కబంధుడు
రామాయణం లో చిన్న పాత్రలు
కబంధుడు
జటాయువు మరణం తర్వాత అంత్యక్రియలు, తర్పణాలు ఇవ్వడం అయిన తరువాత అశ్రునయనాలతో దండకారణ్యం దాటి నైఱుతి దిశగా ప్రయాణించి క్రౌంచారణ్యం ప్రవేశించారు శ్రీ రామ లక్ష్మణులు.
కొంత దూరం సాగాక భయంకరమైన శబ్దాలు చేస్తూ ఒక వికృతాకార రూపిణి వారికి అడ్డంగా వచ్చి వారిద్దరినీ తేరిపార చూచి లక్ష్మణుడిని చేత చిక్కించుకుంది.
"ఆహా ! ఎర్రగా కళకళలాడుతూ ఉన్నావు. నా పేరు అయోముఖి. ఈ ప్రాంతంలో నాకు సాటియైన రాక్షసి, నా కన్నా అందగత్తె లేదు . నిన్ను ఆ మన్మధుడే నాకు భర్తగా పంపాడని అనిపిస్తోంది. ప్రియతమా ! నన్ను పెళ్ళాడి నీ భార్యగా చేసుకో. మనం స్వర్గసుఖాలను ఆనుభవిద్దాము. రా ! ప్రియతమా!" అన్నది.
కొద్ది రోజుల వ్యవధిలో రెండుసార్లు ఇటువంటి ప్రతిపాదన, అందునా రాక్షస స్త్రీ దగ్గరనుంచి వచ్చేసరికి లక్ష్మణుడు ఆగ్రహం హద్దులు దాటిపోయింది. ఒక్క ఉదుటున తన కరవాలం తీసి కనురెప్పపాటులో ఆమె నాసాగ్రానినీ, స్తనాగ్రానాలను కోసేసాడు.
హాహాకారాలు చేస్తూ ఆ వికృత రూపిణి ఆ అడవిలోకి పరిగెత్తింది.
ఆ తర్వాత వారిద్దరూ సీతమ్మ కోసం వెతుకుతూండగా మేఘ గర్జన వినబడింది. శ్రీ రాముడు తల ఎత్తి నలుదిసలా పరికించి "తమ్ముడూ ! ఆకాశం అన్నివైపులా నిర్మలంగా ఉంది. ఈ శబ్దం ఏమిటా అన్నది తెలియకున్నది" అన్నాడు. లక్ష్మణుడు తల తాటిస్తూ అవును అన్నా ! ఇది వర్షకాలమూ కాదు. కానీ నా ఎడమ కన్ను అదురుతున్నది. ఏదో ఉపద్రవం రాబోతున్నదనిపిస్తున్నది. విల్లంబులు, ఖడ్గము చేత ధరించు అన్నా !" అంటూ తను కూడా అపాయానికి సన్నద్ధుడై నిలిచాడు.
ఎక్కడ నుంచో ఇద్దరినీ ఇనుప పట్టులో బిగించి రెండు గొప్పవైన చేతులు అతివేగంగా ఒకే వైపుకి లాగుకుని వెళ్ళసాగాయి. శ్రీ రాముడు "తమ్ముడూ ! ఈ హస్తాలు ఖండించడానికి ఖడ్గాలు కూడా తీయడానికి వీలు లేకుండా పట్టుకున్నాయి, ఇలా చిక్కుపడిపోయామేమిటి నాయనా?" అన్నాడు నిరాశ, నిస్పృహ కలిసి ముప్పిరిగొనగా.
ఆ చేతులు ఒక వికారమైన, లోక భీకరమైన ఆకారం దగ్గరకు వారిద్దరినీ లాగుకొని పోయాయి. ఆ ఆకారానికి తల లేదు, కాళ్ళు లేవు. ఉన్నదల్లా మొండెమే. ఆ మొండెం పై భాగంలో ఒకటే పెద్ద కన్ను ఉన్నది. ఆ క్రింద ముక్కు, దాని క్రింద గుహను పోలిన విశాలమైన నోరు అందులో అనేక రకాలైన మృగాలను చీల్చి, నమిలి తినడం వలన రక్త మాంసాలతో జుగుప్స కలిగించే పలువరసతో ఉన్నది. ఆ మొండానికి ఉన్నవి రెండు చేతులు మాత్రమే. అవి చాలా పొడుగు ఉండి ఆ ఆకారం నోటి దగ్గరికి ఆహారం చేర్చడానికి ఉపయోగపడుతున్నాయి.
