రామాయణంలో చిన్న పాత్రలు - మండోదరి
మండోదరి మనోగతం
మండోదరి ఆ వార్త వినగానే నిలువునా చిగురుటాకులా వణికిపోయింది. ఆమె అరుణరంజితమైన ముఖపద్మం వడలిపోయిన శ్వేత కమలపు చాయ సంతరించుకుంది.
ఆ వార్త చెప్పలేక చెప్పలేక చెప్పిన చెలికత్తె ఆమె వాలకం చూసి భీతిల్లింది. అంతకు ముందు ఆమె మేఘనాధుడి మృతికి రోదించడం చూసింది కానీ చెలికత్తె ఈ విధమైన కవళికలు చూసి ఎరుగదు. ఏమి చెయ్యాలో తెలియక చూస్తున్న చెలికత్తె కళ్ళముందే మండోదరి వివశురాలై నేలకి జారిపోయింది. గబగబా మిగిలిన రాక్షస కాంతలు రోదిస్తూనే ఆమెకు సేవ చేసి స్పృహ తెప్పించారు.
పూర్తిగా తెలివి రాగానే తడబడే అడుగులు గబగబ పడకపోయినా తాను ఎలా ఉన్నానో అన్నది కూడా గమనించకుండా వేగంగా అంతఃపురంలోనుంచి బయల్వెడలి యుద్ధభూమికి బయల్దేరింది మండోదరి. మిగిలిన రావణుని పత్నులు కూడా పెద్దగా రోదిస్తూ ఆమె వెంట బయల్దేరారు. ఎవరూ తమ దుస్తులు ఎట్లా ఉన్నవి, తాము ఎట్లా ఉన్నాము అన్నది గమనించే స్థితిలో లేరు. రధముల వంటి వాహనాల కోసం వారు చూడలేదు. అసలు రధాలే మిగలలేదు, సారథులు కూడా హతమైపోయారు మరి !
ఎంత సేపు పరిగెత్తారో తెలియదు కానీ యుద్ధభూమికి వెళ్ళగానే అందరి దృష్టి తమ ప్రభువు, పతి, దైవము రావణ బ్రహ్మ ఎక్కడ నేలకూలాడా అనే ! ముందుగా మండోదరియే రావణుని పార్థివదేహాన్ని కనుగొన్నది. సుడిగాలి వలె వెళ్లి ఆ దేహం మీద కట్టె వలే కుప్పకూలి పోయింది. మిగిలిన రావణ పత్నులు కూడా బిగ్గరగా రోదిస్తూ రావణుని దేహం మీద వివిధ భాగాలను చుట్టేశారు. మండోదరి రెండు చేతులతో రావణుని దేహమంతా తడిమి ఆ శరీరంలో జీవం లేదని గ్రహింపు రాగానే మరలా నిశ్చేతనంగా అయిపోయింది. ఒక అరఘడియ సేపు ఆమెకు స్పృహ లేదు.
తెలివి రాగానే మరల మరల రావణుని శరీరమంతా తడుముతూ హృదయవిదారకంగా రోదించింది ఆమె.
"స్వామీ ! ఇలా శయ్య, హంసతూలికా తల్పం పైన కాకుండా ధరణీగతులైనారేమి ? అయ్యో ! మీ శరీరం నొచ్చుతున్నదేమో నాథా ! నా ఒడిలోనైనా పరుండరాదా ?" అంటూ రావణుని తల తన ఒడిలోకి తీసుకుని మరలా రోదించింది. "ఇట్లా నా అంకము మీద ఉన్నారని తెలియడంలేదా ప్రాణేశ్వరా ? ఇంతకు ముందు ఇలా ఎప్పుడూ లేరే ? మాట్లాడరేమి స్వామీ ? సాభరణగా, సాలంకారంగా లేకుండా శిరోవేష్టనం కూడా లేకుండా వచ్చానని అలకయా పతిదేవా ? అయ్యో ! అవేమీ గుర్తు లేవే ! ఇప్పుడేమి చేతును స్వామీ ? ఒకసారి కళ్ళు తెరిచి చూడరాదా నాధా ? నన్ను ఏ వేళనైనా ఇసుమంతైనా మందలించలేదు ! ఇప్పుడు మందలించండి, నా వలన మహాపరాధమే జరిగింది. లేవండి, నన్ను శిక్షించండి నాధా !" అంటూ మళ్ళీ సోలి పోయింది.
తేరుకుని ఆకసంవైపు చూస్తూ "నాకు పతీ వియోగమైనదని సంతసమా ? ఈ పుష్పవర్షమేమి ? దేవతలందరికీ హర్షాతిరేకాలు పెక్కుమీరాయా ? స్వామీ ! మీ అదుపాజ్ఞలలో ఉండవలసిన అష్ట దిక్పాలకులను శిక్షించరేమి ? లేవండి స్వామీ !
"అయ్యో ! నా తండ్రి మయుడిని నన్ను తనకిచ్చి వివాహం చేయమని వేడుకున్న రావణబ్రహ్మ యేనా ఇలాగ నేను రోదిస్తున్నా ఉలకక, పలకక ఇలా పడి ఉన్నది ? బ్రహ్మదేవుని వరప్రభావం వలన నేను శాశ్వత సుమంగళిగా ఉంటానని నా తల్లి హేమ కూడా ఎంతో సంతోషంతో నా తండ్రితో కూడి కన్యాదానం చేసింది ! అమ్మా ! నా సౌభాగ్యం నేల పాలయిందమ్మా ! ఇంక నా జీవితం వ్యర్ధం. స్వామీ ! నేనూ వచ్చేస్తాను మీ దగ్గరకి. ఆ రాముడినే మరొక బాణం వేసి నన్నూ హతమార్చమని కోరతాను.
"అయ్యో ! ఆ రాముడు సామాన్యుడి వలె కనిపించడం లేదు. ఇంద్రుడా ? కాదే ! అతనికంత సామర్ధ్యమెక్కడిది ? మృత్యువు లేని నా నాథుణ్ణి మృత్యుదేవత వద్దకు పంపడానికి దేవతలంతా మానవ రూపంలో పంపిన విష్ణుమూర్తియే అనిపిస్తోంది. భార్య కోసం విశాలమైన మహోధది దాటి రావడం సామాన్య మానవుడి వలన అయ్యే కార్యమా ? తప్పక ఆ రాముడు విష్ణువే ! అయినచో సీతాదేవి సాక్షాత్తు మహాలక్ష్మియే ! ఎంత లక్ష్మీదేవి అయినా మానవ రూపంలో నా కన్నా అందగత్తెయా నాథా ? మీకు ఈ వ్యామోహం ఎలా కలిగింది ?
"హతవిధీ ! ఈ పని తగదని మీకు ఎంతమంది హితం చెప్పారు స్వామీ ! మీరు ఎవరి మాట కూడా వినలేదే ! అయ్యో ! మారీచుడు, మీ తాతయ్య మాల్యవంతుడు, నా తండ్రి మయుడు, నా మరుదులు విభీషణుడు, ఆ తరువాత కుంభకర్ణుడు కూడా పరిపరివిధాల మీ మనసు సరిచేయ ప్రయత్నించారు ! నేను కూడా పరస్త్రీ వ్యామోహం వద్దని పరిపరివిధాల వేడుకున్నాను. ఏమి చేయగలం ! వినాశకాలే విపరీత బుద్ధి !
"నేను వెళ్తాను, ఆ రాముడు ఎలా ఉంటాడో చూస్తాను. నా మీద కూడా బాణ ప్రహారం చెయ్యమని గద్దించి అడుగుతాను. అదిగో ! ఆ రాయి మీద ఆశీనుడైన ఆజానుబాహుడే ఆ రాముడై ఉంటాడు.
"అహా ! ఎంత దివ్య సుందర విగ్రహుడు ! తల దించుకుని దీర్ఘాలోచనలో ఉన్నాడు ! ఇన్ని రోజులు పోరు సల్పిన అలసటా ? వేరే ఆలోచనయా ? అదేమీ ? ఈ సాయం సంధ్య వేళ అస్తమిస్తున్న సూర్యుడి వలన దీర్ఘంగా ఉన్న నా ఛాయ ఆయన మీద పడబోతే వేగంగా తన మీద పడ్డ నీడను తప్పించుకుని ప్రక్కకు వెళ్ళినాడు ? నా నీడ స్త్రీ మూర్తి ఛాయయని గ్రహించినాడా ! ఆహా ! పరస్త్రీ నీడ కూడా తాకకూడదని వినయంగా తప్పుకున్నావా రామా ! నీ గురించి కర్ణాకర్ణిగా విన్న వార్తలు నిజమే ! ఆ వార్తలలో వర్ణించిన బాహ్య రూపమే కాక ఆకాశ సదృశమైన అంతః సౌందర్యం నీదని తెలుసుకున్నాను పరంధామా ! నిన్ను దర్శించి నా జన్మ ధన్యం అయింది పరమాత్మా ! ఏ విధంగా నన్ను కూడా హతమార్చమని అడగను ? అలా అడగడం కూడా నా వైపు నుంచి పెద్ద తప్పిదమౌతుంది ! సెలవు స్వామీ ! నీ దివ్యమంగళ స్వరూపాన్ని చూడడమే నేను చేసుకున్న పుణ్యం." అనుకుంటూ చెంపలపై ధారగా కారిపోతున్న ఆనందాశ్రువులో, దుఃఖాశ్రువులో కూడా తెలియని వాటిని తుడుచుకునే ప్రయత్నం కూడా చేయకుండా వెనుదిరిగింది పతివ్రతా శిరోమణి మండోదరి !
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి