మనుషులు మమతలు@
మనుషులు మమతలు
అదే హాల్లో, వీళ్ళకు కాస్త దూరంలో, శూన్యంలోకి దిగులుగా చూస్తూ కూర్చొని ఉంది అతని భార్య మహాలక్ష్మి.
"మీ ఇష్టం నాన్నా! కానీ ఇంత అర్జంట్ గా ఎందుకు ఈ పంపకాలు!?"
మనోహర్ వైపు చూసాడు. అతను తలవంచుకుని ఆలోచిస్తున్నాడు.
"సంవత్సరంగా క్యాన్సర్ కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. డెబ్బయ్యేళ్ళు దాటాయి. శరీరం రోజుకో రకంగా ఉంటోంది. నాకు ఏ క్షణాన ఏమౌతుందో తెలీదు. మీ అమ్మ ఈ ఊరిలోని ఈ ఇంట్లోనే ఉంటానంటోంది." ఏ భావోద్వేగాలు లేని ముఖంతో వివరించాడు.
"నాన్నా! మీరేమనుకోనంటే నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను."
"తప్పకుండా మనూ!"
ముగ్గురు మనోహర్ వైపు చూస్తున్నారు. అందరినీ ఓసారి చూసి, తండ్రి వైపు తిరిగి....
"అన్నీ సమానంగా అంటున్నారు కాబట్టి చెప్పాలనిపిస్తుంది. చెల్లి మెడిసిన్ చేసింది. పీజీ అయ్యేప్పటికి ఎనిమిదేళ్ళ అయ్యింది తన చదువు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు?!
నేను చదివింది ఎమ్ టెక్. ఆరేళ్ళు. మెరిట్ లో ఫీజు కూడా తక్కువే.
తనూ పెళ్ళికి కట్నం లేకపోయినా తన బంగారం కోసం, పెళ్ళి ఖర్చులకు ఎన్ని లక్షలైంది?!
నా పెళ్ళికి ఎంత ఖర్చయింది!?
తనకు రెండు కాన్పులు, శ్రీమంతం, బారసాలలు ఎంత ఖర్చయింది!?
నాకోసం ఇటువంటి ఖర్చులు ఏమున్నాయి?!
రేపు అమ్మ ఒంటరైతే తనను ఆడపిల్ల చూసుకోవాల్సిన బాధ్యతలేదంటారు.
ఇప్పుడు మాత్రం ఎంతో న్యాయంగా ఆస్తిలో ఆడపిల్లకు సమానమైన హక్కు ఉందంటున్నారు!" ఆవేదనగా అన్నాడు.
ముగ్గురూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అతని వైపు.
*********
తరువాత.....
"నాన్నగారూ ! క్షమించండి ! ఇది నా బాధ కాదు, అర్చనది !" అన్నాడు మనోహర్.
నిర్ఘాంతపోయారు విరూపాక్ష, తన్మయి, మహాలక్ష్మి.
"ఏమిటి మనూ నువు మాట్లాడేది ?" అన్నాడు విరూపాక్ష తీవ్రంగా.
మహాలక్ష్మి నోరు తెరిచింది తెరిచినట్లే ఉంది. తన్మయి మాత్రం అపనమ్మకమో, నిర్వేదమో తెలియని కవళికతో అన్నని చూస్తూ ఉండిపోయింది.
కొన్ని సంవత్సరాల వెనుకకి వెళ్తే.....
తన్మయికీ మనోహర్ కి ఏణ్ణర్ధం వార ! ఇద్దరూ కవల పిల్లలు అనుకునేవారు చాలామంది. మనోహర్ పదిహేను ఏళ్ళ వయసు నుంచి పొడుగు పెరగడం మొదలు పెట్టాక ఇద్దరిలో పోలికలు తగ్గడం మొదలయ్యాయి. కానీ ఇద్దరూ చిన్నపుడు ఎంత కలిసి ఆడుకునేవారో పెద్దయ్యాక కూడా అంతే ప్రేమాభిమానాలతో ఉండేవారు.