లక్ష్మణుడు "అన్నా ! వీడికి ఉన్న రెండు చేతులు భుజాల దగ్గర ఖండించేస్తే వీడి బలం నిర్వీర్యం అయిపోతుంది. " అన్నాడు. ఆ మాటలకి ఆ వికృతాకారుడు చలించి తన చేతులలో బందీలైన అన్నదమ్ముల మీద గుప్పిళ్ళు అసంకల్పితంగా పట్టు సడలించాడు. ఆ కొద్ది సమయంలో రామలక్ష్మణులు అతిలాఘవంగా తమ కరవాలాలను ఒరలలోనుంచి తీయడము, ఆ ఆకారం భుజాలను ఏక కాలంలో తెగనరకడము రెప్పపాటులో జరిగిపోయాయి.
ఆ భుజాలు నేల తాకే లోపు ఆ సోదరులు నేర్పుగా ఆ చేతులలో నుంచి బయటకు లంఘించేసారు.
ఆ వికృతాకారుడు ఆ అడవంతా ప్రతిధ్వనించేలా హాహాకారాలు చేస్తూ ఎటూ పారిపోయే దారి లేక నేల మీద పడి దొర్లుతూ "ఎవరు మీరు ? నా భుజాలు ఖండించిన వారి వలన నాకు శాపవిమోచనం జరుగుతుందని దేవేంద్రుడు చెప్పాడు."అని అన్నాడు.
దానికి లక్ష్మణుడు "మేము దశరధ చక్రవర్తి కుమారులము. ఈయన నా అన్న గారు, రాముడు. నా పేరు లక్ష్మణుడు. మా అన్నగారి భార్య అపహరణకు గురి అయింది. రావణుడు అన్న రాక్షస రాజు ఆమెను అపహరించి ఈ దిశగానే వెళ్ళాడని మా సన్నిహితుడు జటాయువు చెప్పారు. నీకు ఆ రాక్షసుని ఆనుపానులు తెలిస్తే చెప్పు" అన్నాడు.
ఆ వికృతాకారుడు తనకున్న ఒక కన్ను నుంచి బాష్పాలు రాలుస్తూ "ఆహా రాముడా ? దశరధ నందనుడా ? మహావీరా ! నా పేరు కబంధుడు. నా భాగ్యవిశేషము వలన ఇన్ని సంవత్సరాల తరువాత మీరు కనిపించారు. నా తండ్రి దనువు. నేను అత్యంత రూపలావణ్యములతో ఉండేవాడిని. నాకు ఉన్న కామరూప ధారణ శక్తి వలన కన్నూ మిన్నూ కానక స్థూలశిరుడు అనే మహర్షిని వికృత రూపంతో భయపెట్ట చూచాను. ఆ మహర్షి కుపితుడై ఈ రూపముతోనే బహుకాలము ఉండిపొమ్మని శపించాడు. నేను గర్వము ఉడిగిపోయి ఆయనను శాపాంతరం వేడుకున్నాను. శ్రీరాముడు సోదరసహితుడై నీ భుజములు ఖండించి నిన్ను అగ్నికి ఆహుతి చేసినప్పుడు నీకు పూర్వ రూపం వస్తుందని అనుగ్రహించారు.
"అనంతరం నేను బ్రహ్మ దేవుడి గురించి తీవ్ర తపస్సు చేసి దీర్ఘాయువు వరంగా పొందాను.
"ఆ తర్వాత నాకు బ్రహ్మ ఇచ్చిన బలగర్వంతో అదే రూపంతో ఇంద్రుని మీదకు దండెత్తాను. ఆయన వజ్రాయుధం తో నా తలను, కాళ్ళను మొండెంలోకి పోయేలాగున దెబ్బకొట్టాడు. నా బలమంతా దిగిపోయి దేవేంద్రుడిని ఈ రకంగా కాళ్ళు, తల లేకుండా బ్రతకడం ఎలాగు ? నన్ను చంపెయ్యమని వేడుకున్నాను. ఆయన నీకున్న స్థూలశిర మహర్షి శాపాన్ని నేను వమ్ము చేయలేను, నీకు రెండు యోజనాల పొడవున్న చేతులు ఇస్తున్నాను. వీటి సహాయంతో నీ ఉదరంలో ఉన్న నోటితో నీకు ఇష్టమైన జీవులను భక్షించు. ఎప్పుడైతే దశరధ చక్రవర్తి పుత్రుడు, రామనామధేయుడు, అతని సోదరుడు లక్ష్మణుడితో నీ భుజాలను నరికి నిన్ను అగ్నికి ఆహుతి చేసినప్పుడు నీకు మహర్షి శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు. రామా ! లక్ష్మణా ! ఇంకొక ఘడియలో సూర్యాస్తమయం అవుతుంది. ఆ లోపలే నా శరీరాన్ని అగ్నికి ఆహుతి చెయ్యండి. నా పూర్వ స్వరూపం వస్తే కానీ నాకు మీకు సహాయం చేసే జ్ఞానం రాదు." అన్నాడు.
రాముని ఆనతి మేరకు లక్ష్మణుడు ఎండు కట్టెలను తెచ్చి రాముడు కబంధుడిని ఒ కాళ్ళతో తొక్కి ఉంచగా అతని చుట్టూ పేర్చి అగ్నిని రాజేసాడు. ఆ శరీరం ఆహుతి అవుతుండగా దివ్య ఆభరణాలతో, పట్టు వస్త్రాలు ధరించి దను పుత్రుడు బయల్వెడలి ఆ సోదరులకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి "రామా ! లక్ష్మణా ! మీకు ఆ రావణుని గురించిన సమాచారం, వాడిని ఎదిరించే శక్తి నాకు లేవు. కానీ ఈ విషయమై నీకు సహకరించే వ్యక్తి గురించి చెబుతాను. లోకంలో కార్య సిద్ధి కావాలంటే ఆరు తంత్రములు ఉపయోగిస్తాయి.అవి సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైదీభావము, సమాశ్రయము. ఇందులో సమాశ్రయము నీకు ఉపయోగిస్తుంది. ఇంకొక బలవంతుడి స్నేహం చేయడమే సమాశ్రయం. నీకు అటువంటి బలవంతుడు ఇక్కడకు దగ్గరలోనే ఋష్యమూక పర్వతంలో
నివసిస్తున్న సుగ్రీవుడు అనే వానర రాజు తన మంత్రులతో ఉంటున్నాడు. తన అన్న అయిన వాలి చేతిలో పరాజితుడై భార్యా వియోగం అనుభవిస్తున్నాడు. అతడు నీకు సహాయం చేయగల సామర్థ్యం కలిగినవాడు. అతడితో అగ్ని సాక్షిగా మిత్రత్వం నెఱుపు రామా ! నీకు జయమగు గాక. ఆ దారిలో పంపా నది ఒడ్డున మతంగ మహర్షి ఆశ్రమం ఉన్నది. ఆయన శిష్యురాలు శబరి నీకై వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నది. ఆమె ఆతిధ్యం స్వీకరించి ఆమెను తరింపజెయ్యి తండ్రీ !" అన్నాడు కబంధుడు.
"నిన్ను చూసాను రామచంద్రప్రభో ! నాకు ఈ శాపం కూడా వరమే అయ్యేలాగున అనుగ్రహించిన స్థూలశిర మహర్షికి, దేవేంద్రుడికి నా సహస్రాధిక వందనాలు తెలుపుకుంటాను రామా ! మీ ఇద్దరికీ నా వేలవేల నమస్కారాలు. నాకు శెలవీయ వేడుకుంటున్నాను." అని దోసిలి ఒగ్గిన ఆ దను పుత్రుడికి అనుమతి ఇచ్చి ఆనందోత్సాహాలతో దక్షిణ దిశగా పంపా నది వైపు వడివడిగా అడుగులు వేసారు శ్రీరామ లక్ష్మణులు !
సమాప్తం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి