దాగిన ప్రతిభ@

దాగిన ప్రతిభ

"సో ! మై డియర్ స్టూడెంట్స్ ! మానవ శరీర శాస్త్రం ఇవాళ పూర్తి చేశాం. ఇంగ్లీష్ భాష, యాక్సెంట్ ఎలా మాస్టర్ చెయ్యాలన్నది విశ్వం మాష్టారు చెప్పారు కదా ? రేపు మీరంతా ఇవాళ్టి చాప్టర్ మీద పరీక్షకి తయారవ్వండి. మీరందరూ మెరికల్లాంటి వాళ్ళు. ఇంత వరకూ పెట్టిన పరీక్షలు అన్నీ చాలా బాగా వ్రాశారు దాదాపు అందరూ. ఎల్లుండి మార్క్ లు ఇచ్చాక ఈ ఇన్స్టిట్యూట్ తో నా ఒప్పందం పూర్తి అవుతుంది. ఆల్ ది బెస్ట్ రేపటి పరీక్షకి !"


ఒకటే క్షణం తర్వాత ఎవరు మొదలెట్టారో తెలియదు కానీ అందరూ చప్పట్లు కొట్టారు. చిరునవ్వుతో బయటికి వచ్చాడు డాక్టర్ శివరామ్. చప్పట్లు విని తన గదిలోనుంచి బయటకు వచ్చిన ప్రిన్సిపాల్ "డాక్టర్ గారూ ! ఇవాళ్టి తో మొత్తం సిలబస్ పూర్తి అయిపోయిందా ?" అని అడిగారు.

"అవును రావుగారూ ! అదే హడావుడి !" అన్నాడు శివరామ్ క్లాస్ రూమ్ వైపు చూస్తూ.

"సరే డాక్టర్ గారూ ! మీరు బయల్దేరండి, సాయంత్రం ఓపీ కి టైమ్ అవుతున్నట్లుంది మీకు !" అన్నాడు రావు గారు.

శివరామ్ మెట్లు దిగి తన స్కూటర్ మీద బయల్దేరగానే ఆ క్లాస్ రూమ్ లోకి నడిచాడు రావు గారు.

********* **********

మెడికల్ ట్రాన్స్ క్రిప్షన్ వచ్చిన మొదట్లో కుక్కగొడుగుల లాగ అనేక ట్రైనింగ్ సెంటర్ లు వచ్చినా, రావుగారి 'యూనివర్సల్ మెడిస్క్రిప్ట్స్' మంచి పేరు తెచ్చుకుంది.

స్టూడెంట్స్ కి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కంప్యూటర్ ఇవ్వడమే కాకుండా అప్పుడే వస్తున్న ఇంటర్నెట్ సదుపాయాన్ని సమర్ధవంతంగా ఉపయోగించే విధంగా తన ఇన్స్టిట్యూట్ ని తీర్చి దిద్దాడు రావు గారు.

ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉన్న లెక్చరర్ ని పార్ట్ టైం టీచింగ్ కి ఒప్పించి, మెడికల్ నాలెడ్జ్ స్టూడెంట్స్ కి తెలియజేయడానికి తనకు బాగా తెలిసిన ఆయన సిఫార్సు చెయ్యగా శివరామ్ ని సంప్రదించాడు.

మొదట శివరామ్ సంశయించాడు. కానీ భార్య ప్రోత్సహించడంతో ముందు ఒక వారం చెప్తానని, తనకి అంతకు ముందు టీచింగ్ లో అనుభవం లేదనీ రావుగారి కి చెప్పాడు. రావుగారు కొంచెం నిరుత్సాహ పడినా సరే అన్నాడు.

ఒక వారం లోనే స్టూడెంట్స్ అందరూ శివరామ్ టీచింగ్ బాగున్నదని ముక్త కంఠంతో చెప్తే తనమీద తనకు నమ్మకం కుదిరి అక్కడే కొనసాగాడు శివరామ్. అక్కడ డాక్టర్ వృత్తి, ఇక్కడ ఉపాధ్యాయ వృత్తిలో సమతూకం సాధించడానికి రెండు మూడు నెలలు పట్టింది, కానీ ఆ తర్వాత చక్కగా అలవాటు పడిపోయాడు.

ఉన్న బ్యాచికి మొత్తం శరీర నిర్మాణ శాస్త్రం, వివిధ వ్యాధులు, శస్త్రచికిత్సలు, ఔషధాలు ఇవన్నీ విపులంగా బోధించడానికి ఏడాది పట్టింది.

స్టూడెంట్స్ కూడా ఇవి నేర్చుకుంటూనే అమెరికా నుంచి వచ్చే వాయిస్ రికార్డింగ్ లు వింటూ వేగంగా కంప్యూటర్ మీద టైప్ చెయ్యడం, శివరాం పర్యవేక్షణలో ప్రూఫ్ చూసుకోవడం, మళ్ళీ వాటిని ప్రత్యేక వెబ్ సైట్లలో అప్ లోడ్ చెయ్యడంలో నిష్ణాతులై పోయారు.

పదకొండు నెలల పది రోజులలో తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సిలబస్ పూర్తి చేసి రావుగారి కి బరువైన మనసుతో తనకు ఇంటి వద్ద ఉన్న కార్యక్రమాలు, డాక్టర్ గా వృత్తిని జాగ్రత్తగా చేసుకోవడం వంటి ఇబ్బందులతో ఇంకొక బ్యాచ్ కి శిక్షణ ఇవ్వలేనని చెప్పాడు. రావుగారు కూడా అర్ధం చేసుకుని అంగీకారం తెలిపాడు.

పరీక్ష పేపర్లు చూసి మార్కులు వేసి చివరిసారిగా ఇన్స్టిట్యూట్ లో ప్రవేశించిన శివరామ్ కి స్టూడెంట్స్ అందరూ చప్పట్లతో స్వాగతం పలికారు.

అందరి పేపర్లు ఇచ్చేశాక, అప్పటి వరకూ క్లాసు వెనకాల కుర్చీలో ఎవరికీ తెలియకుండా కూర్చున్న రావుగారు ముందుకి వచ్చి చిరునవ్వుతో "నాకు రెండు రోజుల క్రితం మీరందరూ చేసిన వర్క్ కి కాలిఫోర్నియా లో డాక్టర్లు పంపిన మొదటి విడత పేమెంట్ పదివేల డాలర్లు అందింది. బ్యాంకు నుంచి నిన్న డ్రా చేశాను. మీకందరికీ ఆ డబ్బు డాక్టర్ గారు తన చేతులతో మీకు అందజెయ్యమని కోరుతున్నాను" అనేసరికి ఆనందంతో స్టూడెంట్స్ చేసిన కరతాళ ధ్వనులకి ఆ బిల్డింగ్ దద్దరిల్లింది.

ఒక్కొక్క స్టూడెంట్ వచ్చి శివరామ్ చేతినుండి కవర్ తీసుకుని కౌగలించుకున్నవారు కొందరైతే పాదాభివందనం చేశారు మిగిలిన వారు. ఆ కార్యక్రమం అయిపోయాక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్ లు శివరామ్ మీద మాట్లాడి, ఆయన టీచింగ్ వలననే తాము కష్టం అనుకున్న మెడికల్ టర్మ్స్ సులువుగా నేర్చుకున్నామని అందుకు ఆయనకు సర్వదా కృతజ్ఞులమై ఉంటామని ఉద్వేగంతో మాట్లాడారు.

అప్పుడు శివరామ్ కళ్ళు తడి అవడం రావుగారి దృష్టి దాటిపోలేదు.

ఆ చిన్నపాటి ఫంక్షన్ అయిపోయాక రావుగారు, శివరామ్ ప్రిన్సిపాల్ రూమ్ లో మాట్లాడుకుంటూ ఉంటే వచ్చిందా ప్రస్తావన.

"డాక్టర్ గారూ ! మీరు సెన్సిటివ్ లాగుంది. మీ కళ్ళ నీరు ఇవాళ చూశాను." అన్నాడు రావు గారు చిరునవ్వుతో.

"ఇదివరకు ఇటువంటి విషయాలకు స్పందించే వాడిని కాదు రావు గారూ ! నా పేషెంట్లు త్వరగా కోలుకుని పొగిడితే ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు నాకు అలవాటు అంతగా లేని పని గురించి పొగడడం వింటే అసంకల్పితంగా కంట నీరు తిరిగింది !" అన్నాడు శివరామ్.

ఒక్క రెండు నిమిషాలు మౌనం రాజ్యమేలింది ఇద్దరి మధ్య !

దానిని భంగపరుస్తూ అన్నాడు శివరామ్ "రావుగారూ ! నా నిర్ణయం మార్చుకున్నాను. నెక్స్ట్ బ్యాచ్ కి కూడా ట్రైనింగ్ ఇస్తాను, ఐ మీన్ మీరు ఒప్పుకుంటేనే !"

"నిజమా డాక్టర్ గారూ ? నేను ఒప్పుకుంటేనే అంటారేమిటి ? నాకు పరమానందంగా ఉంది ! మరి మీ శ్రీమతి ? వారికి అభ్యంతరం లేదు కదా ? పాపం మీరు ఈ ఏడాది అంతా సమయం మా కోసం వెచ్చించారు !"

"లేదండీ ! తన ప్రోద్బలంతోనే ఈ నిర్ణయానికి వచ్చాను. ఈ ఏడాదిలో నాలో వచ్చిన మార్పుకి తనకీ చాలా సంతోషంగా ఉంది " అన్నాడు శివరామ్.

ప్రశ్నార్ధకంగా చూస్తున్న రావుగారి తో "ఇక్కడ టీచింగ్ కి మీరు పిలిచిన కొద్ది రోజుల ముందు నా హాస్పిటల్ లో నాకు బాగా తెలిసిన వ్యక్తులే, నా మీద దాడి చేశారు రావుగారూ ! వాళ్ళకి తెలిసిన వారమ్మాయి, చిన్న పిల్లని పదిహేను రోజులుగా జ్వరం వస్తూంటే అశ్రద్ధ చేసి చివరి నిముషంలో నా దగ్గరికి తీసుకుని వచ్చారు. నేను వేరే చోటికి తీసుకుని వెళ్ళమన్నా, తాత్సారం చేసి తీరా ఆ పాప ప్రాణాలు పోయాక నేను చేసిన అశ్రద్ధ వలననే పాప చనిపోయిందని విచక్షణ లేకుండా కొట్టారు. పోలీసులు వచ్చేసరికి పాప దేహాన్ని తీసుకుని పరారైపోయారు. వారెవరో నేను పోలీసులకిచ్చిన వాంగ్మూలం లో చెప్పినా ఏ చర్య తీసుకోలేదు. వాళ్ళకి రాజకీయ సంబంధాలు ఉన్నాయని తర్వాత తెలిసింది.
"ఆ సంఘటనతో నాకు కోపము, దుఃఖము, కుంగుబాటు, ఆత్మహత్య ఆలోచనలు వచ్చేశాయి. నా భార్య ఎంతో ధైర్యం చెప్పింది, కానీ ఆ క్షణంలో ఆ సంఘటన అనుభవించిన వారికి తెలుస్తుంది ఆ మానసిక ఒత్తిడి. ఇది జరిగిన పది రోజుల తర్వాత మీరు నన్ను కలిసి ఈ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పినప్పుడు ఆమే చాలా ప్రోత్సహించింది. నేను నిరుత్సాహంగానే ఒప్పుకున్నాను.

"కానీ ఇక్కడ పాఠాలు మొదలు పెట్టాక నాలో ఈ టాలెంట్ ఉన్నదని నాకు అర్ధమైయ్యసరికి ఆశ్చర్యం కలిగింది.

"ఆ తర్వాత నా మెడికల్ ప్రాక్టీస్ క్రమబద్ధం చేసుకున్నాను. నా కుటుంబం, ప్రాక్టీస్, ఈ ఇన్స్టిట్యూట్ ఈ మూడే నా లోకం అయిపోయాయి. ఈ రోజు స్టూడెంట్స్ మాట్లాడింది వింటూంటే అందుకే అప్రయత్నంగా కంట నీరు తిరిగింది. నా భార్య కూడా నేను ఇక్కడ చేరాక నాలో మార్పుని గమనించి చాలా ఆనందపడింది."

రావుగారు చాలా కదిలి పోయారు. "డాక్టర్ గారూ ! నేను ఇదివరకు అనుకున్న మాట ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, మీకు ఇందులో పార్ట్ నర్ షిప్ ఇద్దామని అనుకున్నాను ! కానీ మీరు వెళ్ళిపోతారు కదా అని కొంత నిరుత్సాహ పడ్డాను. మీకు నా ఇన్స్టిట్యూట్ లో పావలా వంతు పార్టనర్ ఆఫర్ చేస్తున్నాను మీకు ఒప్పుదలేనా ? మీరు పెట్టుబడి ఏమీ పెట్టక్కరలేదు. మీ టీచింగే మీ పెట్టుబడి !" అని చేయి చాచిన రావుగారిని మ్రాన్పడి చూస్తున్న శివరామ్ మెల్లగా పెదవులపై చిరునవ్వు రాగా ఆ చేతిని అందుకుని గాఢంగా ఊపేశాడు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @