచి డాక్టర్ గా పేరొచ్చింది, పిల్లలూ బాగానే చదువుకున్నారు, సెటిల్ అయ్యారు."
పతంజలి అమృతకి రెండు సంవత్సరాలు జూనియర్. అయినా ర్యాగింగ్ టైమ్ లో ఇంకొక క్లాస్ మేట్ తో కలిసి సీనియర్ల చేత అల్లరికి గురి అవుతున్నపుడు అమృత ఆ ర్యాగింగ్ చేసేవాళ్ళు తనకు కూడా సీనియర్లు అనికూడా చూసుకోకుండా చెడామడా దులిపేసి బయటకు లాక్కొచ్చేసింది. ఆమె ప్రభ అలాంటిది. సీనియర్లు ఆడా మగా తేడా లేకుండా గడగడలాడేవారు. వయసుతో సంబంధం లేకుండా తను 'అమృతక్క'యే అందరికీ !
పతంజలి, అతని స్నేహితుడు రవి కూడా అతి త్వరలోనే అక్కా ! అని పిలవడం మొదలుపెట్టారు.
మొదటి సంవత్సరం చివరికి వచ్చేసరికి మెడికల్ ఎక్జిబిషన్ ఏర్పాటు చేసేసరికి రకరకాల స్టాల్స్ లో వీళ్ళంతా పనిచేసే సరికి ర్యాగింగ్ మరిచిపోయి అందరూ దగ్గర స్నేహితులు అయిపోయారు.
ఆ రోజుల్లోనే కొత్తగా వచ్చిన ఫ్రీడమ్ తో మధ్యాహ్నం పూట స్టాల్స్ లో రద్దీ లేనపుడు క్యాంటీన్ కి వెళ్ళి టీ తాగి సిగరెట్లు తాగే వారు పతంజలి, రవి ! ఎక్కడినుంచి చూసిందో కాని అమృత చూసింది. నాలుగు రోజుల పాటు వీళ్ళు కనబడినా పలకరించకుండా తల తిప్పుకుని వెళ్ళిపోయేది. వీళ్ళకి పరిస్థితి అర్థం కాక మధుని శరణు కోరితే అతను ఇద్దరినీ క్యాంటీన్ కి తీసుకెళ్ళి టీ ఇప్పించి హితబోధ చేశాడు. అమృతకి సిగరెట్లు, లిక్కర్ అలవాటు ఉన్నవారిని దూరంగా ఉంచుతుందని ఆమె స్నేహం కావాలనుకుంటే సిగరెట్లు మానెయ్యండి అని చెప్పాడు.
ఆ సాయంత్రమే అమృతని ప్రత్యేకంగా కలిసి ఇంక సిగరెట్లు తాగమని ప్రమాణం చేశాక అమృత మొఖంలో నవ్వు వచ్చింది. "మీకు ఇంకా తెలియడంలేదు. పెద్దవాళ్ళు లేరు కదా, అని దారి తప్పే లేతవయసు." అన్నది.
ఆ తర్వాత ఎప్పుడూ ఆ ఇద్దరూ సిగరెట్ జోలికి పోలేదు.
మధు, అమృత లు మెడిసిన్ లో క్లాస్ మేట్లు, మంచి స్నేహితులు. ఆ స్నేహం మెడిసిన్ ఫైనల్ సంవత్సరం లో కొచ్చేసరికి గాఢమైన ప్రేమగా రూపు దిద్దుకుని ఇద్దరూ పీ జీ లో సీట్లు సంపాదించుకునే సరికి ఇద్దరూ దంపతులయ్యారు.
క్లినికల్ సైడ్ కి వచ్చాక దివిసీమ ఉప్పెన రావడం, కృష్ణా జిల్లా తో సంబంధాలు తెగిపోవడంతో మెడికల్ కాలేజీ లో చాలామంది కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వారయ్యేసరికి ప్రిన్సిపాల్ గారిని వారం రోజులు సెలవులు డిక్లేర్ చెయ్యండి, ఇళ్ళకి వెళ్ళి చూసొస్తాం అంటే, ఆయన ఇప్పుడు కలరా వంటి వ్యాధులు రాకుండా వాక్సిన్ పంపిణీ చెయ్యాలి, మీరు ఇళ్ళకి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్తే మగవారందరూ క్లాస్ లు బాయ్ కాట్ చేద్దామని, ఆడవారు వద్దని, ఈ టైమ్ లో పతంజలి ఎటూ చెప్పలేక నలిగిపోయాడు. అప్పుడు కూడా ఇద్దరి మధ్య స్నేహం చెడలేదు.
అమృత చదివిన ఐదు సంవత్సరాలు, స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు జరిగినా ఆమె ఎంత బ్రతిమాలినా ఏ ఎన్నికలోనూ పోటీ చెయ్యలేదు. కానీ ఆమెను విద్యార్థులలో రెండు వర్గాలు గౌరవించేవి.
పతంజలి కల్చరల్ సెక్రటరీ గాను, రవి స్పోర్ట్స్ సెక్రటరీ గాను గెలవడంలో కానీ, మంచి పేరు తెచ్చుకోవడానికి వెనుక అమృత ఉన్నదని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
పతంజలి తన జీవితంలో మెడిసిన్ చదివిన ఐదేళ్ళు తనకు మరిచిపోలేని బంగారు రోజులు అనేవాడు.
ఇద్దరూ వర్షం లోనుంచి పక్కనే ఉన్న రెస్టారెంట్ లోకి వెళ్ళి కాఫీ ఆర్డర్ ఇచ్చారు.
"నా సంగతి సరే ! నువ్వు స్టేట్స్ లో ఉన్నావని కాంతి దేశాయ్ చెప్పింది రెండేళ్ళ క్రితం !"
"అది రెండు సంవత్సరాల క్రితం మాట. మధు స్టేట్స్ లో ఉండగా హెమోరేజిక్ పాంక్రియాటైటిస్ వచ్చి గంటల్లో ఈ లోకం దాటి వెళ్ళిపోయాడు !" అన్నది రుద్ధమైన గొంతుతో.
నిర్ఘాంతపోయాడు పతంజలి. నోట మాట రాలేదు.
అమృతే మళ్ళీ అన్నది "తనకి స్మోకింగ్, డ్రింకింగ్ అటువంటి అలవాట్లు ఏమీలేవు. నీకు తెలుసుకదా ? అక్కడ డాక్టర్లు కూడా విస్తుపోయారు. చాలా మంది డాక్టర్ ఫ్రెండ్స్ అక్కడే సాన్ యోసే లో,ఇంకా కాలిఫోర్నియా లో చుట్టుపక్కల ఉన్నారు. వారం రోజులు ఎవ్వరూ తేరుకోలేక పోయారు."
కొంచెం తేరుకుని అడిగాడు.
"అక్కా ! పిల్లలు ఏం చేస్తున్నారు ?"
"ఇద్దరూ ట్విన్స్ తెలుసుగా. ఒక అమ్మాయి మెడిసిన్ పూర్తి చేసి ఆంకాలజీ సీనియర్ రెసిడెన్సీ చేసి అమెరికాలోనే స్లొవెన్ కెట్టరింగ్ లో చేస్తోంది. కొలీగ్ నే పెళ్లి చేసుకున్నది. ఇండియనే ! గుజరాతీ !
రెండోది మెడిసిన్ ఇంట్రెస్ట్ లేదు అని పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ లో పీ జీ, ఎమ్ ఫిల్ చేసి ఎక్జిబిషన్లు పెడుతోంది. పెళ్ళి చేసుకోదట!"
అలా అలా ఒక అరగంట కబుర్లు చెప్పుకున్నారు. అంతసేపు వర్షం కురుస్తూనే ఉంది. ర్యాగింగ్ దగ్గరనుంచి అమృత ఫైనల్ ఇయర్ అయిపోయాక ఫ్రెండ్స్ అందరూ అరకు వెళ్ళడం, కల్చరల్ డే, స్పోర్ట్స్ డే కబుర్లు, సెంట్రల్ లైబ్రరీ లో పదిగంటల దాకా పిడి వెయ్యడం, ఎంట్రెన్స్ కి క్వశ్చన్ బిట్లు చెప్పుకోవడం అలా సమయం ఎలా జరిగిపోయిందో తెలియనే లేదు.
వర్షం వెలిశాక బయటికి వచ్చిన తర్వాత "మీ ఇల్లు దగ్గరేనా ? ఒక్కసారి నీ మిసెస్ ని చూస్తాను. నీ పెళ్ళి టైమ్ కి నేను స్టేట్స్ వెళ్ళిపోయాను."
"మా ఇల్లు దగ్గిరేమీ కాదు కొంచెం దూరమే. అయినా నా మిసెస్ ని చూడడం పడదు. తను రెండున్నర సంవత్సరాల క్రితం నన్ను విడిచి వెళ్ళిపోయింది !" అన్నాడు పైకి వేలు
చూపిస్తూ గొంతు బొంగురుపోగా!
ఈ సారి అమృత షాక్ అయింది.
"కరోనా టైమ్ లో బాగా సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చింది. డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు."
కొంతసేపటికి తేరుకొని "పతంజలీ ! ఎల్లుండి మా రెండో అమ్మాయి దగ్గరికి పారిస్ వెళ్తున్నాను. నా నెంబర్ ఇది, తరచు మాట్లాడుతూ ఉండు. ధైర్యంగా ఉండు" అని వదలలేక వదలలేక వెళ్లింది అమృత అక్క !
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి