మీరే నా ప్రాణం @
మీరే నా ప్రాణం పడక గదిలో డబుల్ కాట్ మీద దిండ్లు రెండు వేసుకుని వెనకకి ఆనుకుని లా బుక్ ఒళ్ళో పెట్టుకుని దీక్షగా చదువుతున్నాడు గంగాధర్. ఓ పక్కన మరికొన్ని పుస్తకాలు ఉన్నాయి. రెండో పక్కన భార్య సర్వద పడుకుని ఉన్నది. ఎప్పుడూలాగనే ఒక పక్కకి ఒత్తిగిలి భర్త పొట్ట చుట్టూ చెయ్యి వేసి ఆదమరచి నిద్రపోతున్నది. అది అలవాటైన గంగాధర్ మరునాటి వాదించవలసిన కేసుకి సంబంధించిన పాయింట్లు చిన్న పుస్తకంలో నోట్ చేసుకుంటున్నాడు. ట్రాన్సిస్టర్ లో పాత తెలుగు పాటలు మంద్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. ఎంత మ్యూజిక్ సిస్టంలు, స్మార్ట్ ఫోన్ లు ఉన్నా అతనికి రాత్రి పూట రేడియోలో మధుర గీతాలు, ఛాయా గీత్ ఇవి వినడమే ఇష్టం. మంచి పాయింట్ ఒకటి దొరికి నోట్ చేసుకుంటుండగా ఘంటసాల గానం అతని ధ్యాసను తనవైపు అయస్కాంతం లాగా లాక్కుంది. "మనసున మనసై బ్రతుకున బ్రతుకై". అతనికి ఒకప్పుడు ఎంతో ఇష్టమైన పాట ! బీ ఎల్ చదివే రోజుల్లో ఆ పాట అంటే పిచ్చి గంగాధర్ కి. తన మానసిక స్థితికి దగ్గరగా ఉన్నదని తనకి ఒక గాఢమైన నమ్మకం. ఏ పని చేస్తున్నా ఆ పాటే పెదవుల మీద ఆడుతూ ఉండేది. ఉండడానికి స్నేహితులు ఉన్నా ఎందుకో తనని పట్టించుకోవటంలేదని అపోహ లాంటిది అతన...