మనోహర్ లెక్కల్లో ఉద్దండుడు. ఇంటర్లో స్టేట్ ర్యాంక్ సాధించి ఆర్ ఈ సీ లో తనకి ఎంతో ఇష్టమైన మెటలర్జీలో సీటు సంపాదించి బీటెక్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ గా పూర్తి చేసి ఐ ఐ టీ ఖరగ్ పూర్ లో స్కాలర్షిప్ తో సీట్ సంపాదించి విజయవంతంగా పూర్తి చేసి మంచి ఉద్యోగాలను కాదనుకుని తల్లిదండ్రులు, చెల్లాయి కి దగ్గర ఉండాలని హైదరాబాద్ మిశ్ర ధాతు నిగమ్ లో చేరి సెటిల్ అయ్యాడు.
తన్మయి ఎమ్ బి బి ఎస్ చదువుతానంటే మనోహరే తండ్రిని ఒప్పించి అంగీకరింపజేశాడు. మెరిట్ జాబితాలో రాకపోయినా ఆమెకు ఇష్టమైన వృత్తిని ఎంచుకున్నదని చెప్పి బతిమాలి, బెదిరించి, చివరికి కళ్ళనీళ్ళు పెట్టుకుని అనుకున్నది సాధించాడు. ఆ టైముకి మనోహర్ బీ టెక్ మూడవ సంవత్సరంలోకి వచ్చాడు. తనది ఎలాగూ ఫీజు తక్కువ కాబట్టి చెల్లాయిని మెడికల్ ఫీల్డ్ లో ఎంతవరకు చదువుతుందో అంతవరకు చదివించమని, ఎడ్యుకేషన్ లోన్ తీసుకోమని, తను ఉద్యోగం వచ్చాక తీరుస్తానని మాట కూడా ఇచ్చాడు.
చెల్లాయి గురించే పట్టుదలతో చదివి, యూనివర్సిటీ ప్రథముడిగా వచ్చి, ఎమ్ టెక్ స్కాలర్ షిప్ తెచ్చుకునేదాకా తపస్సు లాగ చదివాడు.
బీ టెక్ పూర్తి చేసుకుని పీ జీ ఎంట్రెన్స్ గేట్ వ్రాసి, సీట్ తెచ్చుకునే సమయానికి తనూ కూడా ఎమ్ బి బి ఎస్ చివరి సంవత్సరంలోకి వచ్చేసింది. ఆ సంవత్సరం లోనే తన సీనియర్, పీ జీ చదువుతున్న శ్రీకర్ తో ప్రేమలో పడి, అన్నయ్య దన్నుతో తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ పెళ్ళి, ఆ తర్వాత వెంటనే పిల్లాడు పుట్టడం జరిగినా, బాగా చదివి మెడిసిన్, ఆ తర్వాత హౌస్ సర్జన్ పూర్తి చేసి ఆ ఊపులోనే గైనకాలజీ లో ఎమ్ డీ సీట్ సంపాదించింది.
తనూ కి పిల్లాడు పుట్టే సమయానికి మనోహర్ ఎమ్ టెక్ పూర్తి చేసుకుని, మిథానీ లో చేరడానికి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేశాడు. తనూ ఎమ్ డీ పూర్తి చేసుకునే సమయానికి శ్రీకర్ కూడా డీ ఎమ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ లో కార్పొరేట్ హాస్పిటల్ లో కన్సల్టెంట్ గా చేరాడు. అదే హాస్పిటల్ లో తనూ కూడా గైనకాలజిస్ట్ గా చేరింది. ఆ తర్వాత ఒక పాప కూడా కలిగింది.
ఆ తర్వాత ఐదేళ్ళకి తల్లి దండ్రులు చూసి వాళ్ళెంతో ఇష్టపడ్డ అర్చన ని వివాహం చేసుకున్నాడు.
అర్చన కూడా బీ టెక్ చదివి ఉద్యోగం చేస్తున్నది. పెళ్ళి అయిన తరువాత ఆమె ఉద్యోగం చేసే కంపెనీ వారిని రిక్వెస్ట్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ అత్తమామలను చూసుకునేది. కొద్దిరోజులలోనే అత్తగారు మహాలక్ష్మికి రెండో కూతురు అయిపోయింది. తన్మయి కూడా వదిన అంటే ప్రాణం పెట్టేది. కానీ మనోహర్ పెళ్ళి అయిన రెండు సంవత్సరాలకి విరూపాక్ష కి ప్రోస్టేట్ గ్రంథి కాన్సర్ అని తెలిసి అందరూ హతాశులైపోయారు, కానీ శ్రీకర్ తనకు ఉన్న పరిచయాలతో ముంబై టాటా కాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఆంకాలజిస్ట్ ను సంప్రదించి, కొత్త చికిత్సా విధానాలు ఉపయోగించి త్వరగానే కంట్రోల్ లోకి తీసుకుని వచ్చాడు. కానీ పూర్తిగా కాన్సర్ నయమవుతుందని ఖచ్చితంగా చెప్పలేమని, మందులు వాడుతూ ఉండాలని చెప్పారు.
దానాదీనా మందులు మొదలుపెట్టి సంవత్సరం తర్వాత ఈ వీలునామా ప్రస్తావన వచ్చింది.
@@@@@ @@@@@ @@@@@
"అవును అమ్మా నాన్న గారూ ! నిన్న రాత్రి మీరిద్దరూ నిన్న రాత్రి వీలునామా గురించి మాట్లాడుకుంటుండగా అమ్మ ఏడ్వడం వంటింట్లో నుంచి మా రూమ్ లోకి వస్తుండగా విని కంగారు పడి తను ఏమైనా సాయం చేయగలనేమో అని మీ గది వైపు వస్తుండగా నాన్నగారు గట్టిగా కసిరి ఏడవద్దని గట్టిగా అనడం విని ఆగిపోయిందట. ఆ తర్వాత మీ మాటలు పూర్తిగా విని మా గదిలోకి వచ్చి తలుపు గడియ వేసి ఈ మాటలు అంది."
తల్లిదండ్రులు ఇద్దరూ అపనమ్మకంతో తలలు అడ్డంగా ఊపితే మహాలక్ష్మి అందుకుని అన్నది "నేను నమ్మను. అర్చన అలా మాటలాడే పిల్ల కాదు. తను మన ఇంట కాలు పెట్టి మూడేళ్ళవుతోంది. తన తత్వం అలాంటిది కాదు. నువ్వే ఈ ఊహలు పెట్టుకుని అవి అర్చన మీదకి తోసేస్తున్నావు."
తన్మయి "నేను కూడా నమ్మను అన్నాయ్ ! వదిన నా కన్నా రెండేళ్ళు చిన్న. కానీ చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తుంది. నువ్వు కూడా ఇటువంటి మాటలు మాట్లాడే మనిషివి కావు. ఏమైందిరా ? మమ్మల్ని టెస్ట్ చేద్దామనా ? ఇది అటువంటి వాటికి సరైన టైమ్ కాదు. నీ ఆలోచన ఏమిటో చెప్పు. వదిన గురించి అమ్మ ఏమనుకుంటోందో నేనూ అదే అనుకుంటున్నాను. ఇది సరదా విషయం కాదు" అన్నది.
మనోహర్ "అర్చన కూడా త్వరపడి మాటజారే మనిషి కాదు. ఆ సంగతి తెలుసు కాబట్టే త్వరపడి నేనేం మాట్లాడలేదు. ఒక పది నిమిషాలు అయిన తర్వాత సంబాళించుకుని నా చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పింది. ఎందుకని అలా మాట్లాడిందో చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది. తను ఎంత పశ్చాత్తాప పడిందంటే తను మీ ఎదుట పడలేక తను మాట్లాడింది ముందు మీకు చెప్పి మీరు క్షమించాకే ఎదుట పడతాననీ, నేను ఈ విషయం మీ దగ్గర చెప్తానని నా చేత ప్రమాణం చేయించుకున్నది" అన్నాడు.
విరూపాక్ష, మహాలక్ష్మి, తన్మయి తెల్లబోయారు. ముందుగా తన్మయే తేరుకుని "అదేమిటి రా అన్నాయ్ ! వదిన మమ్మల్ని దూరం పెట్టినట్లు మాట్లాడాలా ? మాకు క్షమాపణలు చెప్పాలా ? ఏదీ వదిన ? వదినా !" అని పిలుస్తూ సోఫా లోనుంచి లేచే సరికి, ఆ పక్కన ఉన్న మనోహర్ రూమ్ లో నుంచి వచ్చి తన్మయిని చుట్టేసి "వదినా !" అని కావిలించుకొని ఏడ్చేసింది అర్చన.
ఆ తర్వాత తన్మయి చేతులని నెమ్మదిగా విడిపించుకుని అత్త మామల దగ్గరకు వెళ్ళి మోకాళ్ళ మీద వంగి వారి పాదాలకి నమస్కారం చేసి "మీ అబ్బాయి దగ్గర చెప్పడం కాదు, మీకు ప్రత్యక్షంగా చెప్తున్నాను. నన్ను క్షమించండి. నేను ఇలా అన్నానని ఆయన చెప్పినా మీరు నా మీద నమ్మకంతో అన్న మాటలు నేను జీవితాంతం మరువలేను. మా అమ్మ, నాన్న ఇద్దరి కన్నా మీరే నాకు పెద్దలు" అంటుండగా ఆమె కంఠం రుద్ధమైపోయింది.
మహాలక్ష్మి ఆమెను లేవదీసి తన పక్కనే కూర్చోబెట్టుకొని కౌగిలించుకుని, "నీ సంగతి మాకందరికీ తెలుసమ్మా ! అందుకే నువ్వు అలా మాట్లాడావంటే నమ్మలేదు. అసలేమైంది ? ఎందుకని అలా మాట్లాడావు ?" అని లాలనగా అడిగింది.
అర్చన వెక్కుతూనే చెప్పింది "మా నాన్నగారు కూడా ఈ మధ్య దాదాపుగా ఇదే పరిస్థితుల్లో వీలునామా ఇలాగే వ్రాస్తానని అంటే మా అన్నయ్య, వదిన తెలిసి పెద్ద పోట్లాట పెట్టుకున్నారుట, రెండు రోజుల క్రితమే అమ్మ చెప్పింది. ఆస్తి తమకే రావాలని, నా పెళ్ళికి చేసిన ఖర్చు గుర్తు తెచ్చుకోమని నాన్నగారితో చెప్పారట. ఆ ఖర్చులు అధిక భాగం మీరే పెట్టారని నిన్న రాత్రే ఈయన చెప్పారు మామయ్యగారూ ! ఆ తర్వాత తనూకి కాన్పులకి, బారసాలలకీ ఖర్చులు అన్నయ్య గారు అదే శ్రీకర్ గారు పెట్టుకున్నారనీ, మీ కాన్సర్ చికిత్సకి కూడా అన్నయ్యగారు ఆయన డాక్టర్ గా తన పలుకుబడి ఉపయోగించి చాలా తక్కువ ఖర్చులో వైద్యం చేయించారని ఈయన నిన్న రాత్రి చెప్తేనే తెలిసింది. అన్నయ్య గారు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని కూడా ఈయన దగ్గర ప్రామిస్ తీసుకున్నారట. తన్మయి మెడిసిన్ చదివినప్పటి ఖర్చులు, పీ జీ చదివినపుడు అయిన ఖర్చులు కూడా ఆయన ఇస్తానని అన్నపుడు మీరు సున్నితంగా తిరస్కరించారని కూడా చెప్పారు. అత్తయ్యా ! మామగారూ ! మనుషుల్లో దేవుళ్ళు ఉన్నారని మీ అందరినీ ఈ రోజు చూసి తెలుసుకున్నానండీ !" అని మళ్ళీ అత్తగారిని కౌగిలించుకుని ఏడ్చేసింది.
"మాకూ తెలిసింది, నీ లాంటి దేవత కోడలుగా వస్తుందని" అన్నది మహాలక్ష్మి చిరునవ్వుతో.
అందరి మొఖాల మీద నవ్వు విరిసింది. అంతకు ముందు కాన్సర్, వీలునామా ఇవేమీ మాటలు జరిగినట్లే అనిపించలేదు ఎవరికీ.
సమాప్తం
ఇది పూర్తిగా నా స్వంత రచన
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి