విధి @

 బయట వాకిట్లో అమ్మాయి గొంతుక వినిపిస్తోంది. ఎవర్నో ఏదో వివరాలు అడుగుతున్నట్లుంది. ఆగి ఆగి సంభాషణ వినిపిస్తోంది. వినికిడి తక్కువ అవడం వలన అస్పష్టంగా ఉంది.


నారాయణరావు నిస్త్రాణ గా అలాగే పడుకుండిపోయాడు. "పాపా !" అని పిలిచాడు పీలగొంతుకతో. ఆ సన్నటి గొంతు ఆమెకు ఎలా వినపడిందో కాని వెంటనే లోపలికి వచ్చింది.

"ఎవరదీ ? వెచ్చాలకొట్టు ఆవిడేనా ?"

"కాదు. తాలూకా ఆఫీసు నుంచి ! ఏవో వివరాలు అడుగుతోంది !"

"మన గురించి వివరాలేం ఉంటాయి ? రేషన్ కార్డు గురించా ? మన గులాబి కార్డు దేనికీ ఉపయోగించదు కదా ? ఇంకేం కావాలి ?"

చొరవగా లోపలికి వచ్చి కుర్చీ లాక్కుని కూర్చుని "నా పేరు లావణ్య అండీ! ఎమ్ ఆర్వో ఆఫీసులో ఆరైగా ఉంటున్నాను. మీకు కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశారు కదా ? దాని కోసం వచ్చాను. మీ గురించి వివరాలు సేకరించి ఫోటో తీసుకుని ఆ సర్టిఫికేట్ తయారు చేసి ఇస్తాము." అన్నదామె.

"ఎప్పటి దరఖాస్తమ్మా ? మూడు నెలలు అయింది. ఇప్పటికి తీరుబడి అయిందా ?" అని కొద్దిగా గొంతు పెంచి అడిగాడు నారాయణరావు.

"మీరు అప్లై చేసినప్పటి ఆరై గారికి అప్పటిలో రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళు విరిగి ఆపరేషన్ అయిందండీ. అప్పటిలో ఇన్ చార్జి ఆరై సర్దుళ్ళలో మీ అప్లికేషన్ ఎక్కడో అడుగుకి వెళ్ళిపోయింది. క్రితం వారమే నేను పూర్తి ఛార్జ్ తీసుకుని అన్నీ ఒక కొలిక్కి తీసుకొస్తున్నపుడు మీ అప్లికేషన్ బయట పడింది. నాకు చాలా బాధ వేసింది, మూడు నెలల క్రితం పెట్టిన అప్లికేషన్ ఇంకా పెండింగ్ లో ఉన్నదే ! అని. అందుకే ముందుగా మీది క్లియర్ చేద్దామని వెరిఫికేషన్ కి వచ్చాను." అన్నది.

"అలాగా తల్లీ ! ఏమనుకోకమ్మా ! కొద్దిగా దురుసుగా మాట్లాడాను."

"ఏమీ ఫర్వాలేదు సార్ ! మీ కోపానికి ‌కారణం సరైనదే కదా ? ఇంతకీ చనిపోయినది ఎవరు ? మీకేమౌతారు ?"

"మా అబ్బాయి అమ్మా ! ఇరవై తొమ్మిది ఏళ్ళు. పెళ్ళై రెండు సంవత్సరాలు అయింది. కోడలు పురిటిలో బీ పీ ఎక్కువై ఫిట్స్ వచ్చి మెదడులో నరాలు చిట్లి చనిపోయింది ఏడాది క్రితం. నాలుగు నెలల క్రితం మా అబ్బాయి కూడా...!" అంటుండగానే గొంతు రుద్ధమై కళ్ళ నీళ్ళు తిరిగాయి.

ఇటువంటి సన్నివేశాలు ఆమెకి అలవాటే అయినా ఎందుకో కదిలిపోయింది లావణ్య.

"ఎలా పోయారు మీ అబ్బాయి ?"

"సైకిల్ మీద మెయిన్ రోడ్ మీద వాడు పనిచేసే ఢాబా నుంచి వస్తుండగా లారీ గుద్దేసింది. అక్కడికక్కడే..." అని మళ్ళీ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు.

"ఆ లారీ డ్రైవర్ దొరికాడా ?"

"లారీ డ్రైవర్ ఓనర్ తో వచ్చి అబ్బాయి బాడీని అప్పగించి గుండెలు పగిలేలా ఏడ్చాడమ్మా ! తన ఇరవై మూడు సంవత్సరాల డ్రైవింగ్ లో మొదటిసారి యాక్సిడెంట్ అని, కంట్లో హఠాత్తుగా పురుగు పడేసరికి ఒక్క క్షణం అదుపు తప్పేసరికి ఘోరం జరిగిపోయింది అని కాళ్ళ మీద పడ్డాడు. అతనికి స్కూలుకు వెళ్లే ఇద్దరు పిల్లలు. ఆ ఓనరు చెప్పాడు. అతను నా స్టూడెంటే. తన జేబులో నుంచి అప్పటికప్పుడు ఇరవై వేల రూపాయలు ఇచ్చి కార్యక్రమాలు జరిపించాడు. థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ వస్తుందని ఈ సర్టిఫికెట్ కి దరఖాస్తు చేయించాడు. కానీ తర్వాత వారం రోజులకి గుండె పోటు వచ్చి హఠాత్తుగా పోయాడు." అని ఒక నిముషం ఆగాడు.

"నాది నష్టం జాతకం అమ్మా ! నా భార్య వీడు ఐదేళ్ల వయసులో టైఫాయిడ్ వచ్చి పోయింది. వీడే సర్వస్వం అనుకుని పెంచాను. వీడికి పుట్టుకతో ఏదో మెంటల్ ప్రాబ్లం వచ్చి మెదడు ఎదుగుదల సరిగా లేక చదువు అబ్బలేదు. నేనే ఇంటి దగ్గర తంటాలు పడి పదో తరగతి వరకు నేర్పించాను. ఆ తర్వాత చదవలేనని, మాకు తెలిసిన ఢాబాలో పనికి కుదిరుకున్నాడు. ఏం మాటకి ఆ మాటే ! చాలా విశ్వాసంతో పనిచేసేవాడు."

"వాడి మంచితనం చూసి ఇష్టపడి చేసుకున్నది నా కోడలు. పెళ్ళైన కొద్ది రోజులకే గర్భిణీ వేస్తే సంబరపడిపోయాము. కానీ మా మీద దేవుడు చిన్నచూపు చూశాడు. కోడలూ దక్కలేదు, బిడ్డా దక్కలేదు" అన్నాడు నిర్వికారంగా. ఆయన కళ్ళలో నీళ్ళు ఎప్పుడో ఇంకిపోయాయి.

"ఆ థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ రావాలంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కావాలిట ఇన్స్యూరెన్స్ కంపెనీకి. అందుకే ఈ తిప్పలు" అన్నాడు.

"మీ భార్య ఎప్పుడో పోయింది అన్నారు. ఈవిడ ఎవరు ?" అనడిగింది లావణ్య.

"నా చెల్లెలు, వియ్యపురాలు కూడా ! తన కూతురే నా కొడుకుని కోరి చేసుకుంది. దానికి, నా కొడుకుకి, మాకు కూడా దురదృష్టం వెంటాడుతూనే ఉంది." అని ఈ సారి ఆగకుండా వచ్చిన దుఃఖంతో వెక్కివెక్కి ఏడ్చాడు నారాయణరావు.

ఒక అరగంట ఆ మాటా ఈ మాటా చెప్పి ‌బయటకి వచ్చేసిన లావణ్య దీర్ఘంగా నిశ్వాసం తీసుకుంది.

తన చిన్న పొరపాటు వలన ఒక కుటుంబం ఛిన్నాభిన్నం అయిందని ఏడిచి ఏడిచి పక్షవాతం బారిన పడిన తన అన్న గంగాధర్ గుర్తుకి వచ్చాడు.

అన్నను చూసుకోవడానికి తను ఉన్నది, కానీ విధి వక్రించి చూడడానికి ఎవరూ లేని నారాయణరావు, ఆయన చెల్లెలికి ఆ ముసలి వయసులో ఎవరున్నారు అని ఆలోచిస్తుండగానే ఆమెకి కూడా తెలియకుండానే కంట నీరు కారిపోయింది.

(ఇది నా స్వంత రచన. వేరే ఎక్కడా ప్రచురణ పొందలేదు)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @