బహుమతి@
బహుమతి
ఆఫీస్ నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చిన హరీంద్ర కూతురి గదిలో వెలుతురు చూసి కుతూహలంగా అటు వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాడు. అతని గారాల పట్టి ఇందిర హోమ్ వర్క్ పుస్తకాలు ముందు వేసుకుని ఏదో వ్రాస్తోంది కానీ పరాకుగా ఉన్నట్లు తెలుస్తూనే ఉంది. పరిశీలగా చూసిన హరీంద్ర నిర్ఘాంతపోయాడు.
"శ్రావణీ !" అన్న అతని పిలుపుకి భార్య వెంటనే రాలేదు కానీ ఇందిర తలెత్తి చూసింది. ఆమె తెల్లటి బుగ్గలమీద కన్నీటి చారికలు హరీంద్రకి గాభరా తెప్పించాయి.
"ఇందూ ! నా తల్లీ ! ఏమైందమ్మా ? ఏమైనా దెబ్బ తగిలిందా ? స్కూల్లో ఏమైనా అన్నారా ? హోమ్ వర్క్ చేయలేదని టీచర్ ఏమైనా అన్నదా ? అమ్మ ఏమైనా కేకలేసిందా ?" గబగబా అడిగాడు కానీ అవేమీ కాదనిపించింది. ఇందిర దెబ్బలు తగిలించుకునే పిల్ల కాదు, స్కూల్లో ఎవరితోటీ తగాదాలు పెట్టుకోదు, హోమ్ వర్క్ ఎప్పుడూ నాగా ఉండదు. తల్లి తండ్రుల ముద్దుల కూతురు అయ్యేసరికి ఎవరూ చివాట్లు పెట్టరు. అసలు ఆ పరిస్థితి రానివ్వదు ఇందిర. ఒక్కతే కూతురు అయినా చాలా బాధ్యతగా స్కూల్ పాఠాలు అన్నీ అప్ టు డేట్ గా ఉంటుంది, స్నేహశీలి, టీచర్లకి పెట్ ! ఇంట్లో కూడా తల్లిదండ్రులు చెప్పిన మాటలకి ఎదురు చెప్పకుండా నవ్వు మొహంతో తిరుగుతూండే కూతురి కంట కన్నీరు చూసేసరికి హరీంద్ర మనసు గిలగిలలాడింది.
ఒక్క అంగలో కూతురి పక్కన చేరి పొదువుకుని నుదురు చుంబించాడు తడి అయిన కళ్ళతో. ఆ ప్రేమకి మళ్ళీ ఇందిర కళ్ళు చెలమలై బావురుమంటూ తండ్రిని పెనవేసుకుంది.
తలెత్తి చూసిన హరీంద్ర గుమ్మం దగ్గర బొమ్మలా నిలబడిపోయిన శ్రావణిని చూసి తేరుకున్నాడు. "ఏమైంది శ్రావణీ ! ఎప్పుడూ లేదు, ఇంతగా ఏడవడం."
శ్రావణి కొంచెం కోపంతో "రేపు ఏమిటో గుర్తుందా ?" అన్నది.
"ఎందుకు గుర్తు లేదు ? మన అమ్మలు పుట్టినరోజు"
"తను ఏమైనా గిఫ్ట్ అడిగిందా ?"
"మా అమ్మ ఎప్పుడూ గిఫ్ట్ ఇది కావాలి అని ఎప్పుడైనా అడిగిందా శ్రావణీ ? బంగారు తల్లి కదా ! ఏది తీసుకొచ్చినా తీసుకునేది కదా ?"
"ఈ సారి ఏమీ అడగలేదా ?"
మళ్ళీ రెట్టించి భార్య అడిగేసరికి కొంచెం ఆలోచనలో పడ్డాడు హరీష్ "అవునవును ! నిన్న ఎప్పుడూ లేనిది, బర్త్ డే గిఫ్ట్ గా నేనేమి అడిగినా ఇస్తావా నాన్నా ! అని అడిగింది. తప్పకుండా ఇస్తాను అని చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేశాను, నా తల్లి ఎప్పుడు తీర్చలేని కోరికలు కోరదు. మా అమ్మ పోలికే ! అందుకే ఆవిడ పేరు పెట్టుకున్నాను. ఇంతకీ ఏం కావాలి నాన్నా ?" అనడిగాడు కూతురిని.
మళ్ళీ కళ్ళు నీళ్ళు నిండగా"ఏమడిగినా ఇస్తావుగా నాన్నా ?" అనడిగింది ఇందిర.
"ఇస్తానురా తల్లీ ! నువ్వు కళ్ళనీళ్ళు పెట్టకు" అని దగ్గరకు తీసుకున్నాడు హరీంద్ర.
ఆమె తన కోరిక చెప్పేసరికి నిర్ఘాంతపోయాడు హరీంద్ర. శ్రావణి అంతకు ముందే తెలిసి ఉండడం వలన మాట్లాడలేదు కానీ పెదాలు బిగించడంలో కోపాన్ని వెలిగక్కింది.
రెండు నిమిషాలు మాటలుడిగిన హరీంద్ర "ఇదేమి కోరిక ఇందూ ? ఇంక వేరే ఏమి అడిగినా ఇస్తాను రేపు నీ పుట్టినరోజు, నీ టీచర్లకి, ఫ్రెండ్స్ కి గిఫ్ట్ లు తీసుకున్నావు, మరి......" మాట్లాడలేక పోయాడా తండ్రి.
"నాన్నా ! ఇది తప్ప వేరే గిఫ్ట్ నాకు వద్దు నాన్నా ! ప్లీజ్ !" అన్న కూతురుతో మళ్ళీ ఏమీ మాట్లాడలేకపోయాడు హరీంద్ర.
**** ******* ********
మర్నాడు ఉదయం స్కూల్ కి ఇందిర తో కలిసి హరీంద్ర, శ్రావణి కారులో వెళ్ళి స్కూల్ గేట్ దాటి అసెంబ్లీ హాల్ దగ్గర ఆపినపుడు "కొంచెం ఆగుదాం అమ్మా !" అన్నది ఇందిర బయటికి చూస్తూ ! ఎవరికోసమో ఎదురు చూస్తోందని తల్లిదండ్రులకి అర్ధమైంది.
ఐదు నిమిషాలు గడిచాక "కిరణ్ ! కిరణ్ !" అని గట్టిగా పిలిచింది ఇందిర సంభ్రమంగా కిటికీలో నుంచి తల బయటపెట్టి. అటువైపే వస్తున్న కుర్రాడు తలెత్తి చూశాడు. ముందు గుర్తు పట్టకపోయినా, గుర్తు పట్టగానే మొహమంతా నవ్వుతో పరుగెత్తూకొచ్చాడు. శ్రావణి, హరీంద్ర ఇద్దరూ ఆ అబ్బాయిని చూసి నిశ్చేష్టులైపోయారు.
కారు తలుపు తీసుకుని బయటకి దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అబ్బాయిని వాటేసుకుని "హాపీ బర్త్ డే కిరణ్ !" అన్నది ఇందిర. ఆ అబ్బాయి కిరణ్ కొత్త బట్టలు వేసుకొని ఉన్నాడు కానీ ముఖం పాలిపోయి ఉన్నది, తలమీద వెంట్రుకలేమీ లేవు. అలాగని గుండు చేయించుకున్నట్లూ లేడు.
కిరణ్ కూడా ఆమె కేసి పరిశీలనగా చూస్తూ పెద్దగా నవ్వేశాడు. "హాపీ బర్త్ డే ఇందూ ! ఇదేమిటి నువ్వూ ఇలాగ ?" అన్నాడు.
కారులో నుంచి దిగిన హరీంద్ర, శ్రావణి తమ పక్కనే ఆగిన క్లాస్ టీచర్ ని చూసి "నమస్తే స్వర్ణ గారూ !" అని పలకరించారు. కిరణ్, ఇందిర ను చూస్తూ ఉండిపోయిన స్వర్ణ తేరుకుని "గుడ్ మార్నింగ్ !" అన్నది కానీ ఆమె కంట గిర్రున తిరుగుతున్న కన్నీటిని చూసి అవాక్కయ్యారు ఆ దంపతులు.
******* ******* *******
అసెంబ్లీ అయిపోయిన తరువాత ఇందిర చేత టీచర్లకి, పిల్లలకి గిఫ్ట్ లు ఇప్పించిన తర్వాత హెడ్ మిస్ట్రెస్ "ఈ రోజు క్లాసులు పావుగంట లేట్ గా మొదలౌతాయి. ఈ పావు గంటలో ఫోర్త్ స్టాండర్డ్ స్వర్ణ మిస్ మీకు ఒక కథ చెప్తారు" అన్నది.
స్వర్ణ మైక్ అందుకుని అందరినీ ఒకసారి కలయచూసింది. "ఇవాళ నా క్లాస్ లో ఇద్దరు పిల్లల బర్త్ డే. కిరణ్, ఇందిర. ఇద్దరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అందరం కోరుకుందాం" అన్నది. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టేశారు.
"కిరణ్ కి రెండు నెలల క్రితమే ఆరోగ్యం బాగుండక ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కానీ ఆ ట్రీట్మెంట్ కి తన జుట్టంతా రాలిపోయింది. తన జబ్బు గురించి తెలిసి తన వాలకం చూసి చాలా మంది క్లాస్ మేట్లు దూరంగా ఉండడం మొదలు పెట్టారు. కిరణ్ చాలా డిప్రెస్ అవడం చూసినా నేనేమీ చెయ్యలేకపోయాను. కానీ కిరణ్ బెస్ట్ ఫ్రెండ్ ఇందిర ఏమి చేసిందో చూశారుగా ? నిన్న సాయంత్రం వారిద్దరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. కిరణ్ ఇందిర తో తనకి జబ్బు ఉందని, దగ్గరికి రావద్దని అంటే ఇందిర ఏడ్చేసింది. అంత సున్నితమైన మనస్సు ఆమెది. అందరితోను స్నేహంగా ఉండే మన ఇందూ తల్లి కిరణ్ కోసం తన పుట్టిన రోజున తన జుట్టు తీయించేసుకుంది. అదే కిరణ్ కి గిఫ్ట్ అని చెప్పింది. అది విన్న కిరణ్ ని చూశారుగా ? రెండు నెలల తర్వాత తన మొహంలో ఎంత సంతోషం కనిపిస్తోందో ? ఇందిర తనకి ఇచ్చిన గిఫ్ట్ ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు ఇందాక నాతో ! మన స్కూల్ కే తలమానికం ఇందిర, చదువులో, కాండక్ట్ లో, కారెక్టర్ లో, హెల్ప్ ఫుల్ నేచర్లో, స్నేహపాత్రతలో అందరికీ లీడర్ తను. తనని కన్న తల్లి తండ్రులు చాలా అదృష్టవంతులు. ఇందిర కీ, హరీంద్ర గారు, శ్రావణి గార్లకి స్కూల్ తరఫున మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్తున్నాను" అని ముగించింది గొంతు జీరపోగా.
కర్చీఫ్ లో మొహం దాచుకుని వెక్కుతున్న శ్రావణి భుజం చుట్టూ చేతులు వేసి లేపి నీళ్ళు నిండిన కళ్ళతో అందరికీ అభివాదం చేశాడు హరీంద్ర !
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి